తప్పెటగుళ్ళు

Tappeta Gullu

Telugu Festival Tradition : Tappeta Gullu

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను గానం చేస్తారు. వీరు ఎదురురొమ్ముపై తప్పెట గుళ్ళను కాళ్ళకు చేతులకు చిరు మువ్వలను దరించి అందరూ ఒకే పద్ధతిలో కదులుతూ గానం చేస్తుంటారు.


కళింగాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం ప్రాంతాల్లో కోనారులు, యాదవులు, గొల్లలుగా వ్యవహారంలో ఉన్న సామాజికవర్గానికి చెందినవారంతా గ్రామాల్లో ఎక్కువగా ఈనాటికీ మేకలు, గొర్రెల మందలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా గొర్రెలను, మేకలను పొలాలలోను, అడవులలోనూ మేపుతారు. రాత్రిపూట మందలవద్ద కాపలా కాస్తుంటారు. వీరు ఒంటరితనాన్ని మరచిపోవడానికి వీరి నోట నుంచి అనేక రకాలైన పాటలు వస్తుంటాయి. కుటుంబాలకు దూరంగా, రాత్రిపూట మందకాపలా సమయంలో వీరు తప్పెటగుళ్లు పాట, గొల్లచెరువు తదితర పాటలను, కాటమరాజు కథలను పాడుతుంటారు.

సిక్కోలు నేపథ్యంలో

తప్పెటగుళ్లు కళారూపం నాలుగు వందల సంవత్సరాల కిందట శ్రీకాకుళం ప్రాంతంలోనే మొదలైందని చెబుతున్నారు. జిల్లాలో గొల్ల శాఖకు చెందినవారు కళావిర్భావానికి మూలం అని అంటారు. ఇది ఒకనాటి శ్రీకాకుళం జిల్లాలో పుట్టినా ఇప్పుడు విజయనగరం, విశాఖ పట్నం, తూర్పు గోదావరి జిల్లాల వరకూ విస్తరించింది. కళారూపం పుట్టడం వెనుక కొన్ని కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. యాదవు లకు గోపాలుడే కులదైవం. అతను మృతిచెందినప్పుడు వీరంతా గుండెలపై కొట్టుకుని శోకించారట. అలా ఇది మొదలైందని ఒక కథ. క్రీస్తుశకం 12 శతాబ్దంలో యాదవరాజైన కాటమరాజుకు నెల్లూరు సిద్ధిరాజుకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆలమందలను కాపాడు కోవడానికి వారంతా డప్పులు, తాళాలతో గుండెలపై కొట్టుకున్నారని, అదే కళారూపమైందని మరోకథ ప్రచారంలో ఉంది.

కథాంశం శ్రీకాకుళంలో జన్మించినదే

తప్పెటగుళ్లు ప్రదర్శనలో కథాంశాలు ఎన్నున్నా అందులో కీలకమైనది మాత్రం శ్రీకాకుళంలో పుట్టిందే. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలను కళాకారులు గేయరూపకాలుగా అల్లుతుంటారు. 19 శతాబ్దానికి చెందిన శ్రీకాకుళం నివాసి బలివాడ నారాయణ రాసిన తొలి తప్పెటగుళ్లు కథా గేయంశ్రీకృష్ణఇప్పటికీ చాలా ప్రచారంలో ఉంది. అయితే కళాకారుల నోటి ద్వారా మౌఖిక సాహిత్యంలో మాండలికాలు, గ్రామీణ యాస, భాషలతో కూడిన పదాలే వస్తాయి. చెంచులక్ష్మి, సారంగధర, తూర్పు భాగవతం దరువులు, లక్ష్మణమూర్చ, తేలుపాట, గాజులో డిపాట, మందులో డిపాట, చుట్టపాట, పాలు, చల్లలమ్మడం వంటి స్థానిక ఇతివృత్తాల ఆధారంగా పాటలు పాడతారు. ఒక చరణం ఆలాపించి దానిని అనేక తాళ వరుసలతో పాడి దరువులు వేసి నృత్యం చేస్తారు. సుమారు కొన్ని గంటలు పాటు రెండు మూడు చరణాలను సాగదీసి పాడతారు.

పల్లె ప్రజల పోషణలో

జానపదాన్ని జనమే కాపాడుకుంటారన్నదానికి తప్పెటగుళ్లు నిలువెత్తు నిదర్శనం. గ్రామీణ ప్రజల పోషణలోనే కళ తన ఉనికిని కాపాడు కుంటూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఏటా జరిగే గ్రామదేవతల సంబరాలు, జాతర్లలోనూ పండుగ దినాల్లోనూ కళారూపాన్ని ప్రదర్శించడం తప్పనిసరి. ఇది లేకుంటే సందడే ఉండదు. అదే జానపద సంగీత నాట్య దృశ్య రూపకం ప్రత్యేకత. రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెట లాంటి ఒక వాయిద్య పరికరాన్ని గుండెలపై కట్టుకుని రెండు చేతులతోనూ వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధమైన రంగుల నిక్కర్లను తొడిగి, వాటికి, కాళ్లకు గజ్జెల గుత్తులు కట్టి, కేకలతో, వివిధ భంగిమలతో కేరింతలు కొడుతూ, ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ లయబద్ధమైన పదగతులతో అందరూ వంగుతూ, లేస్తూ, గెంతుతూ, సుదీర్ఘ రాగాలతో ఆలాపిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తారు.

గురువే బృందనాయకుడు

తప్పెటగుళ్ల బృందానికి గురువే నాయకుడుగా ఉంటాడు. ప్రదర్శ నంతా నాయకుని ఆట, మాట ప్రకారమే జరుగుతుంది. కొంత మందికి పొడవైన జుట్టుంటుంది. మరికొంత మంది గోచీలను కూడా కట్టు కుంటారు. నాటి యాదవుల వేషధారణని కూడా కళారూపంలో ప్రదర్శిస్తారు. లయబద్ధంగా నత్యం చేసే బృందాలలో పదిహేను నుంచి ఇరవై మంది వరకూ ఉంటారు. తాళం, లయ తప్పకుండా, క్రమం తప్పకుండా వలయాకారంలో తిరుగుతూ వీరు చేసే నృత్యం చేస్తారు. ఇందులో గురువు కేవలం తప్పెట గుళ్ళతో నృత్యం చెయ్యడం మాత్రమే కాకుండా రామాయణం, భారతం, బొబ్బిలి యుద్ధం తదితర కథలను చెపుతూ మధ్య మధ్యరంధరంధరా మా స్వామి జన్నయ్యవంటి కొన్ని కీర్తనలు పాడుతూ వీటిని తిలకించేవారిని తమ కళాప్రతిభతో ఆశ్చర్యంలో ముంచెత్తుతారు.

విచిత్ర విన్యాసాలు

ప్రదర్శనల్లో రకరకాల గేయాలను పాడుతూ సన్నివేశాల కనుగుణమైన అభినయాలను ప్రదర్శిస్తూ వారి ప్రతిభను కనపర్చే విన్యాసాలు చేస్తారు. వివిధ భంగిమల్లో తప్పెట్లు వాయించడమే కాకుండా, ఒకరి మీద మరొకరు ఎక్కి ఒకని సహాయంతో రెండు వైపులా ఇద్దరు వేలాడుతూ తప్పెటలు వాయించడం రెండు జట్లుగా విడిపోయి తప్పెట గుళ్లు వాయిస్తూ వారి ప్రతిభను ప్రదర్శించడం, ఒక కుండ పైన ఒకరు నిలబడి అతని పైన మరొకరు నిలబడి తప్పెటగుళ్లు వాయిస్తారు. విన్యాసాలలో పైకెగిరి అమాంతంగా కింద పడడం, మోకాళ్ళ మీద కూర్చుని విన్యాసంగా గుళ్లు వాయించడం వంటి విన్యాసాలు అకట్టు కుంటుంటాయి.

ప్రతిభా విశేషాల ప్రదర్శన

తప్పెటగుళ్లు ప్రదర్శన స్థాయి పెరిగే కొద్దీ జట్టులో వారు ఒక్కొక్కరు తమ ప్రతిభా విశేషాలను ప్రదర్శిస్తారు. ఒకరిని మించి మరొకరు దరువులు వేసి వాటికి అనుగుణంగా ఆడతారు. వాయిద్య వరుసలను గమకాలను వినిపిస్తారు. కూచిపూడి నత్యంలో నెత్తిన చెంబూ కాళ్ళ కింద పళ్ళెమూ ఉంచే విధంగానే వీరు కూడా నీరు నింపిన మట్టి కుండ అంచులపై ఒకరు నిలబడితే, అతనిపై మరొక వాద్య కారుడు తప్పెటలను వాయిస్తూనే నీరు నిండిన కుండను నెత్తిన పెట్టుకుని నీరు తొణక కుండా, ఒక పక్క తప్పెట వాయిస్తూ నీరు తొణికి పోతాయేమో అనే బెరుకు లేకుండా నృత్యం చేస్తూ వుంటే చుట్టూ చేరిన జన సందోహం తమని తాము మర్చిపోయి చప్పట్ల వర్షాన్ని కురిపిస్తుంటారు. ఇలా కళా ప్రదర్శన నాలుగైదు గంటలు సాగుతుంది.

పతాక స్థాయిగా మానవ పిరమిడ్

ప్రదర్శన పతాకస్థాయికి చేరుకునేటప్పటికి సర్కస్ ఫీట్లు లాంటివి చేస్తారు. నత్యం చేస్తూనే, లయ తప్పకుండా, వలయాకారం తప్పకుండా చిందులు తొక్కుతూనే ఒక ప్రక్క తప్పెట్లు వాయిస్తూనే నెమ్మదిగా ఒకరిపై మరొకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపురం ఆకారంలో నిలిచి చివరన మరో వ్యక్తి నిలబడి తప్పెట్లు వాయిస్తాడు.

మానవ పిరమిడ్ లా కన్పించే గోపురాకార దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పై వారి బరువంతా దిగువనున్నవారు భరిస్తూ వుంటే పక్కనున్న కొద్దిమంది లయ తప్పకుండా పాటలు పాడుతూనే ఉంటారు. చివరికి ఒక్కొక్కరుగా దిగుతారు. మొగ్గలు వేస్తారు.

ఒక వ్యక్తి కింద వెల్లకిలా పడుకొని దరువులు వేస్తూ కాళ్ళను భూమికి తాకిస్తూ చుట్టు తిరుగుతాడు. కుండపై నిలబడి నృత్యం చేస్తారు. రెండు, మూడు చెంబులను నీటితో తలపై పెట్టుకొని అవి పడిపోకుండా కూడా నృత్యం చేస్తారు.

అడుగడుగునా అభినయ విన్యాసాలు

తప్పెటగుళ్లు ప్రదర్శనలను జాతర్లలోనే ఎక్కువగా నిర్వహిస్తారు. ప్రదర్శనంతా రాత్రివేళల్లోనే ఉంటుంది. ఇది అడుగడుగునా అభినయ విన్యాసంతో తొణికిసలాడుతుంటుంది.

పాటకు తగిన తాళం, తాళానికి తగిన లయ, లయకు తగిన నృత్యం నోటితో పాట, ముఖంలో ఉత్సాహ ఉద్రేకాలతో కూడిన సాత్విక చలనం ప్రస్ఫుటంగా కళాకారుల్లో కన్పి స్తాయి. తప్పెటగుళ్లు ప్రదర్శన ఇచ్చే గ్రామంలో ముందుగానే అక్కడి పెద్దల నుంచి కొంత నగదుతో కొంచెం బెల్లం బయానాగా తీసుకుని, తేదీన ప్రదర్శించాలో నిర్ణయించుకుంటారు.

ఏకాగ్రతతోనే కళాసాధన

శ్రామిక జీవనాన్ని సాగించుకుంటూనే ఏకాగ్రతతో కళాసాధన చేస్తుంటారు. పగటి వేళల్లో తమ వృత్తిని నిర్వర్తించుకుంటూ రాత్రి పూట ప్రదర్శనలు ఇస్తారు. అలాగే రాత్రి పూటే శిక్షణ కూడా పొందుతారు. చాలామంది కళాకారులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే విద్యలో శిక్షణ ఇస్తున్నారు.

కళారూపం జాతీయ ఉత్సవాల్లోనూ, విదేశాల్లోనూ ప్రదర్శిత మౌతోంది. జాతీయ స్థాయిలో కూడా తన ఉనికిని చాటుకుంటోంది. ఉత్తరాంధ్రలో వందకు పైనే తప్పెటగుళ్లు కళాకారుల బృందాలు కళారూపానికి తమ ప్రతిభని ఆవిష్కరిస్తూ ప్రదర్శిస్తున్నాయి.

కనకతప్పెట్లు

డప్పుల వాయిద్యాన్నే రాయలసీమలో కనక తప్పెట్లు అంటారు. వీటిని సాధారణంగా జాతరలకు, వివాహాలకు, చాటింపులకు ఉపయో గిస్తూ ఉంటారు. డప్పులతో గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుతూ వివిధ వరుసలలో లయగా వాయిస్తూ లయబద్దంగా నృత్యం చేస్తారు.

 

Read More : హరిదాసులు

Leave A Reply

Your Email Id will not be published!