Telugu Marriage Traditions – Sixteen days Festival : పెండ్లి తరువాత 16వ రోజున వరుని ఇంటిలో వధూవరుల తల్లి దండ్రులు బంధుమిత్రులతో కలసి పదహారు రోజుల పండుగ అనే వేడుకను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగతో ఈ పెళ్ళితంతు కార్యక్రమం పూర్తి అయినట్లే !
అంకురార్పణ చేసినప్పుడు మూకుళ్ళలో మట్టిపోసి నవధాన్యాలు చల్లిస్తారు. ఆ మూకుళ్ళను ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజూ నీరు పోయాలి.
అవి మొక్కలు మొలచును. ఆ మూకుళ్ళలో ఉన్న మట్టి తీసి మొక్కలను ఆ కడగవలెను. ఆ కడిగినమొక్కలను మూడు గుమ్మముల వద్ద రెండు వైపుల కొన్ని కొన్ని మొక్కలు ఉంచాలి.
శుభ్రము చేసిన మూకుడుకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక గిద్ద బియ్యము, పండు తాంబూలము, జాకెట్టు వస్త్రము, దక్షిణ పెట్టి పెండ్లికూతురుచేత ముత్తయిదువులకు ఇప్పించవలెను. ఆనాడు భోజనములో అట్లు వడ్డించాలి. భోజనము అయిన తరువాత పసుపు త్రాడుతో ఉన్న మంగళ సూత్రములు బంగారు గొలుసులోకి మార్చవలెను. పెండ్లిరోజున తాళిబొట్టుకు ఉన్న పసుపుతాడును పేని దానికి సూత్రము ఎక్కించి కట్టవలెను.
పెండ్లికూతురు వాళ్ళు పెండ్లికుమారునికి, తండ్రికి, తల్లికి నూతనవస్త్రాలు పెట్టవలెను. ఉదయమే నవ దంపతులకు హారతి పట్టి మంగళస్నానము చేయించాలి.
పెండ్లికుమారుడు స్నానము అయినాక దేవునివద్ద కూర్చొని ఉత్తర జంధ్యాలు, బటువు, కంకణము, తీయవలెను, వడిగట్టు బియ్యము అమ్మాయి వాళ్ళ బియ్యము అబ్బాయివారికి అబ్బాయి వారి బియ్యము అమ్మాయి వారికి ఇచ్చుకోవాలి. ఆ రోజు ఆ బియ్యముతో పొంగలిచేసి నైవేద్యము పెట్టవలెను. బటువు, కంకణము, ఉత్తర జంధ్యములు పెండ్లి కుమారుని సోదరికి అందజేయాలి.