Telugu Tradition : Mangala Harathulu –
ఈ మంగళం పాడటం అంటే కథ చెప్పడం పూర్తయిందనే సంకేతంతో పాటు విన్నవారికి శుభం కలగాలని పలికే పలుకులు. అంతేకాదు, దేవతానుగ్రహంతోనే ఈ సృష్టి మనుగడ సాగిస్తోంది కాబట్టి సృష్టి స్థితి లయకారులకు కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకోవాలన్న విశ్వాసమూ ఈ సంప్రదాయంలో ఇమిడి ఉంది.
తెలుగింట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మంగళ హారతులు పాడడం సంప్రదాయం. పూజైనా, వ్రతమైనా, పెళ్ళైనా, ఆఖరికి పుట్టిన రోజైనా చివరగా మంగళ హారతి తప్పనిసరి. సంగీత కచేరి కూడా మంగళంతో ముగిస్తారు. ఆ సమయంలో ఆహూతులలో హారతులు బాగా పాడగలిగిన వాళ్ళ కోసం అందరు చూస్తారు. కాస్త పాడగలిగిన వారు కూడా, నాలుగు మంగళ హారతులు తెలిస్తే బాగుండు అనుకుంటారు.
వినసొంపుగా ఉండే ఈ మంగళ హారతి గీతాల సాహిత్యమూ ఇంపుగా ఉంటుంది. ఈ పాటలు వింటే, చదివితే అందరికీ శుభం కలుగుతుందన్నది జానపద కళాకారుల నమ్మకం. సాధారణ పరిభాషలో మంగళం పాడటం అంటే విడిచిపెట్టడం, ఆపేయడం అనే అర్థాలు స్థిరపడ్డాయి కానీ, నిజానికిది శుభం పలకడం, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం.