Telugu Festival Tradition : Haridasulu
“శ్రీరమా రమణ గోవిందోహరి! శ్రీజానకీ రమణ గోవిందోహరి!” అంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికి తిరుగుతూ భిక్ష వేసిన గృహస్థులను రామార్పణం, కృష్ణార్పణం, భగవతార్పణం అంటూ దీవిస్తుం టారు హరిదాసులు. ధనుర్మాసం ఆరంభం నుంచి మకరసంక్రమణ రోజు వరకు వైష్ణవ భక్తి గీతాలను ఆలపిస్తూ పల్లెలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లే ఈ హరిదాసులనే మాలదాసులు, మాలదాసర్లు అని పిలుస్తారు.
నెల రోజులు నిష్ఠతో..
హరిదాసులు ధనుర్మాస ప్రారంభం నుంచి మకర సంక్రమణ వరకు వేకువజామునే లేచి తలంటుస్నానం చేస్తారు. నొసట తిరుమణి, తిరు చూర్ణం, పట్టెనామాలు ధరించి కొత్త బట్టలు ధరిస్తారు. తెల్లపంచె/ కాషాయ పంచె, చొక్కా అంగి, నడుముకు గుడ్డ, కాలికి అందెలు కట్టుకుని.. మెడలో పూలదండ, తలపై కలశం (అక్షయపాత్ర), కుడిభుజంపై తంబుర, ఎడమచేతిలో చిటికెలు ధరించి హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికీ తిరుగుతారు. మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించాకే ఆహారం తీసుకుంటారు. ఈ నెల రోజులు వీళ్లు చాలా నిష్ఠగా ఉంటారు.
నేలపడక, ఒంటిపూట భోజనం చేస్తారు. తర్వాత రోజుల్లో వీళ్లు వీధి నాటకాలను ప్రదర్శిస్తారు. కొందరు బుర్రకథలు గానం చేస్తారు. ఈ మూడు ఆచా రాలూ వీళ్లకి వంశపారంపర్యంగా వస్తున్నాయి.
ధనుర్మాసంలో వైష్ణవ గీతాలను గానం
మాలదాసులుగా, హరిదాసులుగా వ్యవహారంలో ఉన్న వీళ్లు మాలల్లో ఒక తెగవారు. మాలలకు వివాహాది శుభకార్యాలు, అపరకర్మలు నిర్వహిస్తూ భజన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వీళ్లు వివాహ వ్యవస్థలో మేనరికానికి ప్రాధాన్యమిస్తారు. మేనరికం లేనప్పుడు బయట వధువును వెతుకుతారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ‘ఓలి‘ సంప్రదాయం వీళ్లలోనూ ఉంది. ఇది కన్యాశుల్కం లాంటిది. మాలదాసులు అపరకర్మ కాండలను రాత్రుల్లోనే నిర్వహిస్తారు. రామానుజకూటంలోని అందరూ ఇలాగే చేస్తారు. చనిపోయిన వారిని శ్మశానం వరకూ చేతుల మీదనే తీసుకెళ్లి ఖననం చేస్తారు. పాడెలాంటిది కట్టరు. కార్తీకమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశిని వీరు ‘మంగళ కైశికి ద్వాదశి‘గా వ్యవహరిస్తారు. ఉత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో వైష్ణవ గీతాలను గానం చేస్తారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో వీళ్ల జీవనోపాధి ఒడుదొడుకులకు లోనవుతోంది. వీరి ప్రదర్శనా కళలకు కూడా ఆదరణ లేకపోవడంతో ఈ హరిదాసులకు జీవనభృతి కష్టంగా ఉంది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ఈ వృత్తిని మానేస్తున్నారు. హరిదాసులకు తమ వృత్తిపై నమ్మకం కలిగించాల్సింది.. వారినీ, వారి ప్రదర్శన కళలనూ అక్కున చేర్చుకోవాల్సిందీ, హరిదాసుల సంప్రదా యాన్ని కొనసాగించుటకు ఊతమివ్వాల్సింది మనమే.