చిలక జోస్యం

Chilaka Josyam

Telugu Tradition : Chilaka Josyam –

ముఖాన రూపాయి బిళ్ళంత కుంకంబొట్టు, ముంజేతులకు మురు గులు, నెత్తిమీద గొడుగు, కాలికి కడియం, చెవులకు పోగులు, చంకన చిలక పంజరం పెట్టుకొని వీధుల వెంట జోస్యం చెబుతామంటూ తిరుగుతుంటారు కొంతమంది వీరు చెప్పేదే చిలక జోస్యం.

చిలకజోస్యం అంటే ఏమిటి?

చిలక జోస్యంపై ఆసక్తి కలవారు పిలిచి చిలక జోస్యం చెప్పమంటే పంజరం కింద పెట్టి, బిచాణా పరచి, దానిమీద పది పన్నెండు కవర్లు వరుసగా పేర్చి కొంత ధనాన్ని తీసుకొని ప్రశ్న అడిగేవారి పేరు ఉచ్చరిస్తూ పంజరం తలుపు తీసి చిలుకను బయటకు పిలుస్తాడు. చిలుక వయ్యారంగా బయటకు వచ్చి ఓరగా యజమానిని చూస్తూ కవర్లలో ఒక్కొక్కటే ముక్కుతో తీసి పక్కన పెడుతూ ఎక్కడో ఒక కవరు దగ్గర ఆగి దాన్ని కరచి పెట్టి తెచ్చి అతనికి ఇస్తుంది.

కవరులోని కార్డుల పై వెంకటేశ్వరస్వామి, సత్యన్నారాయణస్వామి, ఆంజనేయస్వామి, పార్వతీ పరమేశ్వరులు, సీతా రామలక్ష్మణులు, దుర్గ వగైరా దేవతల బొమ్మలలో ఏదో ఒకటి ఉంటుంది. మరో కాగితం మీద : మీరు అనుకుంటున్న పని ఆరునెలల్లో నెరవేరుతుంది, వచ్చే అమావాస్య వెళ్ళిన దగ్గరనుంచి మీ జాతకం మారిపోతుంది. ఆకస్మిక ధనలాభం, ఎవరితోనూ శతృత్వం మంచిది కాదు.. వంటి ఎవరికైనా వర్తించేటువంటి వంటి మూడు నాలుగు వాక్యాలు అచ్చు కాబడి వుంటాయి.

అవి చదివి వృచ్చకుని కోరికకు అన్వయించి చెప్పి అందులోని బొమ్మలు అతనిపై ఎలా అనుగ్రహం చూపుతున్నాయో ఒప్పే విధంగా చిలకజోస్యం చెప్పే వ్యక్తి చెబుతాడు. చెప్పడంలోని నేర్పే చిలుక జోస్యం చెప్పించుకున్న వ్యక్తి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. పైన జ్యోతిష్యుని వ్యాఖ్యాన పూర్వకమైన వాక్కు సమ్మోహితులను చేస్తుంది. చిలక జోస్యాలకు ఒకప్పుడు రాజమండి జంతర్ మంతర్ రోడ్డు ప్రసిద్ధి చెందింది. చిలుకజోస్యం తెలుగువారి వినోద సాంప్ర దాయాల్లో చాలా ప్రముఖమైనది

 

Read More : చెక్క భజనలు

Leave A Reply

Your Email Id will not be published!