చెక్క భజనలు

Chekka Bhajanalu

Telugu Traditional Event : Chekka Bhajanalu –

చెక్కభజన సకల కళాసమన్వితమైన జానపద నృత్య కళారూపం. ఆంధ్రదేశపు పల్లెలలో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ముఖ్యమైంది. దేవుని స్తంభాలను పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ భక్తి భావంతో భజనలు చేస్తారు. పల్లెలో వుత్సాహం వున్న యువకులందరూ తీరిక సమయాలలో ఇరవై మంది దళ సభ్యులుగా చేరి, ఒక గురువును ఏర్పాటు చేసుకుని రాత్రి సమయంలో కట్టుదిట్టంగా విద్యను నేర్చుకుంటారు. ఇది శాస్త్రీయమైన జానపద నృత్య కళ. ఇది ఎంతో క్రమ శిక్షణతో నేర్చుకుని చేయవలసిన కళ.



ఉత్సాహం కొద్దీ చేసే భజన కాదిది. భక్తి తన్మయత్వంతో భగవంతుణ్ణి వేడుకుంటారు. అలా వేడుకుంటూ భక్తి పారవశ్యంలో అమితోత్సాహంలో చేసే నృత్యం చెక్కభజన.

భజన చేసే వారే భక్తి భావంలో మునిగిపోవటం కాక, ప్రేక్షకుల్ని కూడా తన్మయత్వంలో ముంచేస్తారు. చెక్కభజన ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. ముఖ్యంగా పల్లెల్లో తీరిక సమయాలలోనూ వర్షాలు లేని రోజుల్లోనూ, పండుగ సమయాలలోనూ, దేవుళ్ళ కళ్యాణ సమయాలలోనూ, తిరునాళ్ళ సమయాలలోనూ రథోత్సవాలలోనూ, జాతర్లలోనూ చెక్కభజనల్ని చేస్తారు.

భజన చెక్కల్ని ఎలా తయారుచేస్తారు?

అడుగు పొడుగైన చెక్కల్ని తయారు చేసుకుని, రెండు ప్రక్కలా ధ్వని రావడానికి గుండ్రటి ఇనుప బిళ్ళలనుగాని, ఇత్తడి బిళ్ళలను గానీ రెండేసి చొప్పున అమర్చుతారు. తాళం ప్రకారం చెక్కలను కొట్టేటప్పుడు బిళ్ళలు శ్రావ్వమైన ధ్వనినిస్తాయి.

అన్ని చెక్కలూ ప్రయోగించినప్పుడు ధ్వని గంభీరంగా ఒకే శ్రుతిలో వినిపించి భజనపరుల్ని ఉత్సాహ పరుస్తాయి. చెక్కలపై నగిషీలు చెక్కి సుందరంగా వుంటాయి.

బృందలలో కథా వృత్తాన్ని బట్టి కొందరు పురుషులుగానూ, మరి కొందరు స్త్రీ పాత్ర ధారులుగానూ ప్రవర్తిస్తారు. ఉదాహరణకు గోపికా క్రీడల్లో పురుషులు కృష్ణులుగానూ, స్త్రీలు గోపికలుగానూ నర్తిస్తారు.

గురుపూజ

చెక్క భజన నేర్చుకోవాలనుకున్న యువకులందరూ చేరి ఒక గురువుని ఎన్నుకుంటారు. గురుపూజతో నృత్యాన్ని ప్రారంభిస్తారు. ప్రతి గురువూ ఒకే రకంగా చెక్క భజన విద్యను ప్రదర్శింపడు.

ఎవరి విధానం వారిది. చెక్క భజన రాయలసీమలో కడప జిల్లాలో పుట్టి, ఆంధ్ర దేశమంతటా వ్యాపించిందని, అందుకు నిదర్శనం గురువులు చెప్పిన మూలాలు మాత్రమేకాక, జిల్లాలో ప్రతి గ్రామంలోనూ చెక్కభజన బృందాలుండటం కూడ అందుకు నిదర్శనమనీ, అలాగే చెక్క భజనకు సంబం ధించిన గేయాలు ఎన్ని వున్నాయో చెప్పటం కష్టమనీ అంటారు.

చెక్క భజన స్వరూపం ఎలా ఉంటుంది?


చెక్క భజనల ఇతి వృతాలు సాధారణంగా విధంగా వుంటాయి. భక్తి పాటలు, భారత, భాగవత, రామాయణాలకు చెందిన పురాణ పాటలు, నీతిని ప్రబోధించే పాటలు, వీర గాథలు, ఇతరాలు, జడకోపు విద్యల్నీ ప్రదర్శిస్తారు.

వేషధారణ ఎలా ఉంటుంది?

అందరూ ఒకే రంగుగల తల గుడ్డలను, అందంగా చుడతారు. ఒక ప్రక్క రిబ్బను కుచ్చులాగా అందంగా వ్రేలాడుతుంది. పంచెల్ని నృత్యానికి అడ్డు తగలకుండా ఎగరటానికి వీలుగా వుండే లాగా సైకిల్ కట్టులాగా మడిచి కడతారు. పురుషులు ఒకే రంగుగల బనియన్లను ధరిస్తారు.

స్త్రీ పాత్రలకు లంగా, రవికె, పవిటెకు ఓణీ లాగా గుడ్డను ఉపయోగిస్తారు. బృందాలలో ఇరవై మొదలు ముప్పై వరకూ సమసంఖ్యలో బృంద సభ్యులుంటారు. పన్నెండు సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల వయస్సుకల యువకులందరూ భజనలో పాల్గొంటారు.

చెక్కభజనలోని సొగసు రాయలసీమలోమరీ ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల్లోచెక్కభజన పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి.

ఇందులో భజన చెయ్యడానికి వాడే చెక్కలు పొడవుగా ఉండే పలకలను పోలి ఉండడం వల్ల చెక్కభజననే పలకల భజన అని కూడా అంటారు. చేతుల్లో మూరెడు పొడవుండే తాళపు చెక్కలతో, కాళ్ళకు గజ్జెలతో వలయాకారంలో తిరుగుతూ తాళపు చెక్కలు వాయిస్తూ తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. ఒకే చేతిలో రెండు చెక్కలను ఆడిస్తూ వాయించడం చెక్కభజనలోని సొగసు.

వలయాకారంలో తిరిగే కళాకారులు కొన్ని సార్లు ఉద్దులువెలుద్దులుగా (జతలు జతలుగా) మారి ఎదురెదురుగా అడుగుమార్చి అడుగువేస్తూ ఉద్ది మార్చి ఉద్ది (ఒక అడుగులో ఒకవైపుఇంకొక అడుగులో రెండవవైపు) తిరుగుతూ నృత్యం చేస్తారు.

పెన్నుద్దికాడైన గురువు పాటలోని ఒక్కొక్క చరణం అందిస్తే మిగిలిన వాళ్ళు అందుకుని పాడుతూ నృత్యం చేస్తారు.

చెక్క భజనను ఎలా ప్రారంబిస్తారు?

భజన ప్రారంభించే ముందు దేవుని పటాలకు పూజ చేస్తారు. టెంకాయ కొట్టి చిరుతలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందరూ వలయాకారంగా నిలబడి లయతో చెక్కలను మోగిస్తారు. గురువు పాడగా వంత పాడతారు. తరువాత ఒక్కొక్క అడుగు వేయిస్తాడు.

అలా కుడికాలుతోనూ, ఎడమకాలితోనూ, చాక చక్యంగానూ ఆడిస్తూ వుంటారు. అందరూ ఒకే విధంగా వాయిస్తున్న సమయంలో గురువు అకస్మాత్తుగా ఆగుతాడు. అందరూ అలాగే పేస్తారు. అంతా నిశ్శబ్దం. సన్నివేశం అద్భుతంగా వుంటుండి.

ఇలాంటి వాటిని నిలుపులు అంటారు. నృత్యం ఉధృతస్థాయిలో ఉన్నప్పుడు కూడ విధంగా నిలుపుదల చేస్తాడు. నిశ్శబ్దాలు, మళ్ళీ ప్రారంభాలు. బృంద సభ్యుల యొక్క కలయికనూ లక్ష్యాన్నీ, క్రమశిక్షణనూ, గురుభక్తిని చాటుతాయి. చెక్క భజన ప్రారంభించే ముందు ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని ప్రార్థించి, తరువాత వరుసగా భక్తి పాటలు పాడుతారు.

జడ కోపులు

చెక్క భజన ప్రారంభించి కొంత కార్యక్రమం జరిగిన తరువాత చివరిగా చేసేది జడ కోపులు. కోపులు ప్రేక్షకుల్ని ఎంతగానో ముగ్ధుల్ని చేస్తాయి. అందరూ గుండ్రంగా నిలబడతారు. రంధ్రాలతో కూడిన గుండ్రని చంద్రాకారం గల బిళ్ళను తయారు చేస్తారు. రంధ్రాలలో రంగు రంగుల త్రాళ్ళను వేలాడదీస్తారు. చెక్కను ఎత్తుగా వున్న ఒక దూలానికి లాగి కడతారు. లేదా గ్రామ మధ్యలో వున్న చెట్టుకు వ్రేలాడ దీస్తారు. దీనిని జడకోపు బిళ్ళ అంటారు. బృందసభ్యులు ఒక్కొక్కరూ ఒక్కొక్క తాడును ఏడమ చేత్తో పట్టుకుని కుడిచేత్తో చెక్కల్ని పట్టుకుని వాళ్ళ సహాయంతో ఆడుగులు వేస్తూ లోపలికి బయటికి గుండ్రాకారంగా తిరుగుతారు. మధ్య గురువు పాటలు పాడుతుండగా కళాకారులందరూ పాట పాడుతూ జడను అల్లుతారు. దీనిని జడ కోపు అంటారు.

రక రకాల కోపులు

కోపుల్లో రకరకాల కోపులున్నాయి. అవి సాదా జడకోపు, నూగాయ జడ కోపు, డబుల్ నూగాయ జడ కోపు, కరక్కాయ జడ, గర్భ జడ, పట్టెడ జడ, పచ్చల జడ, నాలుగు పచ్చల జడ, వల జడ, బొంగు జడ, పుట్ల జడ విధంగా రకరకాల జడలను అల్లుతారు. ఇవి ఎంతో నైపుణ్యంతో అల్లబడతాయి. చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బృందంలో ఒక్కరు తప్పు చేసినా జడ చిక్కుపడి పోతుంది. చిక్కుపడిన జడను విడదీయటం చాల కష్టం జడలను అల్లటం ఎంతో సాధన చేస్తారు. ఒక జడకూ మరో జడకూ మాత్రం సంబంధం వుండదు. పాట పాడుతూ, అడుగు వేస్తూనే కోపులను వేస్తారు. యి

పూర్వం చెక్కభజనలో కేవలం పురాణ సంబంధమైన, భక్తి పాటలే పాడేవారు. ప్రస్తుతం చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు పాడుతూ వస్తున్నారు. ఆనాడు తిత్తి, మద్దెల, కంజీర చెక్కభజనకు వాయిద్యాలుగా ఉపయోగించేవారు. ఇప్పుడు హార్మోనియం, డోలు, కంజీర, తబలా వాయిద్యాలుగా వాడుతున్నారు.”

 

Read More : బుడబుక్కలవాడు

Leave A Reply

Your Email Id will not be published!