జముకుల కథలు
Jamukula Stories
Telugu Tradition : Jamukula Stories
పూర్వపు రోజులలో గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా జముకు అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే కళ్ళతో శక్తి ముందు చిందులు తొక్కుతూ గొర్రెలను, మేకలను గావు పట్టేవారు. గావు పట్టడం అంటే బలి పశువును నోటితో మెడకొరికి చంపడం అని అర్థం. ఆ పైన నెత్తురు లి, దాని ప్రేగులు ధరించి, దొబ్బలు నోటకరిచి, జముకులను వాయిస్తూ వీధుల వెంట తిరిగేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయం పోయింది. కాలక్రమేణా ఈ వాద్యం ఆధారంగా కాటం రాజు మొదలైన కథా గీతికల్ని ఆలపించడం, ఆ కథలు జముకుల కథలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది.
జముకు వాద్యం ఎలా ఉంటుంది?
కుంచం ఆకారంలో ఉన్న ఒక డొక్కుకు ఒక ప్రక్క కప్ప చర్మంతో మూస్తారు. ఆ చర్మానికి మధ్య చిన్న రంధ్రం చేసి ఒక నరాన్ని దారం చివర ముడివేసి అందులోకి దూర్చి ఆ నరానికి చిన్న కర్ర ముక్క కడతారు. ఆ కర్రకు నివర మువ్వలు కడతారు. కర్రతో దారాన్ని బిగుతుగా లాగి వదులుతుంటే ఒకరకమైన ధ్వని వస్తుంది. వీరు ఉపయోగించే సాధనం జముకు. దీనిని ఉపయోగించి చెప్పే కథజముకల కథ, దీనినే శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో బోనెల కుండ అని కూడా అంటారు. దీనిని రబ్బరు, కర్ర, రేకు, కంచు, ఇత్తడితో కూడా తయారుచేస్తారు.
ఉత్తరాంధ్రలో హరిజన (మాల–మాదిగ) కులానికి చెందిన వారు కొద్దిపాటి అక్షరజ్ఞానంతో పాడుతూ ఎన్నో తరాల నుండి ఈ కళను జీవింప జేస్తున్నారు. కాని నేటి కాలానికి ఈ కళ ఇంచుమించు కను మరుగయ్యే స్థితికి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాలో నేటి జముకుల కథ పూర్వ నామం బుడికి, లేక బుణికి పాట అనీ, బోనుల పాట అనీ టమకటమా అనీ, బుడబుక్కల పాటనీ నామాంతరాలని కొందరు ప్రముఖులు ఉదహరించారు. బుడికి వాయిద్యాన్నే బోను అని కూడా అంటారు. అందుకే అది బోనుల పాట అయింది. బుడికి చేసే శబ్దం బుడుక్కు, బుడుక్కు కాబట్టి బుడబుక్కల పాట అని కూడా అంటారు. మొత్తంమీద ఇది వాద్య ప్రధానమైన కళా రూపం.
రంగస్థలము అవసరం లేదు
జముకుల కథా ప్రదర్శనానికి ఏ విధమైన రంగస్థలమూ అవసరం లేదు. గ్రామం మధ్యలో చిన్న పందిరి వేసి, రెండు దీపాలను పెడితే సరిపోతుంది. ప్రదర్శన కారులు ముగ్గురు. అందులో మధ్య వ్వక్తి కథకుడు, వంత దారుల్లో ఒకరు హాస్యానికి, రెండవారు వ్యాఖ్యానానికి, వేషధారణలో కథకుడు నల్ల కోటు, తెల్లకట్టు పంచ, తల గుడ్డ చుట్టి చక్కగా నృత్యం చేస్తూ కలియ దిరుగుతాడు. స్త్రీ పాత్రలు కథా విధానంలో వచ్చినప్పుడు అక్షరాలా స్త్రీ అభినయాన్నే కథకుడు చేస్తూ వుంటాడు. వంత దారులు రెండు జముకలను శ్రావ్యంగా వాయిస్తూ వుంటారు.
ప్రతి కథలోనూ, కథకుడు సుమారు ఇరవై బాణీల్లో పాటలు పాడు తాడు. పాటకూ, పాటకూ మధ్య కాథాగమనాన్ని రాగయుక్త మైన వచనంలో రాగ రంజితంగా చదువుతాడు. ప్రతి పాటకూ బాణీ మారుతూ వుంటుండి. వాద్య నృత్యగాన సమ్మేళనంతో కథ హృద్యమంగా నడుస్తుంది. ఒక్కొక్క సందర్భంలో వంతదారులు కథలో వచ్చే పాత్రలుగా మారి పోతాడు. ఉదాహరణకు కథకుడు సుభద్రగా నటిస్తే వంత పాట కాళ్ళు ఒకడు అర్జునుడుగానూ మరొకడు మన్మథుడుగానూ, మారిపోతాడు. జముకుల కథా ప్రదర్శనలో ఇలా ఒక విచిత్రమైన డ్రామా నడుస్తుంది.