యక్షగానం

Yakshaganam

Telugu Dance Tradition : Yakshaganam –

మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో అతి విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చింది. యక్షగానం నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది కర్ణాటక రాష్ట్రంలోని అతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ.

యక్షగాన ప్రదర్శన ప్రదేశాలు

యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పు చెందుతూ వచ్చింది. మొదట యాత్రా స్థలాలు, కామందుల లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనలకు అనువైన స్థానములైనవి. వర్తమానంలో అప్పటికప్పుడు వూరి మొగనో, కోవెల వాకిటనో, సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపి జల్లిన కటికనేలయే దాని రంగస్థలము.


యక్షగాన కథలుగా పురాణగాథలు

యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు రెండు గంటల పాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు, తలపై సవరం ధరించి ఉంటారు. ప్రదర్శనలు ఎక్కువగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా, వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుగుణంగా నటీనటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది. ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించబడే కళకు 200 యేళ్ళ క్రితం యక్షగానమనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది.

ఉపాఖ్యానము

యక్షగానములో ఏదైనా ఒక కథను ఎంచుకొని దాన్ని జనాలకు గాన, అభినయ, నృత్య రూపాలలో ప్రదర్శిస్తారు. ఇలా ఎంచుకొన్న కథను ఉపాఖ్యానమని పిలుస్తారు. కన్నడలో ప్రసంగ అందురు. ఉదాహరణకు మహాభారతములో భీముడు, దుర్యోధనుని మధ్య గదాయుద్ధకథను ఎంచుకొన్నచో దానినిగదాయుద్ధ ఉపాఖ్యానము” (కన్నడలో గదాయుద్ధ ప్రసంగ) అంటారు. పౌరాణిక ఉపాఖ్యాలనే ఎంచుకున్నా, యక్షగానమందు ఉపాఖ్యానం/ఉపకథ/కథనము పౌరాణికమే అవ్వాలనే నియమము లేదు. అది ఐతిహాసికము లేక సామాజికము కూడా కావొచ్చు.

పాత్రధారులు

ఉపాఖ్యానంలో వచ్చు కథకు అనుగుణంగా అభినయించు, నర్తించు నటులను/నర్తకులను పాత్రధారులు అంటారు. ఉపాఖ్యానంలోని కథాను సారం నాయకుడు, దుష్టనాయకుడు, హాస్యగాళ్ళు, స్త్రీ పాత్రలు ఇత్యాదులను ఆయా పాత్రల కనుగుణంగా ఎన్నుకొనెదరు. నృత్యం, అభినయం/నటన, మనస్సుకు హత్తుకొనే చతుర సంభాషణలతో కథాంశమును ప్రేక్షకుల/ వీక్షకుల మనస్సుల్లో హత్తుకు పొయ్యెలా చేసే గురురత బాధ్యత పాత్రధారులదే.

ప్రతిపాత్రా తననుగూర్చి తానే చెప్పుకుంటుంది

యక్షగాన ప్రదర్శనంలో వున్న విశేషమేమంటే మన వీథి భాగవతా లలో వచ్చే పాత్రధారులు ఎవరి పాత్రను వారు ప్రదర్శిస్తారు. యక్షగానంలో మాదిరి కాక, ప్రదర్శనంలో వచ్చే ప్రతి పాత్రా తన్ను గూర్చి తాను చెప్పుకోవడంతో వుంటుంది. ఇదే యక్షగాన ప్రదర్శన స్వరూపం. ఉదాహరణకు: “రాజు వెడలే యమధర్మ రాజు సభకుఅని తన్ను గూర్చి తాను చెప్పుకుంటాడు.

భాగవతారు పాత్రే ముఖ్యమైనది

యక్షగాన ప్రదర్శనలో భాగవతారు పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఒకవిధంగా గాన ప్రక్రియకు నిర్దేకుడు వంటివాడు. కథనమును భాగవతారు పాట/గానం రూపంలో శ్రావ్యంగా పాడుతాడు. ఇలాపాడు గాయకుని భాగవతారు అంటారు. భాగవతారు ఆలపించు పాటకు అను గుణంగా ఇతర పాత్రధారులందరు నృత్యరూపంలో మూకాభినయం చేయుదురు. పాటకు అనుగుణంగా చేయు నృత్యంలో పాటలోని అర్థమునకు తగినట్లుగా పాత్రధారులు భావాభినయం చెయ్యడం అత్యంత కీలకం.

నేపథ్య సంగీతం

యక్షగానంలో నేపథ్యమును హిమ్మెళ (సంగీతవాద్యం) అంటారు. అనగా యక్షగాన ప్రదర్శన జరుగు సమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహకారం అందించే వాద్యబృందం.

వాద్యబృందంలో డప్పు, మద్దెల, మృదంగము, జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు. వీటిని నృత్య సమయంలో, భావవతారుపాడే సమయంలో, ప్రాసంగికులు మాట్లాడేట ప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగాన ప్రదర్శనను రక్తికట్టించెదరు.

అందువలన యక్షగానం ప్రదర్శన ఫలప్రదం కావాలన్నచో పాత్ర ధారుల అభినయం, భాగవతారు గానమాధుర్యం ఎంత ముఖ్యమో నేపథ్య సంగీతం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా భాగవతారు గాత్రానికి ప్రాణం నేపథ్యవాద్యం.

బయలాట

యక్షగానాన్ని ప్రదర్శించుటలో అనేకరీతులు, పద్ధతులు ఉన్నప్పటికి, బయలాట(వీధిభాగోతం)అత్యంత జనప్రియమైనది. బయలాట అనగా వస్త్రాలంకరణ, వేషాలంకరణ కావించుకొని వేడి భూమిపై ఆడే ప్రదర్శన. పండుగ, సంబారాల సమయాలలో ఊరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రి అంతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయ లాట అనే పేరు రూఢి అయ్యింది. ప్రజలు మాములుగాఆటఅని వ్యవరిస్తారు.

యక్షగానాల్లో హాస్యమే ఎక్కువ

యక్షగానాల్లో హాస్యం అతి విస్తారంగా కనిపిస్తుంది. యక్షగానంలోని కటకం వాడుసింగి సింగడు, సుంకర కొండడు మొదలైన సాంప్రదా యక పాత్రలు నాటికీ ప్రజా హృదయాల్లో నిలిచిపోయాయి.

కొన్ని యక్షగానాల్లో ఎఱుకలు గొల్లలు మొదలైన వారి జాతి చరిత్ర, వారి సాంఘికాచారాలు, వారి వాలకాలు, మాటల తీరు వృత్తి ధర్మాలు, కట్టు బొట్టులతో సహా తరగతుల వారీగా ప్రజా జీవిత వివరాలన్నీ తెలుస్తాయి. శృంగార హాస్య రసాలు అందరికీ బోధపడే భాషలో వున్నాయి. రాజులకూ ప్రజలకూ ఆదర్శ పాత్రమైనాయి ఆనాటి యక్షగానాలు.

 

Read More : వీర నాట్యం

Leave A Reply

Your Email Id will not be published!