వన భోజనాలు
Vanabhojanalu - Karthika Masam Special
Telugu Traditional Events : Vanabhojanalu –
కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ఈ రోజును ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా చెప్పవచ్చు. అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరక పోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయం గడింపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భంగా మారింది.
పురాణాల ప్రకారం కార్తీక వనభోజనాలు
పురాణ కధల ప్రకారం చెప్పాలంటే కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది.
ఉసిరిచెట్టు క్రిందే ఉత్తమం
వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల ఫల, పుష్ప, వృక్షాలు కలిగిన ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసివంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాలు ఆ వన ప్రదేశంలోనే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి కార్తీక పూజలు చేయాలి. తరువాత విస్తరాకులలో గానీ అరిటాకుల్లో గాని అందరూ కలసి భోజనం చేయాలి. ఇలా అందరూ కలసి పని చేయడంలో సహకార స్ఫూర్తి మనకు కనపడు తుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ వనభోజనాల సంప్రదాయం.