ఒడిబియ్యం
Vadi Biyyam
Telugu Marriage Tradition : Vadi Biyyam –
మన సమాజంలో వాడుకలో ఉన్న సంప్రదాయాలు, ఆచారాల్లో కుటుంబ బంధాలు, బాధ్యతలు, ఆప్యాయతలు, అనుభూతులు నిండి ఉంటాయి. ఆ కోవలోదే ఈ ఒడిబియ్యం.
ఒడి నించరమ్మ తడవదేల పుడమి జాతకు కడువడిగ మీరలెల్ల గూడి పడతి సీతకు మామిడి జామ మంచి పనస తొనలు ద్రాక్షయు భామామణికి మీరలిపుడు ప్రేమ తోడను పచ్చి పసుపు కుంకుమ బియ్యము హెచ్చు దువ్వెనల్ మెచ్చునట్టి బొమ్మలును మచ్చెకంటికిన్ అంటూ ఇంటి ఆడపడుచును సీతగా భావించి ఒడినింపుతారు పుట్టింటివాళ్లు. ఆ నింపటం కూడా ఆలస్యం చేయకుండా, వేగంగా వచ్చి ముత్తయిదువులు అందరూ కలిసి నింపాలట! మామిడి, జామ, పనస తొనలు, ద్రాక్షపళ్లు మొదలైన వాటితో ప్రేమతో పచ్చి పసుపు, కుంకుమ, బియ్యం, దువ్వెనలు, గాజులు, బొమ్మలు మచ్చెకంటికి ఒళ్లో వేయాలట. ఇదీ స్థూలంగా తెలుగింటి ఆడపడుచుల ‘ఒడిబియ్యం‘ కార్య క్రమం. ఒడినింపేటప్పుడు సందర్భానికి తగిన పాటలు పాడుతూ వేడుక జరుపుకుంటారు.
పెళ్లయిన తరువాత బేసి సంఖ్య సంవత్సరాల్లో (3, 5..) ‘ఒడిబియ్యం‘ నిర్వహిస్తారు. అమ్మాయిని ఆడ పిల్లగా భావించి పెండ్లి చేసి పంపడంతోనే బాధ్యత తీరిపోయిందని చేతులు దులిపేసుకోరు. ఆ ఇంటి ఆచారాన్ని బట్టి ఓ మంచిరోజు కూతుర్ని, అల్లుణ్ని, బంధువులను పిలిచి ఈ వేడుకను నిర్వహిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు, తోడబుట్టినవారు అంతా కలిసి ఆనందోత్సాహాలతో జరిపే వేడుకే ఈ ఒడిబియ్యం.
ఇంటి ఆడపడుచును లక్ష్మిగా భావిస్తారు. వేరే ఇంటికి కోడలిగా వెళ్లినా అమ్మాయి పుట్టినింటి సుఖసంతోషాలను కోరుకుంటుంది. కష్ట సుఖాల్లో పుట్టింటిని గుర్తు చేసుకుంటుంది. అలాంటిది ఆ అమ్మాయి ఆనందంగా ఉంటేనే పుట్టినింటికీ, మెట్టినింటికీ సౌభాగ్యం కలుగుతుంది కదా! అందుకే చీర, పసుపు, కుంకుమ, గాజులు, బియ్యం వంటివి ‘ఒడిబియ్యం‘లో భాగం చేశారు. అంతేకాదు అయిదు రకాల పండ్లు, మిఠాయిలు కూడా పెట్టి ఒడినింపుతారు. ఇవన్నీ అయిదుగురు ముత్తయి దువులతో చేయిస్తారు. కార్యక్రమం చివరగా అమ్మాయిని కూర్చోబెట్టి హారతి ఇస్తారు.
ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్లిన తరువాత సారెలోనివి కొన్నింటిని చుట్టుపక్కల వారితో పంచుకోవడం, లేదా వారిని పిలిచి తాంబూలంగా ఇవ్వటం చేస్తారు. ఓ మంచిరోజు చూసుకొని చుట్టాలను, స్నేహితులను, పొరుగువారిని పిలిచి ఒడిలోని బియ్యం వండటాన్ని వేడుకగా చేసుకుం టారు. వచ్చినవాళ్లకు విందుచేసి, బట్టలు పెట్టి మర్యాద చేస్తారు.
ఇందులో పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆనందాన్ని పదిమందితో పంచుకోవడమే ప్రధాన ఉద్దేశం. ఇలా చేయడంవల్ల ఆ రెండు కుటుంబాలే కాకుండా వచ్చిన బంధు మిత్రాదులతోనూ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ విధంగా తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాలవల్లే మన కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా నిలిచింది.