పుష్పవతి అయినప్పుడు పాటించే సంప్రదాయాలు

Traditions of Mature Function

Telugu Tradition : Traditions of Mature Function – తూర్పు ముఖం వచ్చునట్లుగా కూర్చుండబెట్టే స్థలంలో నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు రంగు దుప్పటి లేక చీర ఐదుగురు ముత్తైదువులు కలిసి పట్టుకుని వేయవలెను. తరువాత ఐదుగురు అమ్మాయి తలపై అక్షింతలు వేయవలెను. తెల్లని వస్త్రముపై నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల నీటిలో నానబెట్టిన శనగలు, పండ్లు, తాంబూలము, ఎండు కొబ్బరి చిప్ప, చిమ్మిలి ముద్ద పెట్టాలి, పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను. బొమ్మకు వస్త్రము కట్టవలెను.

 



అమ్మాయి కాళ్ళకు పసుపురాసి పారాణి పెట్టాలి. ఓణీ వేసుకొనవలెను. ఐదుపోగుల దారానికి పసుపురాసి తమలపాకు తోరము తయారు చేసి ఒకటి రోలుకి, రోకలికి కట్టాలి, అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను. అమ్మాయిని కూర్చొన పెట్టి రోలులో ఐదు చిమ్మిలి ముద్దలు వేసి చిమ్మిలి తొక్కి హారతి పట్టవలెను. సమర్రపాట, మంగళహారతి పాటలు పాడవలెను. రోలులోని చిమ్మిలి ముందుగ మూడుసార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకాని పిల్లలకు పెట్టుదురు. బొట్టు, గంధము ముందుగా సమర్త పెండ్లి కూతురునకు ఇచ్చి ముత్తైదువులకు ఇచ్చెదరు.

మొదట మూడు రోజులు పులగము అన్నము, (బియ్యములో పెసర పప్పు కలిపి వండవలెను). ఒక మూకుడులో విస్తరాకు లేక వెండి గిన్నె ఉంచి అన్నము పెట్టెదరు. అన్నములోకి బెల్లము ముక్క లేక పంచదారతో తినవలెను. తరిగినవి తినరాదు. పుల్లలు తుంచుట చేయ కూడదు. అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చిన తినవలెను. ఉపన యనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టిన ఏదైనా దోషములు ఉన్న పోవును. వరుస స్నానము 4, 7, 9, 11 రోజులలో చేయించాలి.

4 రోజు భోజములో అట్లు వడ్డించాలి. పాలరసము చేయాలి. వరస స్నానము 4 సార్లు తరువాత మామూలుగా బంతిలో భోజనము చేయవచ్చును. 4 రోజుల తరువాత కొబ్బరి పొడుము, అప్పడము, వడియముతోనే భోజనము పెట్టవలెను. తినలేనిచో పాలు, మజ్జిగ పలుచగ చేసి అన్నములో పోయవలెను.

దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్తగా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట, అగ్నిముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి,

తినకూడని పదార్థములు

వంకాయ, గోంగూర, తరిగినవి, అరిశె, జున్ను తినకూడదు. ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించ రాదు. చిమ్మిలి ముద్దలు, వేరే ఏస్వీటు అయినా తినవచ్చును. సమర్త సమయమున చిమ్మిలి ఎంత పంచిన అంతమంచిది. ఏదైనా గుడిముందు వాళ్లకు చిమ్మిలి ముద్దలు పంచవచ్చును. కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చొనపెట్టుదురు.

పదకొండవ రోజున అమ్మాయికి గాజులు తొడిగించెదరు. రోజు బంధువులను పిలిచి భోజనములు పెట్టెదరు. అందరికి రెండు గాజులు కూడా పంచి పెట్టెదరు. నాలుగు సమర్తలు, కన్నెముట్లు మూడు అయిన దాకా ఊరు పొలిమేర దాటరాదు అని అంటారు.

 

Also Read : ఓణీలు – పంచులు వేడుక

Leave A Reply

Your Email Id will not be published!