Telugu Traditional Events : Theppotsavalu –
తెప్పపై ఉత్సవాన్ని జరుపుకోవడాన్ని తెప్పోత్సవం అంటారు. ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలలో పుష్కరిణిలో గాని లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాలను వివిధ దివ్యాభరణాలు, రంగురంగుల పుష్పమాలికలతో ముస్తాబుచేసి వేద పండితుల మంత్రోచ్ఛాటనలు, భక్తుల జయ జయ ధ్వానాలు, మేళతాళాల , మధ్య దేవస్థానం నుండి స్వామి వారి జలవిహార ప్రదేశం వరకు ఉత్సవంగా తీసుకుస్తారు. అనంతరం మామిడితోరణాలు, పూలతోరణాలు, అరటి పిలకలు, వివిధ రంగుల పతాకాలతో ముస్తాబు చేసిన తెప్పపై ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. అనంతరం తెప్పలో స్వామికి వివిధ ఉపచారాలు, నివేదనలు, హారతులతో దేవస్థానం ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో వేదోక్తంగా, శాస్తోక్తంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తిరుమలలో తెప్పోత్సవం
తిరుమలలోని వేంకటేశ్వర స్వామివారి పుష్కరణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు తెప్పోత్సవం జరుగుతుంది. ఇది ప్రతి యేటా చైత్రమాసంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే ఉత్సవం. తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమినాడు ముగిసేలా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తెప్ప అంటే ఓడ. ఓడలో ఆశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారింపజేయడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్స వాలను తమిళంలో
తిరుపల్లి ఓడై తిరునాళ్ అని, తెలుగులో తెప్ప తిరునాళ్లు అని అంటారు. ఐదు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీతారాములతో పాటు లక్ష్మణుడుని కూడా పూజిస్తారు. రెండవ రోజు శ్రీకృష్ణుడు, రుక్మిణి పూజిస్తారు. మూడు, నాలుగు, ఐదు రోజులు పూజలు త్రయోదశితో మొదలయ్యి పౌర్ణమితో ముగుస్తాయి. ఈ మూడు రోజుల్లో ఉత్సవ విగ్రమైన మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి పూజింపబడతారు. ఈ ఉత్సవ మూర్తుల్ని అద్భుతంగా అలంకరించి పుష్కరిణి పై ఉన్న ప్రత్యేక తెప్పలపై ఉంచి పూజిస్తారు.
తెప్పోత్సవం ఎలా జరుగుతుంది?
ముందుగా ఉత్సవ మూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు వేంపు చేస్తారు. అనంతరం అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరిస్తారు. మూడో రోజు శ్రీ భూసమేతంగా సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలో తెప్పపై ఆశీనులై మూడుసార్లు విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. నాలుగో రోజు ఐదుసార్లు, చివరి రోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు.
ఈ తెప్పోత్సవం రోజులలో స్వామివారు విశేషంగా కటాక్షిస్తారని భక్తుల విశ్వాసం. బెజవాడలో కనకదుర్గమ్మవారికి జరిగే తెప్పోత్సవం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో, విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీ యంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని ఉంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగే అవుతుంది.