Telugu Marriage Tradition : Snathakam / Samavartanam – స్నాతకోత్సవం వివాహ ఘట్టంలో మొదటి మెట్టు. పెళ్లి రోజుకు ఒక రోజు ముందర “స్నాతకం” అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపు కోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ “సంస్కారం”, ప్రధానంగా, వరుడిని “బ్రహ్మచర్యం” నుండి “గృహస్థాశ్రమం” స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో–అంగీకారంతో “గృహస్థాశ్రమం” స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని “సత్యాన్న….” అన్న ఒక శ్లోకరూపంలో వుంటుంది. “సత్యం విషయం లోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయం లోను, పొరపాటు పడవద్దు” అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ–ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమని బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని వారనుసరించిన మార్గాన్ని ఎంచు కోమని అంటూ, “వరుడికి శుభం కలుగుగాక” అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు.
హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ. స్నాతకానికి “సమా వర్తనం” అన్న పేరు కూడా ఉంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. స్నాతకం మంత్రపూర్వకంగా జరుగుతుంది. ఆ మంత్రాలకు చింతనలు రాలతాయి.
అపోహిష్ఠా మయోభువః తాన ఊర్లే దధాతవ!
మహేరణాయ చక్షసేః
అంటే ఓ ఉదకవలులారా! మాకు మీరు సుఖాల్ని కలుగజేస్తారు. మాకు మీ దయవల్లే అన్నం దొరుకుతోంది. మీవల్ల వచ్చిన శక్తి ద్వారా ఆ మేము గొప్ప జ్ఞానాన్ని పొందజాలుతున్నాము. ఇంకా సత్సంగాన్ని ప్రసా దించవలసిందని ఇలా ఇలా చాలా ఆకాంక్షలు స్నాతక శ్లోకాలలో ఉంటాయి. భవిష్యకాలం బాగా వుండాలనే కోరికలుంటాయి. ఆ కోరికల్లో దేశభక్తి పాలు కూడా వుంటుంది.
సమాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే !
లక్ష్యేరాష్ట్రస్య యాముఖే తయామాసగం సృజామసి స్వాహా! అంటే నేను నివసించే ఇల్లూ దేశమూ సిరిసంపదలతో తులతూగాలి అని. ఈ స్నాతకం వరుని ఇంట్లోగాని, కల్యాణ మండపంలో, విడిదిలోగాని పురోహితుని ఆధ్వర్యంలో జరగాలి.
అప్పుడు ఆ బ్రహ్మచారి ‘సరే‘ అనిపించడానికి, అర్ధించడానికి – , వయస్సులో పెద్దవాడు గాబట్టి కన్యతండ్రి తన కుమారుని చేతగానీ, కన్యామణికి సోదరుని వరస అయిన బంధువు చేతగానీ, బట్టలూ, చెరకు , రసమూ, పానకమూ ఇచ్చి బ్రతిమాలింపజేస్తాడు. ఇప్పుడు చెరకు రసం బదులుగా బెల్లాన్ని వాడడం జరుగుతోంది. ఈ చెరకు రసం ఎందుకు ఉపయోగిస్తారంటే – చెరకు మన్మధుని విల్లు – ఈ వింటి రసం సేవిస్తే మన్మధుడు ఆ బ్రహ్మచారి మనస్సుని గృహస్థాశ్రమం వైపు మళ్ళింప జేస్తాడని నమ్మకం. –
చెరకు రసంతో తయారైంది బెల్లం కాబట్టి బెల్లం వాడటం పరిపాటి అయింది. పానకం వీర్యవృద్ధిని కలిగిస్తుంది. (అలాగని అతిగా సేవించ కూడదు) పానకంలో ఉపయోగించే ‘మిరియాలు‘ శరీరంలో చాలా రుగ్మతలని పోగొట్టి, పునన్సంధాన సమయంలో ఆరోగ్యవంతుణ్ణి చేస్తా యని పూర్వీకుల నమ్మకం! కాబట్టి కన్యాదాత వరుణ్ణి కన్యను చే(సి) కొమ్మని బ్రతిమాలడం, అతను సరే అనడంతో ప్రధమ ఘట్టం పూర్తవు తుంది. స్నాతకోత్సవంలో ఈ సంప్రదాయాన్ని జోడించి మొత్తం కార్యక్రమాన్ని స్నాతకంగా పరిగణిస్తున్నారు.
స్నాతకం అంటే, బ్రహ్మచారికి అనేక రోగాలకి ప్రాయశ్చిత్తం. సాధారణంగా వివాహం అయ్యేవరకు వరుడు అద్దం చూసుకోకూడదు. అలంకరించుకోకూడదు. అసభ్యకరమైనటువంటి పద జాలాలను వాడటం కాని, చూడటం కాని చేయకూడదు. అందమైన ఆడవారు కనిపించి నప్పుడు, వారిని చూడడం కాని, వారితో పరాచకాలాడటం కాని చేయ కూడదు. మరి అలాంటి బ్రహ్మచారి మరి ఇప్పుడు ఎవరు దొరుకుతారు. కాబట్టి, బ్రహ్మచారిగా ఉండి, తాను చేసిన దోషాలన్నింటికి ప్రాయశ్చిత్తం ఈ స్నాతకం. స్నాతకం, యజ్ఞోపవీతధారణ అర్హత ఉన్నవారు మటుకే చేసే క్రతువు ఉపనయనము. చిన్న వయసులో చేసి, అతడు ప్రతిరోజు సంధ్యావందనాది క్రియలు సక్రమంగా చేసినట్లు అయితేనే స్నాతకం, లేకపోతే అతనికి కూడా శమీవృక్ష దర్శనంతో (సంధ్యావందనాది అధికారం లేని ఇతర కులాలవారు చేసే ప్రాయశ్చిత్తం) సరి. పైగా, ఉపనయనం కూడా వివాహానికి ఒకటి రెండు రోజుల ముందు చేసుకునే ప్రబుద్ధులు ఉన్నారు. వారికి కూడా శమీవృక్ష దర్శనమే.
అలాగే, స్నాతకుడై ఉన్న వరుడు ఎన్నో ప్రమాణాలు చేస్తాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిధి దేవోభవ, నగ్నంగా స్నానం చేయనని వ్యక్తి శరీరాన్ని నాభి నుండి తలవరకూ, నాభి నుండి పాదాలవరకూ, అడ్డంగా రెండు భాగాలుగా చేశారు. నాభి నుండి క్రిందకి ఉన్న శరీరాన్ని రాక్షస శరీరం అని, తల వరకు ఉన్న శరీరాన్ని దైవ శరీరం అని అంటారు. ఈ రెండు శరీరాలను విభజించడానికి మొలకు త్రాడు కడతారు. స్త్రీలకు వడ్డాణం పెడతారు. దైవ శరీరాన్ని, రాక్షస శరీరాన్ని విడగొట్టే ప్రదేశం. ఎప్పుడూ వస్త్రంతో కట్టబడాలి.
వర్షంలో తడవను అని, పరిగెత్తను అని, ఇప్పుడు వివాహానంతరం నా కోసం ఎదురు చూసే వారు ఉన్నారు, వారు నాకు అనారోగ్యం కలి గితే బాధ పడతారు అని, చెట్లు ఎక్కను అని, దిగుడు బావిలోకి దిగను అని, ఇలాంటి అనేకరకములైన ప్రమాణాలు చేసి వరుడు కళ్యాణవేదిక దగ్గిరకి బయలుదేరుతాడు.
వేడి నీళ్ళని చల్ల నీళ్ళలో పోసి, ఆ నీటితో అభ్యంగన స్నానం చేయించడమే ప్రధమంగా ఉంటుంది. వేడి నీటిలో చన్నీళ్ళను కలపడం వల్ల వైద్య శాస్త్ర రీత్యా (రొంప, జలుబు) అనే రోగాలు దరికి రావు. అలా కాకుండా నలుగుపిండిని రాసుకుని స్నానం చేస్తే అది దానికి ఉపశాంతి. మంగళస్నానం మన వారు ఆచరించేటప్పుడు తప్పకుండా నలుగుపిండి రుద్దుకోమనడం కూడా అందుకే. (పండుగలప్పుడు కూడా)
స్నానమయ్యాక అతడు తనకి, తన గురువుకీ, చెవులకి ధరించడానికి కుండలాల్ని, వస్త్రాలని, గొడుగుని, రెండు చెప్పుల జతని, నలుగుపిండిని, తలంటు నూనెని తలపై ధరించే తల పాగాను గురువుకి సమర్పించి, తానూ ధరించి, ఇంకా పై చదువులకి కాశీకి బయలుదేరుతాడు.