Telugu Traditions – Seemantham : తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది సీమంతం అనే సంస్కారం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం).
సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. ఆ గర్భిణిని అమంగళకరమైన శక్తులు ఆవహించి ఉండునని, వానిని నివారించుటకై ఈ సీమంత సంస్కారము ఉన్నట్లు తెలియుచున్నది. అశ్వలాయన స్మృతి ప్రకారము రుధిరాశన తత్పరులైన రాక్షస శక్తులు ప్రథమ గర్భమును తినుటకు వచ్చుదురు. భర్త ఆ రాక్షస శక్తుల నుండి తన భార్యను రక్షించుకొనుటకై శ్రీని ఆవాహన చేయవలెను. అందు కొరకు ఈ సంస్కారము చేయవలెను అని అశ్వలాయన స్మృతి చెప్పుచున్నది.
ప్రాక్సూత్ర కాలమున సామవేదమంత్ర బ్రాహ్మణమున సీమంత ప్రస్తావన ఉన్నది. దాని ప్రకారము సీమంత సంస్కారము చేయుచు భర్త ఈ విధముగా చెప్పబడినది. “ప్రజాపతి మహైశ్వర్యము కొరకు ఏ విధముగా అతిథియొక్క సీమను నిర్ధారణ చేసెనో అట్లే సంతతి యొక్క దీర్ఘాయుష్యు కొరకు ఈమె (భార్య) కేశములను విభజించుచున్నాను లేక సంవారణము (సీమానం నయామి) చేయుచున్నాను. పుత్ర పౌత్రాదులను కలిగించి నా ముసలితనము వరకు దీర్ఘజీవిగా చేసెదను”. ఇచ్చటనే ఉదుంబ వృక్షముతో స్త్రీకి పోలిక చెప్పబడినది. అనగా బహు సంతతి కలిగిన స్త్రీకి ఉదుంబవృక్షముతో పోలిక కలిగినది. అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్ సంతాన కళ్యాణమునకై గర్భపోషణ చేసే నేతితో చరుపాక ప్రదర్శనము మొదలగు క్రియలను చేయును.
ఇది గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా ఉండవచ్చును). జ్యోతిష గ్రంథములను అనుసరించి శిశు జన్మము జరిగేంత వరకు వీలగు సమయములో ఈ సంస్కారము చేయవచ్చునని చెప్పబడినది.
సీమంతంలో పాటించాల్సిన విధానాలు : గాజులు ఎరుపు, పచ్చ రంగు సహజంగా వేసుకుంటారు. నలుపు, నీలం రంగు గాజులు తప్ప మిగిలిన ఏ రంగు గాజులు అయిన సీమంతంలో వేసుకోవచ్చు. చేతినిండుగ 20, 21, 25 ఉండేలాగా వేసుకోవాలి. ప్రసవం అయ్యేవరకు కూడా ఈ గాజులు వుండాలి. దీని వలన నాడి మీద వత్తిడి పడి సుఖ ప్రసవం అవటానికి అవకాశం వుంటుంది అని నమ్మకము. 7, 12 సంఖ్య ఉండకూడదు. 13 గాజులు ధరించటం మంచిది. సంఖ్యతో సంబంధం లేకుండా ఎంత ఎక్కువ గాజులు వేసుకుంటే అంత మంచిది. యవల మొలకలతో చేసిన మాల/ దండ గర్భవతి మెడలో వేయాలి. భర్త భార్యకి ఏరు పంది ముళ్ళుతో పాపిడి తీయాలి.
సీమంతము చేయు విధానము : ప్రాతః కాలమున గణపతి పూజ, పుణ్యాహవాచనము చేసి, రక్షా బంధనమైన తరువాత ఈ సంస్కారము ఆరంభమగును. ‘ధాతా దదాతు‘ అను ఎనిమిది హోమములు కర్త చేయును. అగ్నికి పడమరగా భార్యను తూర్పు ముఖముగా ఉండునట్లు కూర్బోపెట్టాలి. మూడు మచ్చలుగల ఏదుపంది ముల్లుతో (మొదట నలుపు, ఎరుపుతో కూడిన నలుపు, తెలుపు రంగు) మూడు బర్హిస్సు కట్టలతోను, బ్రహ్మమేడిపండ్ల గుత్తితోను అనగా ఇవన్నీ కలిపి కట్టతో పాపిడి పైకి తీసుకురావలెను. తరువాత ‘రాకా మహగ్‘ మొదలైన మంత్రాలు చదువుదురు. “పూర్ణిమను పిలుచు చున్నాను. ఈ పనిని నెరవేరునట్లు చేయవలసినది. మంచి బుద్ధి దాన గుణము కలిగిన కుమారుని ఇచ్చుగాక” అని పై మంత్రమునకు అర్థము. పైన చెప్పిన కట్టతో బొడ్డు నుంచి ప్రారంభించి పైకి కదుపుతూ తలపైన పాపిడి వరకు తుడిచి దానిని పారవేయవలయును. తరువాత “యౌగంధరి … ” మొదలైన మంత్రములలోని చరిత్రను పాడవలసినదని వీణా గాయకులను ఆజ్ఞాపింతురు. తరువాత మొలకెత్తిన యవధాన్యమును దారమునకు దండగా గుచ్చి గర్భిణి కొప్పుకు కట్టుదురు. భార్యాభర్తలు ఇద్దరు నక్షత్రములు కనపడు వరకు మాట్లాడకుండా తూర్పుగాకానీ, ఉత్తరమువైపునకు గాని నడిచి ఆవుదూడను తాకి అప్పటి వరకు పాటించిన మౌనమును వదలి మాట్లాడుకొనవచ్చును.
కొన్ని ధర్మశాస్త్రములలో గర్భిణికి దగ్గరగా ఉన్న బ్రాహ్మణ ముత్తైదులు మంగళసూచకములైన వాక్యములను చెప్పవలయును అని ఉన్నది. అనగా ముత్తైదువలు “నీవు వీర పుత్రునకు తల్లివి అవుదువుగాక, జీవ పుత్రులను కలిగి ఉండెదవు గాక !” మొదలైన వాక్యములను చెప్పుదురు. ఈ వాక్యముల వలన తల్లిపై మరియు కలుగబోవు శిశువుపై మంచి ప్రభావము చూపును అని నమ్మకము. ఈ సందర్భములోనే కోడ దూడను తాకవలయును అనుట పురుష సంతతికి ప్రతీకగా చెప్పుదురు.
నీటిలో బంగారము పూసిన కంచుపాత్రను భర్త భార్యకు చూపుతూ ఏమి చూచుచున్నావు అని అడుగగా, సంతానమును, ఆయుర్దాయమును చూచుచున్నాను అని భార్యతో అనిపించవలెను అని జైమిని గృహ్య సూత్రములలో కలదు. ప్రస్తుత సీమంత సంస్కారములో పైన చెప్పిన ఆచారములు చాలా వరకు లోపించినవి. పువ్వులు పెట్టుట, గాజులు తొడుగుట మొదలైన ఆచారములను నేడు పాటించుచున్నారు. కొన్ని ప్రాంతాలలో 8వ నెలలో మేడిపండ్ల గుత్తులను కట్టుట మొదలైన ఆచారమును నేటికి పాటించుచున్నారు.
Also Read : పుంసవనం