సమ్మక్క సారలమ్మ జాతర
Sammakka Saralamma Jatara
Telugu Tribal Traditional Events : Sammakka Saralamma Jatara –
ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ పండుగగా మేడారం జాతరకు ప్రసిద్ధి. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుక సమయంలో వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని ఆ కుగ్రామం ఇసుకేస్తే రాలనంత జనం, వారు విడిదికి ఏర్పాటు చేసుకున్న శిబిరాలు, శివసత్తుల పూనకాలతో కోలాహలంగా ఉంటుంది. గద్దెలపై కొలువుదీరే సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా గిరిజనులు తరలివస్తారు. ఇది అడవిబిడ్డల పండుగే అయినా ఇటీవలి కాలంలో ఇతరులూ పెద్ద ఎత్తున జాతరను సందర్శిస్తున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు.
విభిన్న కథనాలు
సమ్మక్క సారలమ్మల పుట్టుక, వారు దేవతలుగా వెలసిన వైనంపై విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గిరిజన పూజారులు, పెద్దలు చెప్పేదాని ప్రకారం… 12వ శతాబ్దంలో(కాకతీయుల కాలంలో ఇక్కడి గిరిజనులు స్వతంత్రంగా జీవించేవారు.
మేడారానికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉండే బయ్యక్కపేట ఆదివాసీలు (చందా వంశీయులు) ఎప్పటిలాగే ఒక రోజు అడవిలోకి వెళ్లి ఎల్లేరు గడ్డలు సేకరిస్తున్నప్పుడు… క్రూరమృగాల మధ్యలో ఉన్న ఒక పసిపాప కనపడింది. ఆ చిన్నారిని జంతువులు సైతం ఏమీ చేయకపోవటాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు గిరిజనులు. ఆ పాపను తమ గూడేనికి తెచ్చుకున్నారు.
మాఘపౌర్ణమినాడు తనకు సమ్మక్క అని పేరుపెట్టి పెంచుకోసాగారు. సమ్మక్క వచ్చినప్పటి నుంచి వారికి అన్నీ శుభాలే చేకూరాయి. సమ్మక్క యుక్తవయసులోకి వచ్చింది. అయితే… అన్నేళ్లలో ఒకసారి కూడా ఆమె ఆహారాన్ని తీసుకుంటుండగా ఎవరూ చూడలేదు. అనుమానం వచ్చిన గిరిజనులు ఏం జరుగుతుందో కనిపెట్టాలనుకున్నారు.
ఓ రోజు రాత్రి సమ్మక్క పెద్దపులిగా మారి జంతువులను తిని ఆకలి తీర్చుకోవడాన్ని చూసి వారు భీతిల్లారు. దీన్ని తాము తట్టుకోలేమని, గ్రామం విడిచి వెళ్లిపోవాలని సమ్మక్కను కోరారు. వారి కోరికను మన్నిస్తూ సమ్మక్క సమీపంలోని గుట్టపైకి వెళ్లి మాయమైంది.
బయ్యక్కపేట జాతర
వాస్తవానికి ‘మేడారం‘ జాతర మొదట్లో బయ్యక్కపేటలో జరిగేది. ప్రతి రెండేళ్లకు ఒకసారి గుట్టపైకి వెళ్లి కుంకుమభరిణె రూపంలో ఉన్న శక్తిస్వరూపిణి అయిన సమ్మక్కను గ్రామంలోని గద్దెల వద్దకు తీసుకొచ్చే వారు. ఈ జాతరకు పరిసర గిరిజన గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చేవారు. అయితే, జాతరకు వచ్చే జనాలకు వసతులు కల్పించడం బయ్యక్కపేట గ్రామస్థులకు తలకుమించిన భారమైపోయింది.
మేడారం నుంచి వచ్చి పూజలు నిర్వహించడం గిరిజన పూజారులకూ కష్టంగా మారింది. తాము జాతరను జరపలేమని, ఇకపై మేడారం పరిసరాల్లోనే దాన్ని నిర్వహించాలని బయ్యక్కపేట గిరిజనులు చెప్పేశారు. ఫలితంగా 1935కి పూర్వమే మేడారంలోని సిద్ధబోయిన వంశస్థులకు ఆ జాతర నిర్వహణ అవకాశం వచ్చింది.
అయితే, ఇప్పటికీ బయ్యక్కపేటలోని గద్దెల దగ్గర చందా వంశస్థులు పూజలు చేస్తారు. అక్కడ సమ్మక్క గద్దె మాత్రమే కనపడుతుంది. మేడారంలో సమ్మక్కతోపాటు సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజుల గద్దెలుకూడా ఉంటాయి. జంపన్న వాగులో స్నానాలుచేసి వనదేవతలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయన్నది గిరిజనుల నమ్మకం. ఈ వనదేవతలు నిరాకారులు
వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు రూపాలుండవు. 2 మీటర్ల వ్యాసార్థంతో నిర్మించిన గద్దెల మధ్యలో గుంజ (కర్ర) పాతి ఉంటుంది. ‘వనం‘ తెచ్చి గద్దెలపై చేర్చడంతో జాతర ప్రారంభం అవుతుంది. వనం అంటే కంకబొంగు (వెదురు కర్ర). అడవిలో బండరాయిపై మొలిచే వెదురును మాఘపౌర్ణమికి ముందురోజు బుధవారం తెల్లవారుజామున వనంగా తెస్తారు. అప్పటికే గిరిజన పూజారుల కుటుంబాల స్త్రీలు నిష్ఠతో ఉండి గద్దెలను శుభ్రంచేస్తారు. ముగ్గులు పెట్టి సుందరంగా అలంకరిస్తారు. ఆ తరువాత పూజా కార్యక్రమమంతా మగవారే నిర్వహిస్తారు. ముగ్గురు ముత్తైదువలు, ఇద్దరు పెద్దమనుషులు– మొత్తం ఐదుగురు అడవిలోకి వెళ్లి ‘గడ్డి‘ని కోసుకొస్తారు. ఇదే మండమెలిగే పండుగ.
మాంసం… మద్యం… బంగారం
సమ్మక్క సారలమ్మలను సంతృప్తిపర్చేందుకు బలి ఇవ్వడం, మద్యాన్ని ఆరగింపు చేయడం ఆచారం. ఇలా బలి ఇచ్చిన మాంసాన్ని ఆరగిస్తూ, మద్యాన్ని సేవిస్తూ జాతర రోజులను గడుపుతారు భక్తులు. జాతరలో అతిముఖ్యమైనది ‘బంగారం సమర్పణ‘. బెల్లాన్నే బంగారమంటారిక్కడ. కోరికలు తీర్చమంటూ కొందరు… గతంలో కోరిన కోరికలు తీరడంతో మరికొందరు… నిలువెత్తు బంగారాన్ని మొక్కులుగా అమ్మవార్లకు సమర్పించుకుంటారు. దీంతో గద్దెలు బెల్లంతో నిండిపోతాయి. భక్తులు ఒడిబియ్యం, చీరెలు, సారెలను పెడతారు.
జాతర సమయంలో మేడారంలో ప్రసవించాలని చాలా మంది భక్తులు మొక్కుకుంటారు. నిండు చూలాలుగా ఉన్నవారు ఇక్కడికి ప్రసవం కోసం వస్తుంటారు. మగపిల్లవాడు పుడితే సమ్మయ్య, సారయ్య అని, ఆడపిల్ల పుడితే సమ్మక్క, సారమ్మ అని పేర్లు పెట్టుకుంటారు.