Telugu Tradional Events : Runja Vaidyam –
విశ్వ బ్రాహ్మణులకు (విశ్వకర్మ బ్రాహ్మణులు) గోత్రాలను, వంశ నామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది ఇది
దీని శబ్దం కూడా రెండు, మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటి లేదు. రుంజకారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటారు. తరం నుంచి తరానికి ఈ వాద్యకళ కొనసాగుతూ వస్తున్నది. 32 రకాలుగా దీన్ని వాయించ వచ్చునట. రుంజ అనే ఈ చర్మ వాద్యం శైవ సంప్రదాయానికి చెందినది.
రుంజ కథ చెప్పే విధానం
రుంజ కథకులు గ్రామానిని వెళ్ళినపుడు ఊరిలో పెద్ద ఆచారి అంటే మను బ్రహ్మ సంతతి వారు ఇంటికి వెళ్ళి లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి వెళ్ళి కథ చెబుతారు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం, కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. ఉంజ కథకుడు కథను ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశగమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా చెబుతారు.
రుంజ వాయిద్యం – రుంజలు –
రుంజ వాయిద్యం పట్టుకున్నప్పుడే వీరిని రుంజలు అంటారు. కాని కులం రీత్యా వీరు బేడ జంగాల కులానికి చెందినవారు. పనసలు, . కోమటి పనసలు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తెలంగాణా జిల్లాలలో ఉన్నారు. ఈ రుంజ కళాకారులు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో విశ్వ బ్రాహ్మణుల ఇంటికి వెళ్తారు. ఎక్కడకు వెళ్ళినా ఒక సంస్కృత శ్లోకం చదివి తెలుగులో కథ చెబుతారు. సాధారణంగా ఈ కథ చెప్పేవారు ముగ్గురు ఉంటారు. ఒకరు కథ చెబితే, ఒకరు వాయిద్యం వాయిస్తే ఇంకొకరు వంతగా ఉంటారు.
రుంజలు చెప్పే కథలు
విశ్వకర్మ పుట్టుక, పంచ బ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం గారి చరిత్రను రుంజలు చెబుతారు. విశ్వబ్రాహ్మణులలోని సానగ (కమ్మరాచారి), సనాతన (వడ్రపుపని), అభవనస (కంచరపుపని), ప్రత్నన (శిల్పాచారి), సువర్ణస (బంగారపు ఆచారి) గోత్రాల వారి ఇంటికి వెళ్తారు.
రుంజవాయిద్యం ఎలా ఉంటుంది?
రుంజ వాయిద్యాన్ని బలమైన కర్రపుల్లలతో వాయిస్తారు. రుంజను ఏటవాలుగా ముందుకు వంచి కదలకుండా మోకాళ్ళతో అదిమిపెట్టి, చెతులతో త్రాళ్ళను లాగి శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృ తంగా వాయిస్తారు. రుంజ మీద వీరణం, డప్పువాయిద్యం, తాషా, సప్తతాళాలు వాయిస్తారు.
పార్వతీదేవి కళ్యాణంలో రుంజ వాయిద్యం
రౌంజ కాసురుడనే రాక్షసుడను సంహరించి వాడి శరీర భాగాలతో చేసిన వాయిద్యం కావున దీనిని రుంజం అనే పేరు వచ్చింది అంటారు. ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరింపబడింది.