ముగ్గులు

Rangoli

Telugu Festival Tradition : Rangoli

తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ, సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు. ముగ్గు కేవలం సంస్కృతి సంప్రదాయాలలో భాగం మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీ యాంశము కూడా ఉంది. ముగ్గు లేదా రంగవల్లి అనేది ఇంటి వాకిలి, ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు. ముగ్గులను ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళనుగాని సుద్ద ముక్కలను గాని తడిపి వేస్తారు.


మామూలు ముగ్గులు

మామూలు పిండితో, పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతిరోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేసే ముగ్గులు ఇవి.

రంగుల ముగ్గులు

కొన్ని విశేష సందర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సరంలో ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటి రంగుల ముగ్గులు వేస్తుంటారు. కొన్ని ముగ్గులలో పక్షులు, జంతువులు, పువ్వులు మొదలైనవి కూడా కనిపిస్తాయి.

పండుగ ముగ్గులు

సాధారణంగా ముగ్గులతోనే పండుగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తి అయ్యేంత వరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకుల తోను, గొబ్బెమ్మలతోను అలంకరిస్తారు.

చుక్కల ముగ్గులు

ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గులు. చుక్కల సంఖ్యని బట్టి ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క ముగ్గు మొదలైన పేర్లతో వీటిని పిలుస్తారు


రథం ముగ్గు

సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసే రంగుల ముగ్గులు వేసే పరంపరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గు తోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు, తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులే.

సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోను, పట్టణలలోను సాధారణంగా నిర్వహిస్తారు.

ఇంటి ముందు కళ్ళాపు చల్లి దాని పై ముగ్గు వేస్తే వీటిలో నున్న జీవ రసాయనాలు క్రిమి కీటకాలని వెలుపలి నుండి ఇంటిలోనికి రాకుండా నిరోధిస్తాయి. వివిధ రకాల సూక్ష్మక్రిముల ద్వారా ప్రబలే రోగాలని ఇవి నిరోధిస్తాయి. ఇంటి లోగిళ్ళకి ముగ్గులు అలంకారం కూడా తెచ్చి పెడతాయి. కాంక్రీటు అడవులు నిర్మించబడుతున్న ఆధునిక యుగంలో, ఇరుకైన అపార్టుమెంట్ల సంస్కృతి పెరగటంతో ముగ్గులు నగరాలలో అక్కడక్కడా కనిపించిననూ కళ్ళాపు మాత్రం దాదాపు తెలుగువారి ముంగిళ్ళనుండి కనుమరుగైనది.

 

Read More : గొబ్బెమ్మల కొలువు వేడుక

Leave A Reply

Your Email Id will not be published!