చూడాకరణ సంస్కారం/పుట్టు వెంట్రుకలు
Puttu Ventrukalu - Baby's First Haircut
Telugu Tradition : Puttu Ventrukalu – Baby’s First Haircut : చూడాకరణ సంస్కారము బిడ్డకు మూడవయేడు వచ్చిన తరువాత చేయుదురు. ఇందులో బిడ్డ యొక్క తల వెంట్రుకలు తీసివేయుట ప్రధాన క్రియ అనగా పుట్టు వెండ్రుకలు తీయించడం. దీనినే చౌలము అని కూడా అంటారు.
శిశువునకు గర్భమునందు కలిగిన కేశములను తొలగించి చూడా కరణ చేసి దీనిద్వారా శిక్షయు, సంస్కారయోగ్యతయు కలిగింప బడును. కావున, బిడ్డకు అపాత్రతా దోషము నిరాకరించబడును. వృద్ధి శ్రాద్ధము, హోమము జరిగిన పిమ్మట సూర్యుని ప్రార్థించుచు, “సూర్యుడు దేనితో బృహస్పతికి కేశఖండనమొనర్చెనో, దేనితో వాయు దేవుడు ఇంద్రునకు కేశఖండనము చేసెనో, అట్టి బ్రహ్మరూపి యగు కత్తి ద్వారా నేను నీకు కేశఖండనము చేయుచున్నాను. నీకు ఆయు స్తేజోబలాభి వృద్ధులు కలుగుగాక!” అన్న అర్థము గల మంత్రములు పఠించబడును.
ఈ చూడాకరణమందు శిఖ మాత్రము ఉంచి మిగిలిన కేశములు తొలగించాలి. కేశములు బలమునకు మూలం. అవి పూర్తిగా తొలగిం చుట వలన మనిషి బలహీనుడగును. శిఖతో పురుషునకు బలము, వీర్యము, శౌర్యము, ఆధ్యాత్మికోన్నతికి చెప్పనలవి కాని సంబంధము ఉన్నందు వలన ఈ శిఖధారణము హిందువుల జాతీయ చిహ్నముగా పరిగణించబడింది. చూడాకరణము ఈ జాతీయ చిహ్న మునకు మొదటి సన్నివేశమగును.
సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుషు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనే లేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడో ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.
చూడాకరణం అంటే ఏమిటి?
చూడాకరణం అంటే సిగజుట్టును సరి చేయటం అనుకోవచ్చు. ఇది ఉపనయన సంస్కారానికి ముందు చేయవలసిన సంస్కారం. ఈ సంస్కారం, మిగిలిన దాదాపు అన్ని సంస్కారాలలాగానే ఆరోగ్యపరమైన కారణాలతో ఆరంభం అయిందని పరిశీలకుల అభిప్రాయం.
బిడ్డ తలపైన పెరిగే జుట్టులో అనేక హానికరమైన క్రిములు చేరే ప్రమాదం ఉందనీ, వాటి వల్ల ఆరోగ్యం క్షీణించగలదని గుర్తించి, చూడాకరణ సంస్కారాన్ని ప్రవేశ పెట్టి ఉంటారు. అయితే, లోహయుగం ఆరంభం అయిన తొలినాళ్లలో, బిడ్డ తలమీద కత్తిని పెట్టటం అనేది తల్లిదండ్రులకు చెప్పలేనంత ఆందోళన కలిగించి ఉంటుంది.
తమ బిడ్డకు ఎలాంటి ప్రమాదమూ జరగరాదని కోరుతూ తల్లిదండ్రులు చేసే ప్రక్రియగా చూడాకరణ సంస్కారం క్రమంగా రూపు దిద్దుకుని ఉంటుంది. ఇదే ఇప్పుడు పుట్టు వెంట్రుకలు తీసే వేడుకగా మార్పు చెందిందనుకోవాలి.
చూడాకరణం చేసే విధానము :
ఆపస్తంభ సంస్కార దీపిక ప్రకారము ఈ సంస్కారము ఈ విధముగా చేయవలెను అని చెప్పుచున్నది. భూమిని శుద్ధిచేసి, ఐదు మూకుళ్ళకు తెల్లని దారమును చుట్టి మామిడి ఆకులతో అలంకరించి కొన్ని మంత్రము లతో సహా వాటి యందు మట్టిని పోసి నవధాన్యమును కంచుపాత్రలో పోసి వాటిని ఆవుపాలతో అభిషేకించి, ఐదు మూకుళ్ళలో చల్లి దేవతలను ఆవాహన చేసి షోడశోపచారములచే పూజించవలెను.
నాందీ ముఖము, ఇడా వాచనము అనగా దేవతలను ఆహ్వానించ వలెను. తరువాత అగ్నిని రగిల్చి అగ్నికి పడమరగా బాలుని తూర్పు ముఖముగా కూర్చుండబెట్టి, మూడు తెల్లమచ్చలుగల ఏదుమల్లు, మూడు బిర్హిస్సు కట్టల కొసలు, మేడిపండ్ల కట్టతోను కలిపిన కట్టతో తూర్పు నుండి ప్రదక్షిణముగా జుట్టును తడుపుచు “ఆప ఉందంతు…” అను మంత్రములతో నాల్గు వైపులా మూడేసి దర్భలను అడ్డముగా ఉంచుకొని కేశ సంస్కారము చేయవలెను.
“ఆయువు, తేజస్సు కొరకై దీర్ఘకాలము సూర్యుని చూచుటకై నీరు ఈ పిల్లవాని శిరస్సును తడుపుగాక” అను అర్థమునిచ్చు నాల్గు మంత్రములతో ప్రతి మంత్రముతో ప్రతి దిక్కున కేశమును కత్తిరించ వలెను. కత్తిరించబడిన జుట్టును పేడ గురిగియందు ఉంచి నీటిని ముట్టుకొని “ఉప్త్వాయ కేశాన్” అను మంత్రముచే మేడిచెట్టు మొదటగాని, దర్భదుబ్బున కాని ఉంచవలెను. తరువాత పురోహితునకు గోదానము చేయవలెను.
ఈ చూడాకరణ సంస్కారము తరువాత ఒక సంతవ్సరము వరకు తల్లి పులుపు పదార్థమును తినరాదని, ఉప్పును వాదరాదని, కోపముతో తినరాదు అని వారాహ గృహ్య సూత్రము పేర్కొనుచున్నది.