ప్రభలు
Prabhalu
Telugu Tradional Events : Prabhalu –
ప్రభల సంస్కృతి గుంటూరు జిల్లా, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కనిపించే ఒక గొప్ప తెలుగువారి సంస్కృతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహా శివరాత్రినాడు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ, క్వారీ బాలకోటేశ్వరస్వామి, సత్రశాల ప్రాంతాలలో ఈ ప్రభల సంస్కృతి కనిపిస్తుంది.
ప్రభ అంటే ఏమిటి?
ప్రభ అనేది దేవుని ఊరేగింపుకు పల్లకీ లేనిచోట్ల ఉపయోగించే అరపలాంటి నిర్మాణము. చిన్న చిన్న దేవాలయములలో రెండు కర్రలపై నలుగురు పట్టుకొనేలా ఒక అరపను చేసి దానిపై దేవుని విగ్రహము లేదా బొమ్మను పెట్టి వెనుక దేవాలయము మాదిరి ఒక కట్టడాన్ని తేలికపాటి గడకర్రలతో రంగుల కాగితాలతో తయారుచేసి దానిపై దేవుని ఊరేగించేవారు.
అది రానురానూ అంతటా వ్యాపించి తెలుగు వారి సంప్రదాయంగా మారింది. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు విచ్చేసి శోభ చేకూర్చుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రభకు బహుమతిని కూడా అందచేస్తారు.
ప్రభల నిర్మాణం వెనుక ఐతిహ్యం
కోటప్పకొండ సమీపంలోని కొండ కావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి అనే గొల్లభామ పరమశివ భక్తురాలు. ఆమె ప్రతిరోజు కొండపై చేరుకొని పాత కోటయ్యస్వామికి పూజలు చేసేది.
ఒకనాడు తాను వయోభారంతో కొండ ఎక్కలేక పోతున్నాను స్వామిని వేడుకోగా స్వామి ప్రత్యక్షమై ముందు నీవు వెనుజూడకుండా కిందకు నడువు నీ వెనుక నేను వస్తానని చెప్పాడు. గొల్లభామ కిందకు దిగుతూ స్వామి వెనుక వస్తున్నారో లేదో అని వెనుదిరిగి చూడటంతో స్వామి శిలగా మారాడు. దీంతో గొల్లభామ తిరిగి ఆ స్వామిని వేడుకోగా ఎప్పుడైతే నా కొండకు కోటీనొక్క ప్రభలు వస్తే అప్పడు కొండదిగి కిందకు వస్తానిని చెప్పాడు. దీంతో ప్రతి సంవత్సరం శివరాత్రినాడు కోటప్పకొండకు సమీపంలోని అన్ని గ్రామాలవారు ప్రభలు, విద్యుత్ ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు వస్తారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్పకొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రికి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి.
లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవు తారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, యి హరికథలు మొదలైనవి ఉంటాయి. తల నీలాల మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటేశ్వరుడు, త్రికోటేశ్వరస్వామి అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది.
బయలు దేరిన ప్రభల బండ్లు ఆయా గ్రామాల గుండా ప్రయాణించే టప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలను చదువుతారు.
ఇలా చదివేవారు జంగాలు, ఆరాధ్య బ్రాహ్మణులు. శైవులు, వీర శైవులు పలు సందర్భాలలో దక్షయజ్ఞ దండకం చదివినట్లే ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గధారులు ప్రభ ముందు నిలబడి వెనకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు తొక్కుతూ వుంటే పక్కనున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని తప్పెట వాయి ద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరగాలనూ, కాహశాలనూ ఊది దండకం చదువరిని ఉత్తేజ పరుస్తారు.
కోటప్పకొండ ప్రాంతంలోనే కాకుండా పల్నాడు ప్రాంతంలోని ఇతర గ్రామాల్లో జరిగే తిరునాళ్లలో కూడా ప్రభల సంస్కృతి కనపడుతుంది. కోటప్పకొండ తరహాలో ప్రభలను ప్రదర్శనగా కొండలకు తరలించం అనేది ఇతర ప్రాంతాల్లో కనిపించదు. ఇక్కడ తిరునాళ్లు జరిగే ప్రదేశంలోనే ప్రభలు కడతారు.