Telugu Festival Tradition : Pottelu Pandalu –
గొర్రె పొట్టేళ్ళకి కోడి పుంజుల్లాగే పౌరుషం ఎక్కువ. అవి ఢీకొనడం మొదలు పెడితే తల నుంచి రక్తం ఏరులై పారినా లెక్కచేయవు. పందెం రాయుళ్ళు పొటేళ్ళకు ఢీకొనటంలో ముందుగా తర్ఫీదు ఇస్తారు. మొదట పొట్టేలు తలకు దగ్గరగా అర చేయి పెట్టి తాకిస్తూ క్రమంగా దూరంగా నిలిచి “డుర్ చిప్” అని అరచేయి చూపిస్తారు. అది పరుగు పరుగున వచ్చి అరచేయిని ఢీకొంటుంది.
ఆ తరువాత చేయి బదులు చెక్కను పెట్టి గట్టి దెబ్బకు అలవాటు చేస్తారు. వానిని బలంగా మేపి పండుగకు పందాలలోకి దింపుతారు. పందాలలో పొట్టేళ్ళు ఒకదాని తలనొకటి ఢీకొంటూ వీరోచితంగా పోరాడతాయి. పొట్టేళ్ళ పందెం అంటే చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి చూసి వినోదిస్తారు. ఇలా పొట్టేళ్ళ పందాలు మన వినోద సంప్రదాయాలలో ఒకప్పుడు భాగంగా ఉండేవి.