Telugu Dance Tradition : Perini Dance
పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం. దీన్నే “యోధుల నృత్యం” అని కూడా వ్యవహరిస్తారు. పూర్వ కాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. ఓరుగల్లును దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితా మహులుగా పిలవబడే ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
పేరిణి నృత్యం రెండు విధాలు
పేరిణి తాండవం రెండు విధాలు. ఒకటి పురుషుల చేతా, రెండవది స్త్రీల చేతా చేయబడుతుంది. పురుషులు చేసే నృత్యాన్ని ‘పేరిణి తాండవ‘ మని, మహిళలు చేసే నృత్యాన్ని ‘పేరిణి లాస్యం‘ పేరిట ప్రదర్శిస్తారు. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరిణి శివ తాండవం. ఇది వీరులు చేసిన వీర నాట్యం.
కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అనువుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి.
నృత్య ప్రదర్శనలో శివుని ఆవాహనం
పేరిణి నృత్యం చేసే ప్రతివ్యక్తి శివుణ్ణి తనలో ఆవహించుకున్నట్టు భావించి, ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధాన పేరణికి అతి ముఖ్యమైనది. ఓ పరమశివా? నాలో శక్తిని ప్రవేశింపజేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నా శరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ఈ నర్తనాన్ని ప్రారంభిస్తారు.