కాళ్ళకి పారాణి

Parani

Telugu Marriage Tradition : Parani –

కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం తెలుగువారి ముంగిళ్ళలో ఎంతో సుందర దృశ్యం.



పారాణిని పెళ్ళి సమయంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కాళ్ళకు చేతులకు పూసి అందంగా తీర్చిదిద్దుతారు. ఇది గోరింటాకు వలె ఉన్నప్పటికి దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పెళ్ళి సమయంలో వధువరుల అలంకరణలో ఒక సాంప్రదాయంగా వాడుతున్నారు.

పసుపుతో పాటు పాదాల అలంకారానికి వాడేది పారాణి. పసుపు సున్నం నీరు కలిపితే వస్తుంది చక్కని ఎర్రని పారాణి. బాగా పల్చగా ఉంటే దీనిని వసంతం అంటారు. పూర్వం వసంతం అడటానికి పిచికారి గొట్టంలో ఎర్రని ద్రవాన్నే పోసే వారు. రంగులు సహజమైనవి కనుక ప్రమాదకారులు కావు. ఆహ్లాదకరంగా ఉండటమే కాదు త్వరగా పోతాయి కూడాను. దిష్టి తియ్యటానికి, ముఖ్యంగా శుభ సందర్భాలలో పారాణి నీటిని (ఎర్ర నీళ్ళు అంటారు) ఉపయోగిస్తారు.

అన్నీ శుభకార్యాలలో కాళ్ళకి పారాణి పెట్టే సంప్రదాయం నాటికీ కొనసాగుతోంది. ఇది ఆడవారికి సంబంధించింది అనుకుంటాం. కాని ఇది పురుషులకు ఇద్దరికీ వర్తించే సంప్రదాయం. కనుకనే పెళ్లిళ్లు, వడుగులు మొదలైన సందర్భాలలో పెళ్లి కొడుకుకి పసుపు రాసి, పారాణి పెడతారు. పసుపు పారాణి మంగళ ద్రవ్యాలు. ఐదోతనానికి చిహ్నాలుగా భావన.

ప్రత్యేకమైన పూజలు చేసేప్పుడు పూజ చేసే వారూ, వారి చేత ముత్తైదువలుగా పూజింప బడేవారూ పాదాలకి పసుపు పారాణి విధిగా అలంకరించుకోవలసి ఉంటుంది. నూతన వధువు అని చెప్పటానికి కాళ్ల పారాణి తడి ఆరలేదు అని ఆలంకారికంగా చెప్పటం వివాహానికి పారాణికి ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తుంది. పచ్చని పసుపు మీద ఎర్రని పారాణి గీతలు పాదానికి ఎంతటి అందాన్ని కలిగిస్తాయి. అందంతో పాటు ఆరోగ్యం.

 

Read More : పట్టు వస్త్రములు ధరించుట

Leave A Reply

Your Email Id will not be published!