పగటి వేషాలు

Pagati Veshalu

Telugu Traditional Events : Pagati Veshalu –

జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది. అట్లాంటి కళారూపాలలో పగటివేషాలు ఒకటి. చాలా జానపద కళారూపాలు మతపరంగానో, కులపరంగానో, వాద్యాల పేరుతోనో పిలువబడితే కేవలం ప్రదర్శనా సమయాన్ని బట్టి పిలువబడేది పగటివేషాలు కళ. అనేకమైన వేషాలు ప్రదర్శింపబడడంచేత, పగటిపూటనే ప్రదర్శింపబడడంచేత ఇవి పగటివేషలయ్యాయి. పగటి వేషాలనే పైటేషాలని కూడా అంటారు.



వీధి నాటకాలే పగటివేషాలు

పగటి వేషాలు జానపద కళారూపాల్లో ప్రముఖమైనవి. వీధినాటకాలే పగటివేషాలుగా మారాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రదర్శించే వేళను బట్టి, సమయాన్ని బట్టి వీటికి పగటివేషాలని పేరు వచ్చింది. కేవలం పగటిపూట మాత్రమే వీటిని ప్రదర్శిస్తారు. పగటివేషాలను, సంచారి పగటివేషాలని, స్థానిక పగటివేషాలని విభజించవచ్చు. సంచారి పగటివేషాల వాళ్ళు దాదాపుగా సంచారజీవనం చేస్తూ ప్రదర్శన లిస్తుంటారు. వీళ్ళనే బహురూపులు అనికూడా అంటారు. పగటివేషాల ప్రదర్శన ఒక ఊళ్ళో నెలల పాటు ఉంటుంది. ప్రతి రోజు ప్రదర్శించి తరువాత చివరి రోజున సంభావనలు తీసుకుంటారు. జానపద కళలూ చాలా వరకు యాచక వృత్తిగా మారిపోయాయి. అట్లా మారిన వాటిలో పగటివేషాలు ఒకటి. వచ్చిన సంభావన అందరు పంచుకుంటారు. వీరు ఆహార్యం, అలంకరణ పట్ల శ్రద్ధ వహిస్తారు. సంభాషణలు, వీరు చెప్పే పద్యాలు రక్తి కట్టిస్తాయి.

పగటివేషాల్లో వచ్చిన మార్పులు

ప్రాచీన కాలంలో అనేక పగటివేషాలు ప్రదర్శింపబడేవి. కాని ఇప్పుడు అన్ని వేషాలు వేయడం లేదు. కారణం జీవనంలో వచ్చిన మార్పులేనని వీరు చెబుతారు. ఒకప్పుడు బోడి బాపనమ్మ వేషం వేసేవారు. కాని ఉదయమే విధవ మోహం చూడలేమని వేషంతో మా యింటి వద్దకు రావద్దని కొందరు చెప్పడం మూలాన ప్రస్తుత పరిస్థితుల్లో వేషం వేయడంలేదని వీరు చెబుతున్నారు. అట్లే కులాలకు, మతాలకు చెందిన సాత్తని వేషం, బ్రాహ్మణ వేషం వంటివి వేయడంలేదు. వీరు ప్రదర్శించే వేషాలలో అర్థనారీశ్వర వేషం ప్రత్యేకమైనది. వేషం మేకప్ వేయడానికి దాదాపుగా 3 గంటల సమయం పడుతుందని, సాయంకాలం దాకా మేకప్ ఉండాలి కాబట్టి ప్రత్యేకమైన రంగులు వాడతామని వీరు చెబుతారు. ఒకే వ్యక్తి స్త్రీ, పురుష వేషాలు ధరించి సంభాషణలు చెప్పడం అంటే సామాన్యం ఏమీ కాదు.

పగటి వేషాల చారిత్రకత

జనవ్యవహారంలో ఉన్న కథలను బట్టి పగటివేషాలు రాజు కళింగ గంగుకథ, సంబెట గురవ రాజు కథ, విజయనగర రాజుల కథలు ప్రస్తావనలోకి వస్తాయి. పగటి వేషాలకు చారిత్రకాధారాలున్నాయి. భిక్షుకవృత్తిగా ప్రారంభమైన కళ కాలక్రమంలో ఒక సంక్లిష్ట రూపంగా మారింది. శాతవాహనుల పరిపాలనా కాలమందే కళారూపం ఉందని, హాలుని గాథాసప్తశతిలో దీని ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. మార్గ, దేశి, శిష్ఠ సాహిత్య లక్షణాలన్ని మూర్తీభవించిన కళ పగటివేషాలు.

పగటివేషాలు – వర్గీకరణ –

పగటి వేషాలు ఒకప్పుడు దాదాపుగా 64 ఉండేవని కాని ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నామని నంద్యాల కళాకారులు అంటారు. ఇతివృత్తం ఆధారంగా పగటి వేషాలను ఐదు విధాలుగా విభజించవచ్చు. మతపరమైనవి : ఆదిబైరాగి వేషం, చాత్తాది వైష్ణవ వేషం, కొమ్ము దాసరి వేషం, హరిదాసు వేషం, ఫకీరు వేషం, సాహెబుల వేషం.

కులపరమైనవి : బుడబుక్కల వేషం, సోమయాజులుసోమిదేవమ్మ వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం, వీరబాహు వేషం, గొల్లబోయిడు వేషం, కోయ వాళ్ళ వేషం, దేవరశెట్టి వేషం, దేవాంగుల వేషం, ఎరుకలసోది వేషం వంటివి. పురాణపరమైనవి: జంగం దేవర వేషం, శక్తి లేదా శూర్పణఖ వేషం, అర్థనారీశ్వర వేషం వంటివి.

జంతు ప్రదర్శన పరమైనవి: గంగిరెద్దుల వేషం, పాములోల్ల వేషం, ఇతరములు: పిట్టలదొర వేషం, చిట్టి పంతులు వేషం, కాటికావిళ్ళ వేషం వంటివి.

పగటివేషాలు – ప్రదర్శన రీతులు

పగటివేషాల్లో కొన్నింటిలో సంభాషణలకు ప్రాధాన్యత ఉంటే మరి కొన్నింటిలో పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. బుడబుక్కల వేషం, ఎరుకలసాని వేషం, బోడి బ్రాహ్మణ స్త్రీ వేషం వంటి వాటిలో సంభాషణలకు ప్రాముఖ్యత ఉంటుంది. పురాణ వేషల్లో హార్మోనియం, తబలా వంటి వాద్యాలతో పాటు యక్షగాన శైలిలో ప్రదర్శన ఉంటుంది. కుల సంబంధమైన పగటివేషాలు సంఘంలోని అనేక కులాల వారి జీవనవిధానాన్ని వ్యంగ్యంగా ప్రదర్శిస్తాయి. ప్రతి కులాన్ని గురించి తెలియచేస్తూ కులాలపై సమాజం యొక్క అభిప్రాయాలను విమర్శిస్తాయి.

వ్యంగ్యమే పరమావధి

పగటివేషాల లక్ష్యం వ్యంగ్యమే. వీరికి రంగస్థలం అంటూ లేదు. ఇంటి గడప, వీధులు, సందులు, గొందులు, అన్ని వీరి రంగస్థలాలే. ప్రదర్శన సమయాల్లో ప్రేక్షకులు, ప్రదర్శకుల మధ్య వ్యత్యాసముండదు.

పగటి వేషాల్లోనే ప్రత్యేకత, ప్రావీణ్యత కలిగిన వేషం అర్థనారీశ్వర వేషం. ఒక వ్యక్తి మధ్యలో తెర కట్టుకొని ఒకవైపు నుండి పార్వతి, మరోవైపునుండి శివుడుగా అలంకరణ చేసుకొని ప్రదర్శనలిస్తాడు. తెర మార్చుకుంటు న్నప్పుడు ఒక వైపు నుండి చూస్తే శివుడు మరో వైపునుండి చూస్తే పార్వతిని చూసిన అనుభూతి కలుగుతుంది. తెర మార్చుకోవడంలోనే వీరి నైపుణ్యమంతా దాగిఉంది.

పగటివేషాలు గొప్పతనం

పగటి వేషాలలో ఉండే గొప్పతనం ఇతరుల్ని నమ్మించడం. ఒకనాటి పరిపాలకుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకు రావడం, వర్గమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి. రాయలసీమలో పగలేసిగాళ్ళు

రాయలసీమ ప్రాంతంలో పగటివేషగాళ్ళను పగలేసి గాళ్ళని పిలుస్తారని తమ జానపద కళా సంపదలో డాక్టర్ తూమాటి దొణప్ప గారు ఉదహరించారు. వీరు కూడా విప్ర వినోదులు లాంటి వారు. దొర వేషం దొరసాని వేషం, వడ్డెరవాడు బ్రాహ్మణ వితంతువు మొదలైన వేషాలను ధరించి చమత్కారమైన మాటల తీరుతో ప్రజలను ఆనందింప చేస్తారు. ధరించే ఆయా పాత్రల నడక, మాట యాస, భాషా ఉచ్ఛారణ వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి వేషాన్నీ తీర్చి దిద్దుకుని సహజత్వం వుట్టిపడేలా వుండే అలంకరణ వస్తు సామాగ్రిని వారే సమకూర్చుకుంటారు. ఎవరు మాట మాటాడినా పరిహాస దరహాసంతో సమాధానాలిస్తారు.

 

Read More : కోలాటం

 

Leave A Reply

Your Email Id will not be published!