Telugu Traditional Games : Oppulakuppa –
తెలుగు వారింట చాలా ప్రసిద్ధమైన ఆటగా దీనిని పరిగణిస్తారు. ఒప్పులకుప్ప ఆట ఆడుటకు ఇద్దరుగాని, నలుగురు కాని బాలికలు కావలయును. ఇద్దరు ఆడుట సులభము. ఇరువురు బాలికలు ఎదురెదురుగా నిలిచి ఎదుటి ఆమె కుడిచేతిని తన ఎడమ చేత్తో ,ఆమె ఎడమచేతిని తన కుడిచేత్తో గట్టిగా బిగించి పట్టుకొని పాదాలకు బలంగా నిలబెట్టి ఇద్దరూ వెనక్కి ఏటవాలుగా వంగి చేతుల్ని బాగా చాపి గిర్రున తిరిగే ఆట ఒప్పులకుప్ప. దీనివల్ల పాదాలకు మోకాళ్ళకీ నడుముకీ చేతులకు చక్కని వ్యాయామం ఈ క్రింది పాట పాడుచూ చుట్టు తిరుగుదురు.
“ఒప్పులకుప్పా, ఒయ్యారి భామా, మినపప్పు – మెంతిపిండి, తాటిబెల్లం – తవ్వెడునెయ్యి గుప్పెడు తింటే – కులుకూలాడీ గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి” ఈ ఆటకు సంబంధించిన పాటను రకరకాలుగా పాడుదురు.
“ఒప్పుల కుప్ప – ఒయ్యారి భామ” సన్నబియ్యం, చాయ పప్పు చిన్న మువ్వ – సన్నగాజు, , కొబ్బరి కోరు, చెల్లపచ్చు రోట్లో తవుడు – నీ మొగుడెవడు? గూట్లో రూపాయి – నీ మొగుడు సిపాయి –
ఒప్పులకుప్పా, ఒయ్యారిభామ! సన్నబియ్యం, చాయపప్పు చిన్నమువ్వ, సన్నగాజు కొబ్బరి కోరు, బెల్లపచ్చు గూట్లో రూపాయి, నీ మొగుడు సిపాయి రోట్లో తవుడు, నీ మొగు డెవడు? దూదూ పుల్ల దురావ్ పుల్ల చూడకుండా జాడా తీయ్
నడుమ కట్టె నా మూట చిట్టి ఊదకుండా పుల్లా తీయ్
మరికొందరు “కొబ్బరి చిప్పలు–చిల్లపిక్కలు” అని పాడుతూ ఆడతారు. ఒకరు ఒక మాట అంటే, రెండో మాటని మరొకరు అందుకొని పాడతారు. మరికొందరు ఈ క్రింది విధంగా కూడా పాడుదురు.
“చెన్నపట్నం, చెరుకు ముక్క
నీకోముక్క, నాకో ముక్క
భీముడి పట్నం, బిందెల జోడు, నీకో బిందె, నాకో బిందె, కాళీపట్నం, కాసుల జోడు,
నీకో కాసు, నాకో కాసు” ఈ ఆటనే బాలికలు తమ చేతుల నెదుటి బాలిక అరచేతిలో తమవ్రేళ్ళ గోళ్ళు ఆనునట్లు పట్టుకొని క్రింది పాట పాడుచు తిరుగుదురు.
“చిప్ప చిప్ప గోళ్ళు – సింగరాజు గోళ్ళు మా తాత గోళ్ళు – మండావ రాళ్ళు
చుక్క చుక్కల గోళ్ళు – సుందరమ్మ గోళ్ళు” అని ఆనందంతో ఆడుకొందురు.