నామకరణం/బారసాల
Naming / Barsala Cermony
Telugu Tradition : Naming / Barsala Cermony – బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారె. అది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయింది. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. దీనిని ఆది శంకరాచార్యులు క్రీ.పూ 2000 లో ప్రారంభించాడు. దీనిని హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి పుట్టింటి వాళ్ళు చేస్తారు. ఆయుషు, వర్చస్సు, వ్యవహారసిద్ధి కలుగుటకు ఈ నామకరణ సంస్కారాన్ని చేయుదురు.
వామాఖిలస్య వ్యవహార హేతః శుభావహం సుభాగ్య హేతుః
నామ్నైవ కీర్తిం లభతే మనుష్యస్తతః ప్రశస్తంభాలు నామ కర్మః
అనగా వ్యవహార హేతువు, శుభావహమైనది, కీర్తికారక మగు నామకర్మ ప్రశస్తమైనది. జాతకర్మ తరువాత, గణపతిపూజ, పుణ్యా హవాచనమైన తరువాత నామకరణ సంస్కారంను ప్రారంభిస్తారు.
నామకరణము చేసే పద్ధతి :
ఓ పళ్లెంలో బియ్యం పోసి, తండ్రిచే దక్షిణ దిశనుంచి ఉత్తరదిశకు మూడు గీతలు గీసి, ముందు శ్రీకారం రాయించి మొదటి గడిలో బిడ్డ పుట్టిన మాసము ప్రకారం వచ్చిన పేరును, రెండవ గడిలో నక్షత్రంను బట్టి వచ్చిన పేరు, మూడవ గడిలో వ్యావహారిక నామం రాపించి, నామకరణ విధి మంత్రాల నడుమ “అగ్నిరాయుష్మాన్… కరోమి” అగ్ని సమిత్తులచే, చంద్రుడు ఓషదుల రసరూపమైన అమృతముచే, యజ్ఞము దక్షిణలచే, బ్రహ్మము బ్రాహ్మణులచే, దేవతలు అమృతముచే ఆయుర్దా యము కలవారైరి.
అటువంటి ఆయుర్ధాయ మంత్రంచే దీర్గాయుష్మం తునిగా ఆశీర్వ దిస్తూ అనే అర్ధముగల మంత్రాన్ని జపిస్తూ, శాస్రోక్తముగా పూజా, జప, హోమ, దానాదులుతో ఈ రెండు సంస్కారాలను శాస్తోక్తంగా వేద పురోహితులవారి ఆధ్వర్యమున నిర్వర్తిస్తారు.
పేర్లు వ్రాసేటప్పుడు మొదలు, చివర శ్రీకారము వ్రాయాలి. మాస నామమును పూజించిన అక్షతలను తల్లిదండ్రులు తీసికొని పిల్లవానిని ఆశీర్వదించిన తరువాత పురోహితుడు ఆశీర్వదించవలెను. ఈ విధంగానే నక్షత్ర నామమునకు కూడా చేయాలి. తరువాత దక్షణము వైపునకు వచ్చి కూర్చొండవలెను.
కుమారుని “అంగాదంగాత్…” అను మంత్రములచే అభిమంత్ర ణము చేయవలెను. శిరస్సును వాసన చూడవలెను. కుమారుని కుడి చెవిలో “అగ్నిరాయుష్మాన్ … కరోమి‘ అను మంత్రమును చెప్పవలెను. తరువాత నివేదించిన పాలను బంగారముతో కుమారునికి త్రాగించుట ఆచారముగా వచ్చుచున్నది.
మగపిల్లవానికి చేసినట్లుగానే ఆడపిల్లకు కూడా చేసి, ‘సర్వస్మాదాత్మన సమ్భూతాసి సాజీవ శరదశ్శతం‘ అను మంత్రముచే శిరస్సును వాసన చూచుట, ఎడమ చెవిని తాకుట చేయవలెను. మగబిడ్డ అయినచో “అగ్ని రాయుష్మాన్” మంత్రముతో కుడి చెవిని తాకుట చేయవలెను.
నామకరణ సంస్కారము తరువాత సంవత్సరము వరకు తల్లి దండ్రులు మాంసమును తినరాదని వరాహుడు మొదలైనవారు చెప్పిరి.
పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులు
మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి
రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి
మూడవది ఇలవేలుపును బట్టి
నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి
చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను కూడా పెడతారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి. మన సాంప్ర దాయం ప్రకారం వచ్చిన వారికి పండు తాంబూలం, పెట్టదలచు కుంటే చుట్టాలకు భోజనము పెట్టవచ్చు. ఇదే రోజున ఉయ్యాలలో వేయటము, బావిలో చేద వేయటం అనే కార్యక్రమాలు చేస్తారు.