ముహూర్త నిశ్చయం
Muhurtha Nischayam - Marriage Date Fixing
Telugu Marriage Tradition : Muhurtha Nischayam –
వధూవరుల తారా బలం–చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయి స్తారు. పెళ్లినాటి ప్రమాణాలు భవిష్యత్ లో దంపతులు తు.చ తప్పకుండా అమలు చేయాలంటే “ముహూర్త బలం” ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో
పరోక్షంలో వధూవరుల తల్లి తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి–పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదా యంలో భాగమే. ఇదంతా “ఆచారం–పద్ధతి”. పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్ళి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు.
ముహూర్త నిర్ణయం
ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింది విషయాలు గమనించాల్సి ఉంటుంది.
1) తారా బలం, 2) చంద్ర బలం, 2) లగ్న బలం, 3) పంచక రహితం, 4) ఏకవింశతీ మహా దోషాలు.
వీటితో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం” గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొనబడలేదు. బుధ, గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యము లకు మంచివిగా పెద్దలు తెలిపారు. అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో , తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.
ఒక పని ముఖ్యంగా వైదికసంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు గ్రహించాలి.
చంద్ర బలం
ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.
జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి శుక్ల పక్షంలో : 2-5-9 కృష్ణ పక్షంలో : 4-8-12 శుక్లపక్షం, కృష్ణ పక్షం రెండిటిలోనూ : 1, 3, 6,7,10,11 అయితే మంచిది.
అనగా శుక్లపక్షంలో చంద్రుడు 4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలంలేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే. కృష్ణపక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూ రానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.