Telugu Marriage Tradition : Mangalasutram –
మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
తాళికట్టే సంప్రదాయం
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది.
సంస్కృతంలో ‘మంగళ‘ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు.
ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపి కూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! ”
మంగళసూత్రాలపై దేవతా ప్రతిమలు
దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకో కూడదట. ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభ మవడం మొదలవుతుందట. కాబట్టి మంగళసూత్రాన్ని ప్లెయిన్ గా వేసుకోవడం మంచిదట.
మంగళసూత్రం – భర్త ఆయుష్షు
మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత బంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడులనుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. అందుకే హిందూ స్త్రీ మంగళ సూత్రము ధరింస్తుంది. వివాహిత మెడలో మంగళ సూత్రము లేదంటే భర్త చనిపోయినట్లుగా భావించవచ్చును.
పసుపు కుంకుమలతో పూజ
ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది అని చెబుతారు. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర లోహాలకు చెందిన వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి.
శక్తి, ధైర్యసాహసాలు
పెళ్లికోసం సమకూర్చుకున్న, ఇచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలు అన్నీ రూపాంతరం చెందినా చివరి వరకూ వెంట ఉండేది తాళిబొట్టు మాత్రమే. మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతా యట. మంగళసూత్రాలలో పసుపుతాడును వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళ సూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుందట.
పగడం, నలుపు పూసలు
మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి. పొరపాటున మంగళసూత్రం పెరిగితే (తెగిపోతే) వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే మెడలో వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుషు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.