కుచ కుచ పుల్లలు
Kucha Kucha Pullalu
Telugu Traditional Games : Kucha Kucha Pullalu –
ఇసుకలో చేతులు కదిలిస్తూ చేతిలో ఉన్న పుల్లను అందులో దాచాలి. ఆ పుల్లను ఎక్కడ దాచి ఉంటామో ఎదుటి పిల్లవాడు చెప్పగలగాలి. ఇసుకలో చేతులు కదిలిస్తున్నపుడు ఎదుటి వారు దాన్ని గమనించకుండా పుల్లను నేర్పుగా ఒక చోట వదలిపెట్టగలగాలి. ఎదుటి వాడు పుల్ల ఎక్కడ ఉందో పట్టేశాడా ఓడిపోయినట్లే! ఇదే ఈ ఆట విధానం.
ఈ ఆటను వెన్నెలవర్తి ఆట అనీ, వెన్నెలపట్టి అనీ, దూదుంపుల్లాట అని రకరకాలుగా అంటారు. ఇది ఇద్దరు పిల్లలు ఆడుకొనే ఆట. ఇసుకలో కూర్చుని ఆడే ఈ ఆట ఎంతో ప్రాచీనమైనది.
ఈ ఆట మొదలు పెట్టడానికి ముందు ఒక పిల్లవాడు రెండో వాడిని కళ్ళు మూసుకోమని చెబుతాడు. మూరెడు పొడవు, నాలుగు అంగుళాల ఎత్తు ఉన్న ఇసుకలో ఒక అగ్గిపుల్లను తన అరచేతిలో పెట్టుకుని ఇసుకలో దాచేస్తాడు. ఆ అగ్గిపుల్లను ఎక్కడ పెట్టానో చెప్పమంటూ పాట పాడతాడు. ఆ పాట ఈ విధంగా సాగుతుంది. వెనకా వెనకా వేముల తోట కనకాహడ్లు కామునిరూపులు మేఘశంకులు మెత్తని గోళ్ళు దూదీమణులు దుప్పటి రేకులు ఈ ఆటని కళ్లు మూసుకోకుండా కూడా ఆడతారు. ఇసుకలో పుల్లను ఎక్కడ పెట్టిందీ రెండోవాడు గమనించనంత నేర్పుగా పెట్టాలి.
“చిక్ చిక్ పుల్లా, షికారు పుల్లా
దొంగలొస్తున్నారు, దాక్కో పుల్లా”
అని కూడా పాడతారు. మరికొన్ని చోట్ల మరో విధంగా కూడా పాడతారు.
కుచ్చు కుచ్చు పుల్లా
కూరాకు పుల్లా
దొమ్మరోజొస్తాడు
దాక్కోవై పుల్లా
దూదూ పుల్లా
దూరాయ్ పుల్లా
చూడాకుండా
జాడా తియ్
ఊడాకుండా
పుల్లాతియ్!
ఇలా చెప్పగానే రెండోవాడు రెండు అరచేతి వేళ్ళు కలిపి పుల్ల ఫలానా దగ్గరుందని గ్రహించి దానిపై అరచేతుల్ని వేస్తాడు. ఇప్పుడు పుల్లను ఇసుకలో దాచిన పిల్లవాడు దాన్ని వెతుకుతాడు, పుల్ల ఇతనికే దొరికితే ఇతను గెలిచినట్లు, పుల్ల ఎదుటివాడి చేతుల కింద ఉంటే అతను గెలిచినట్లు. గెలిచినవారు పుల్లతో ఆటను ప్రారంభించాలి. ఇలా ఆట కొనసాగుతుంది.