కోలాటం

Kolatam

Telugu Tradional Events : Kolatam –

కోలాటం ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల, ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుం డడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు.

కోలాటం ఆడే విధానం

కోలాటం అనేది బృందగానంతో కూడిన లలితమైన బృందనృత్యం. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కర్రముక్కలు పట్టుకొని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయాను గుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతికర్ర ముక్కలను వేరొకరి చేతికర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయం లోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎక్కువగా ప్రదర్శి స్తుంటారు దీనిని స్త్రీ పురుష బృందాలు కూడా చేస్తుంటారు. ఇది సాధారణంగా ఉత్సవ సందర్భంలో చేస్తుంటారు.

తిరుపతి బ్రహ్మోత్స వాలలో కూడా కోలాటబృందాలు పాల్గొంటూ ఉంటాయి. బృందంలోని వారు రెండుచేతులలో రెండు కర్రలను పట్టుకుంటూ పాటలకు అను గుణంగా అడుగులు వేస్తూ కర్రలను కలుపుతూ విడదీస్తూ ఎదుటి వారితో చేరి కర్రలతో కలిపి తాళం వేస్తూ నృత్యం సాగిస్తారు. బృందానికి ఒక నాయకుడు ఉంటాడు. పాటలుగా మాత్రం భక్తిగీతాలను ఆలాపిస్తుం టారు. ఒకే విధమైన దుస్తులను వేసుకుని నృత్యం చేస్తే ఇది మరింత సుందరంగా ఉంటుంది. ఇది తెలుగు ప్రజల ప్రత్యేకతలలో ఒకటి.


కోపులు

కోపు అంటే నాట్యం, నాటకం, తీర్పు, నాట్యగతి విభేదం, ఆట, నాట్యగతి విశేషం అనే అర్థాలున్నాయి. కోలాటంలో అనేకమైన గతి భేదాలనే కోపులంటారు. కోపులకు పాటలోని మొదటి చరణాన్ని బట్టీ, గతికి తగ్గ భావంతోనూ, పురాణ పురుషులైన కృష్ణ, రామ మొదలైనవారి పేర్లతో పేర్లు పెడతారు. ప్రాంతాలను బట్టి కోపుల పేర్లూ మారుతూ వుంటాయి. పలనాటి సీమలో ప్రార్థ కోపు, ఉద్ది తిరుగుడు కోపు, వరగత్తెర కోపు, కృష్ణ కోపు, చెలియ కోపు, కంస కోపు, జడ కోపు, భారత కోపు, భామ కోపు, లాలి కోపు, లంకె కోపు, కలువరాయి కోపు మొదలైనవి ఉన్నాయి. కోలాటంలో పాటనూ, పాటతోపాటు ఆటను మొదలు పెట్టటం ఎత్తుగడ అంటారు. అందరూ వలయంగా ఏర్పడి దేవతలకూ, దేవుళ్ళకూ, రాజకీయ నాయకులకూ జై కొట్టి, వారి వారి కిష్టమైన ప్రార్థనలు చేసి ఇట తయ్యకు తాధిమిత, అనడంతో ఆట ప్రారంభ మౌతుంది. ఎత్తుగడ నుంచి పాట ఆట వేగాన్ని పుంజుకుంటుంది.

కోలాట నృత్యమును స్త్రీలు, పురుషులు కూడా చేస్తారు. వ్యవసాయ వృత్తియందున్న రైతు పురుషులు కోలాటములలో పాల్గొంటారు. దినమంతా కష్టించి పొలం పనిచేసి, సంధ్యవేళ ఇల్లు చేరి, భోజనాదులు ముగించుకొన్న పిదప వినోదముగా కాలము గడుపు ఆటలలో కోలాటము ముఖ్యమైనది. కోలాట విద్యలో నిపుణులైనవారు కరీంనగర్ జిల్లాలో అధికముగా ఉన్నారు. సుమారు నలుబది ఏబది కోపులను తెలిసిన వారు కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నట్లు చెబుతారు.

ఉసెత్తుకోవడం

కోలాటంలో రెండవ కాలం నుంచి మూడో కాలానికి వెళ్ళడాన్ని ఉసెత్తు కోవటం అంటారు. అప్పటివరకూ నెమ్మదిగా చిరుతలు కొడుతున్న ఆటగాళ్ళు ఒక్కసారిగా హుషారుగా, ఎగురుతూ, పాడుతూ, పాట కను కూలంగా అడుగులు వేస్తూనే కోలాటం వేయటాన్ని ఉసెత్తుకోవటం అంటారు. దీనినే త్వరితం ఉసి, దుడుకు అని కూడా అంటారు. ఇలా ఆటలో ఉసెత్తు కోవడం ప్రేక్షకులను ఎంతో ఆనంద పరుస్తుంది.

అద్భుత ప్రదర్శనలు

ఆంధ్రప్రజల జీవితంలో కోలాట నృత్యం పెనవేసుకొనిపోయి ఉన్నది. భక్తిభావంతో దేవుని స్తంభాన్ని పట్టుకొని ఇంటింటికీ తిరిగి, ప్రతి ఇంటి ముందూ రాత్రిపూట ప్రొద్దుపోయే వరకూ కోలాట నృత్యాలు చేస్తుంటారు. ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో, కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరునాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రదర్శిస్తారు. 2

ఇరవై నుంచి నలభైమంది వరకు రంగురంగుల కోల కర్రలతో కాళ్ళకు గజ్జెలు కట్టుకొని బృంద నాయకుని ఆధ్వర్యంలో ఇద్దరు చొప్పున ఒకరికొకరు ఎదురుగా నిలబడి వలయాకారంగా నృత్యం నిర్వహిస్తారు. అందులో జడకోపు కోలాటంలో లయబద్ధంగా నృత్యం చేస్తూ కోలాలతోనే జడను అల్లడం, విప్పడం చేయడం అనేది అత్యంత అద్భుతమైన ప్రదర్శన.

స్త్రీల కోలాటం

స్త్రీలు సరిసంఖ్యలో నేలపై కూర్చొని చేతులతో కుడి ఎడమల అందిం చుకొంటూ కోలాటమేస్తారు. అరచేతులతో కోలాటమేస్తారు. కోలాటంలో కర్రలు ఉపయోగిస్తారు. అందరు నేలపై చక్కముళ్ళు వేసుకొని కూర్చొని చప్పట్లు చరుస్తూ రకరకాల పాటలు పాడతారు.

జడ కోలాటం

జడబిళ్ళను చెక్కతో తయారుచేసి రంధ్రాలు పెట్టి ఒక్కో రంధ్రంలో ఒక తాడును అమర్చుతారు. ఒక్కొక్క స్త్రీ ఒక తాడు ఎడమచేత్తో పట్టుకొని, కుడిచేత్తో కర్రను పట్టుకొని రకరకాల జడలను వేయటం, మరల విప్పటం. ప్రత్యేకంగా స్త్రీలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో పాల్గొంటారు. పురుషులు కూడా వేస్తారు.

కోలాటానికి కావలసినవి

కోలాట ప్రక్రియకు, జట్టు, జట్టు నాయకుడు, ఆటగాడు, గరిడి, లుద్ది, కోపు, ఎత్తుగడ, ఉసెత్తు, ముక్తాయింపు అవసరం. ఇంతేగాక కోలాట కర్రలు, గజ్జెలు, అందెలు, కొరడా, వాయిద్యాలు, వెలుగునిచ్చే దీపములు కోలాటానికి పనికి వచ్చే వస్తువులు.

కోలాటం ఆడే ఆట గాళ్ళందరినీ కలిపి జట్టు అంటారు. జట్టు అంటే గుంపు లేక సమూహము అని అర్థం చెపుతారు. జట్టులోని ఆటగాళ్ళు జట్టుకు నాయకుడు ఒకడు వుంటారు.

జట్టులో సభ్యులు సరి సంఖ్యలోనే వుంటారు. బృంద సభ్యులందరూ గురువు చెప్పే మాటకు కట్టుబడి క్రమశిక్షణతో మెలగుతారు. జట్టు నాయకుణ్ణి కోలన్న పంతులనీ, పెన్నుద్ద అనీ, ముందు పాటగాడనీ, అయ్యవారనీ, మేళగాడనీ వివిధ పేర్లతో పిలుస్తారు.

కోలాటాల కర్రలు ఎలా ఉంటాయి

కోలాట కర్రలు మొదట సన్నగానూ, మద్యలో ఉబ్బెట్టుగానూ, చివర సన్నగానూ వుంటాయి. పట్టు కోవడానికి వీలుగా పిడి వుంటుంది. కర్రలను చేవ కలిగిన బిల్లుడు, చండ్ర, ఏపి, రేల, టేకు, ఏగెస మొదలైన జాతుల చెట్ల నుంచి కర్రలను ఎంచుకుంటారు. కోలాటపు చిరుతలను చక్కగా చత్రిక పడతారు. పిడివద్ద అందెలనూ, కోల చివర గజ్జెలనూ ఏర్పాటు చేస్తారు. కోలాటం చేశేటప్పుడు వీటి ధ్వని మధురంగా వుంటుంది. ఆటగాళ్ళందరు కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు.

కొన్ని ప్రాంతాల్లో జట్టు నాయకుడు కొరడాను భుజాన వేసుకుని ప్రదర్శనలో క్రమశిక్షణను పాటించని వారికీ, తప్పు చేసిన వారిపైకి కొరడా ఝళిపిస్తాడు. వారికి కొరడా పక్కలో బల్లెంగా వుంటుంది. ఒక్కొక్కసారి అందరినీ హెచ్చరించడానికి మధ్య మధ్యన చెళ్ళుమనిపిస్తాడు.

 

Read More : రుంజ వాయిద్యము

Leave A Reply

Your Email Id will not be published!