Telugu Festival Tradition : Kodi Pandalu –
సంప్రదాయమో వ్యసనమో కానీ కోడిపందేలనూ సంక్రాంతి పండ గనూ వీడదీసి చూడలేము. మన పల్లె సంస్కృతితో ఇంతగా పెన వేసుకు పోయిన ఈ సంప్రదాయానికి వందలు కాదు… వేల ఏళ్ల చరిత్ర ఉంది.
పల్నాటి యుద్ధంలో కోడి పందేల పాత్రను మర్చిపోలేం. బ్రహ్మ నాయుడి ‘చిట్టిమల్లు‘, నాగమ్మ ‘సివంగి‘ల పోరే చరిత్ర గతిని మార్చిన యుద్ధానికి కాహళమైంది! కోడిపుంజుకు పర్యాయమే ‘కాహళం‘.
15వ శతాబ్దపు సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కావ్యం అయ్యలరాజు నారాయణకవి ‘హంసవింశతి‘. అప్పట్లో కోడిపందేలు ఎలా జరిగేవో ఇందులో స్పష్టంగా వివరించాడు కవి. పందెంరాయుళ్లు కాషాయపు రంగు వస్త్రాలు ధరించి, చంకలో కోళ్లు పెట్టుకుని గరువు (బరి ప్రదేశం) దగ్గరికి చేరారు. దారాలు, నీళ్లముంతలు, కోళ్లకు గాయలైతే నయం చేయడానికి మూలికలు, ఆకుపసర్లు, కత్తుల పొది (కోడికత్తులను భద్రపరిచే గుడ్డ సంచి) వెంట తెచ్చుకున్నారు.
కోడిపుంజును యుద్ధానికి సన్నద్ధం చేస్తూ, దాని కాళ్లకు గుడ్డలు చుట్టారు. కత్తులు కట్టారు. రెండు వర్గాల వాళ్లూ తమ పుంజులను పొదివి పట్టుకుని, ఎదురెదురుగా నిల్చున్నారు. అంతే! ఆ పుంజులు కయ్యానికి ముక్కులుదువ్వాయి! .. ఈ విధంగా సాగుతుంది అయ్యలరాజు వర్ణన. కాషాయరంగు వస్త్రాలు తప్పితే ఇప్పటికీ బరుల దగ్గర ఇదే వాతావరణం కనిపిస్తుంది. పుంజు స్వభావం, పౌరుషాలను బట్టి ‘గరుడ, రణభేరి, కార్చిచ్చు, రాతిబొమ్మ, రామబాణం, మిత్తిరాహుతి, పిడుగు, హంవీరుడు, గండకత్తెర, జెట్టి, భైరవుడు, భేతాళుడు, సుడిగాలి‘ అంటూ తదితర పేర్లతో వాటిని పిలుచుకుంటూ ఉంటారు.
ఇంత చరిత్ర ఉన్న కోడిపందేలు సంక్రాంతితో ఎలా ముడిపడ్డాయి? పంటలు చేతికొచ్చే కాలం కాబట్టి కాసులకు కొదవుండదు. పందేలకు వెరపుండదు. ఇదే ప్రధాన కారణం కావచ్చు. అదే సాంప్రదాయంగా పరిణ మించి ఉండవచ్చు. అటు ఎద్దులకు పూజ చేసి, ఇటు పుంజుల ప్రాణాలతో ఆడుకోవడం మన సంస్కృతిలోని చీకటి వెలుగులకు ప్రతీకా అనుకోవచ్చు.