కాశీ కథలు చెప్పే కాశీ కావడి
Kashi Kathalu Cheppe Kashi Kavidi
Telugu Tradition : Kashi Kathalu Cheppe Kashi Kavidi
కాషాయ వస్త్రాలను ధరిం చిన వ్యక్తి కాశీ కావడి అంటూ ఒక కావడిని భుజాన వేసుకుని రెండు ప్రక్కలా పసుపు రంగు బట్టతో మూత గట్టిన బిందెలు గానీ రెండు బుట్టలను గానీ కావడి బద్దకు కట్టి, కావడిలో కాశీ విశ్వనాథుని విగ్రహాలను ఉంచి, వాటిని పసుపు కుంకాలతోనూ, పుష్పాలతోనూ అలంకరించుతాడు.
కాశీ కావడి ఎలా ఉంటుంది?
ఆ కావడి కొమ్ముకు మూడు గజాల చిత్ర పటాన్ని, ఒక ప్రక్క కావడి కొమ్ముకు తగిలించి, కాశీ విశ్వనాథుని సందర్శనాన్ని గురించి, వారు ప్రయాణించే దీర్ఘ ప్రయాణంలో దర్శించే క్షేత్రాలను గురించీ, కాశీ యాత్ర చేయాలంటే ఎంత కష్టమో ఈ కథ ద్వారా వినిపిస్తాడు. యాత్రికులు బయలు దేరిన దగ్గర నుంచీ, కాశీకి పోయే దారిలో, అడవుల్ని గురించి, ప్రకృతి వర్ణన గురించీ, క్రూర మృగాల ఆర్భాటాలూ, నదీ ప్రవాహాలూ, సత్రాలూ, దొంగల దోపిళ్ళూ, మజిలీలూ, ఇతర యాత్రా స్థలాలూ, పర్వతాలలో ప్రయాణం, చివరికి కాశీ విశ్వనాథుని సందర్శనం.
ఈ మధ్యలో వచ్చే బాధల్ని గురించీ, క్రూర మృగాల బారినుండి తప్పు కోవడం గురించీ, వరుస క్రమంలో కథను నడుపుతూ ఆ కథా సం విధానంలో అన్ని రసాలనూ చిత్రిస్తూ, చివరికి అన్ని కష్టాలనూ అధిగ మించి, కాశీ విశ్వేశ్వరాలయానికి చేరి ముక్తి పొందడంగా దీనిని జీవితానికి అన్వయించి, మనం స్వర్గానికి చేరుకోవడం ఎంత కష్టమో, ఈ కష్టాలను ఉదాహరణగా చెపుతాడు. కథకుడు ద్విపద నడకలో కథను బహు సుందరంగా నడుపుతాడు.
ప్రజల మధ్యలో పగటి వినోదం
ముఖ్యంగా ఈ కాశీ కావడి చిత్ర కథా విధానం, పగటి పూట ప్రజల మధ్యనే జరుగుతుంది. ఎక్కువగా ఉదయపు సమయాల్లోనే జరుగుతుంది. కథా కాలం కనీసం అరగంట సేపు ఉంటుంది. కాశీ కావడి, కాశీ కావడి అంటూ గంటలు మ్రోగించుకుంటూ నడి బజారులో కావడి దించి, కథకుడు కథను ప్రారంభిస్తాడు. పిల్లా జిల్లా ముందుగా వస్తారు. తరువాత పెద్దవాళ్ళు ఆ తరువాత స్త్రీలూ అందరూ కావడి చుట్టూ మూగుతారు. ఆ రోజుల్లో కాశీ క్షేత్రాన్ని సందర్శించడమంటే విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చినట్లే. ధనవంతులు తప్ప ఆ క్షేత్రాన్ని ఇతరులు దర్శించ లేక పోయేవారు. ఈ చిత్ర కథాకథనం ద్వారా, వారు కాశీ క్షేత్రాన్ని చూసినట్లే అనుభూతి చెందేవారు.
కథ విని అందరూ రస సిద్ధిని పొందేవారు. ఆధ్యాత్మిక చింతనతో, తృప్తి పొంది ఎవరికి తోచిన పారితోషికాలను వారు ముట్ట చెప్పేవారు. ఈ విధంగా కథకుని ఒడి నిండి మరో వీధికి బయలుదేరేవాడు. వీరి బొమ్మలన్నీ చీరల మీద వరుసగా చిత్రించబడి అతి సుందరంగా ఉంటాయి. అవి బందరు కలంకారీ బొమ్మల రంగుల్లో ఉంటాయి. బొమ్మల ద్వారా కథ చెప్పడం వల్ల చదువు రాని వయోజను లందరికీ ఈ కథా విధానం సుబోధకంగా ఉండేది. వీరు కేవలం కాశీ మహత్తునే కాక ఆయా రాజుల మతాల వారి దేవతల గురించి దేవుళ్ళను గురించీ కూడా కథలు చెపుతారు. ఆ నాడు ఈ చిత్ర కథా విధాన్నాన్ని కాశీ కావడి ద్వారా చెప్పేవారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పేవారు. వినే వారు కూడా అలాగే వినే వారు. అయితే రాను రాను ఈ కళారూపం భక్తినీ, ముక్తినీ ప్రబోధించే కంటే భుక్తికే ప్రాధాన్యమిచ్చి యాచక వృత్తిలో దించేశారు.
తెలుగువారి వస్తధారణ
ఆడవాళ్ల చీరకట్టు, మగవాళ్ల పంచకట్టు, ఊరికి మాటకట్టు – ఇది మన పూర్వీకుల సంస్కృతి గుట్టు అని నానుడి. పూర్వం ఆడపిల్లలు గౌను, పరికిణీ–జాకెట్, యువతులు లంగావోణీలు, మహిళలు పెళ్లయ్యాక చీరలు ధరించేవారు. అదే మగ పిల్లలయితే లాగుచొక్కా, నిక్కర్లు, కాస్త పెద్దయ్యాక అడ్డపంచ, ఆ తర్వాత గోచీ పోసి కట్టే పంచకట్టు, ధోతికట్టు ఉండేది. అయితే పాశ్చాత్య సంస్కృతులు పరిచయమయ్యాక ఈ వస్త్రధారణలో బోలెడు మార్పులు చోటుచేసు కున్నాయి.