కాళ్ళు కడగడం
Kallu Kadagadam
Telugu Marriage Tradition : kallu Kadagadam
వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా పెళ్లికొడుకు కాళ్లు కడగడానికి ఓ కారణముంది. అసలీ తంతు ఎలా జరుపుతారంటే ముందుగా కళ్యాణ వేదికపై వరుణ్ణి పడమటి ముఖంగా కూర్చో బెడతారు. కన్యాదాత తూర్పుముఖంగా కూర్చుంటాడు.
వరుణ్ణి శ్రీమహావిష్ణు స్వరూ పునిగా భావించి కన్యాదాత పూజించి సత్కరిస్తాడు. నీటిని అభిమంత్రించి మొదట కుడికాలు, తరువాత ఎడమ కాలును మామ కడుగుతాడు. “కుడికాలుని మహేంద్రుని అంశగానూ,
ఎడమ పాదాన్ని ఇంద్రుని అంశగా భావిస్తున్నాను. నీ పాదాలను రక్షించే దేవతలను పూజించిన ఈ జలం నా శత్రువులను కాల్చివేస్తుంది‘ అని మామ చెప్పినట్లుగా ఉండే మంత్రాలను పురోహితులు చదువుతారు. కాళ్లు కడిగిన నీళ్లను కన్యాదాత దంపతులు కొద్దిగా శిరస్సుపై చల్లుకోవడం ఆచారం. అర్హమిచ్చి, ఆచమనం చేయించిన తరువాత మధుపర్కం అందిస్తారు.
కన్యాదాతేమో వయసులో పెద్ద–వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్దమైన అర్థం వుండి తీరాలి. కన్యాదాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. “నాలోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక” అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యాదాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన “అర్ఘ్యాన్ని” (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు.
కన్యాదాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, “ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని–పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి” అని చెప్పి స్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలుపెట్టారు పురోహితులు. వధూవరులు సాక్షాత్తు “లక్ష్మీ–నారాయణ స్వరూపులు”గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే “లక్ష్మీ నారాయణుల కల్యాణం” లా జరిపించుతారు. “మహా సంకల్పం” చెప్పడం, సృష్టి క్రమంతో మొదలు పెట్టి, పరమేశ్వరుడి శక్తి–సామర్థ్యాలు అనంతమనిఅచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొన సాగింది. మానవుడి మేథస్సు ఊహించ నలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్న దైందని పురోహితుడంటాడు.
అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న–చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మాన వుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.
వరుడి కాళ్లు కడగడానికి తెలుగు పెళ్లిళ్లలో చాలా ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. పెళ్లి మండపంలోకి అడుగు పెట్టే ముందు వరుడి కాళ్లను వధువు అన్నదమ్ములు కడగి వివాహ వేదికపైకి ఆహ్వానిస్తారు. తమ సోదరితో జీవితం పంచుకోబోతోన్న బావగారికి కాళ్లు కడగడానికి బావ మరుదులు ఎగబడతారు. ఇలా చేయడాన్ని వాళ్లు తప్పుగానూ, తక్కు వగానూ భావించరు. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు, శ్రీమహాలక్ష్మిలకు కల్యాణం చేస్తున్నట్టుగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ క్రతువును వధువు తల్లిదండ్రులు చాలా సంతోషంగా పూర్తి చేస్తారు.