Telugu Tradition – Jatakarma : పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది. బిడ్డ ఆరోగ్యానికి ఉద్దేశించినది. శుచి శుభ్రతలు ఈ సంస్కారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
శిశువు పుట్టిన వెంటనే వర్ష, తిథి, మాస, నక్షత్ర, యోగ, కర్మ, లగ్న, భావ, స్థితి మొదలగు వాటిని అనుసరించి మరియు గ్రహదృష్టిని, విగ్రహ దృష్టిని, శిశువు దృష్టిని, తల్లిదండ్రుల దృష్టిని, పేషికాస్థితిని అనుసరించి శుద్ధి కొరకు శాంతి కొరకు భవిష్య భాగ్యోదయం కొరకు చేయునది జాతకర్మ.
శిశువు జన్మించిన వార్త వినగానే జాతక కర్మ చేయాలని ధర్మ శాస్త్ర వచనాలు చెబుతున్నాయి. అదికూడ బొడ్డుకోయుటకు ముందే జరగవలెనట. నాభిచ్చేధం తరువాత తండ్రికి జాతాశౌచం ప్రారంభమవు తుంది. కనుక అంతకుముందే జాతకకర్మ తండ్రి నిర్వహించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడ శిశువుకైన మగశిశువుకైన జన్మించిన వెంటనే జాతకకర్మ చేసే ఈ పద్ధతిలో తిధి వార నక్షత్రాలతో గాని ముహూర్త బలంతో గాని సంబంధం లేదన్న మాట. ఏ కారణం చేతనైన అప్పుడు జాతకర్మ కుదరకపోతే ఆ తరువాత చేయవలసినప్పుడు మాత్రం తిధి వార నక్షత్రాదులను చూసి ముహూర్తం నిర్ణయించవలెను.
జాతకర్మలో బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలలో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి. గర్భము నందు శిశువు చేయు గర్భ జల పాన దోషము తొలగుటకు ఈ సంస్కారము చేయుదురు.
మేథాజనన
బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలను ఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా తల్లిదండ్రులు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ఈ సంస్కారం ద్వారా మనకు తెలుస్తుంది.
ఈ సంస్కారంలో మొదట తండ్రి యవపు పిండి, బియ్యపు పిండి తరువాత బంగారముతో రుద్దబడిన తేనెను, నెయ్యిను అప్పుడే పుట్టిన బిడ్డ యొక్క నాలుకకు తాకించవలెను. ఈ సమయమున తండ్రి – “ఈ అన్నమే ప్రజ్ఞ, ఇదియే ఆయువు, ఇదియే అమృతము. ఇవన్నియు నీకు ప్రాప్తించును గాక. మిత్రావరుణులు, అశ్వినీ దేవతలు, బృహస్పతి నీకు మేధనొసగు గాక” అన్న అర్థము గల మంత్రము పఠించును. భూమిపైకి వచ్చెడి తరుణము నందు మిక్కిలి కష్టము గలుగుట వలనను, మహా మాయా మోహము ఆవరించుటవలనను శిశువు స్మృతి కోల్పోవును. అట్టి స్మృతిని తిరిగి కలిగించుటకే ఈ మేధాశక్తిని కలిగించే ప్రక్రియ చేయబడును. మొత్తం మీద ఈ జాతకర్మ వలన ఉపపాతకములు (తల్లిదండ్రుల శరీరముల నుండి ఆపాదించిన దోషములు) నశించి తీరును అని చెపుతారు.
బిడ్డపుట్టిన 36 గంటల లోపున బిడ్డతండ్రి బిడ్డ ముఖారవిందమును చూచును. అంతట నాతడు స్నానముచేసి వచ్చి బిడ్డను వడిలో కూర్చుండ బెట్టుకొని జాతకర్మ మొనర్చును. అప్పడే అతడు శిశువు దీర్ఘాయువునకై యోగ క్షేమములకై దానధర్మము లొనర్చును. ఈ సందర్భములో కొన్ని ఋగ్వేద మంత్రముల అతడు వల్లించును. ఆవిధముగా ఆ కాలపరిమితిలో అది జరుగనిచో పురుడు వెళ్లువరకు జరుగుటకు వీలులేదు. పురుడు మనదేశములో 10 రోజులు పట్టుదురు. 11వ రోజున బాలింత శుద్ధి స్నానమొనర్చును.