జంగం దేవరలు

Jangam Devara

Telugu Traditional Event : Jangam Devara –

తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర, జంగం దేవరల ఆహార్యంగా ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ, శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియ తిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు.


జంగాలు శైవ భిక్షగాళ్ళు. జంగాలలో మిండ జంగాలు, బుడిగె జంగాలు, గంట జంగాలు అనే ఉపకులాలున్నాయి. చేతిలో గంటనాదం చేస్తూ హర హర మహాదేవ శంభోశంకర అంటూ శంఖం ఊదుతూ ఇంటి ముందుకు వచ్చే జంగమయ్యలను చూసి సాక్షాత్తు భోళా శంకరుడే వచ్చినట్లుగా ఒకప్పుడు భక్త పారవశ్యంతో పరవశించేవారు. రామాయణ కాలంలో అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిని ఎత్తుకుపోవడానికి రావణుడు జంగందేవర వేషంలో వచ్చాడు కాబట్టే అతన్ని సీతాదేవి సాక్ష్యాత్తు శివుడే

తన పర్ణశాల ముందుకు వచ్చాడని భావించి లక్ష్మణరేఖను సైతం దాటి వచ్చింది. పూర్వకాలంలో జంగందేవర ఇంటి వద్దకు రాకపోతే మంచి చెడు కార్యక్రమాలను ఏవైనా సరే ఎక్కడివక్కడి ఆగిపోవాల్సిందే. సమాజంలో ఆదరణ కరువు కావడంతో తమ కులవృత్తి పట్ల వారికే ఆసక్తి సన్నగిల్లింది. చనిపోయిన వారికి కర్మలు చేయడం వీరి ప్రధాన వృత్తి. బ్రాహ్మణులకు తప్ప మిగిలిన అన్ని కులాలకు వీరు కర్మకాండలు చేస్తారు. కర్మ చేసే రోజు వీరు గంట మోగిస్తూ శంఖం ఊదుతూ వెళ్ళి బావి వద్ద గాని, చెరువు వద్దగానీ పిండాలు పెడతారు.

మిండ జంగాలు

వేశ్యా లోలురై వారి ఇండ్లలోనే విహరించిన కారణంగా వీరిని మిండ జంగములని వ్యవహరించే వారు.

గంట జంగాలు

గంట జంగాలు శైవ, వీర శైవ మతానికి చెందిన వీర ముష్టులూ, జంగాలూ, వారి వారి కళారూపాలే కాకుండా ఒంటరిగా జంగం దేవర వేషంలో ఇంటింటికీ తిరిగి యాచిస్తారు. బసవేశ్వరుడుగా వేషధారణను తీర్చి దిద్దు కుంటారు. వారిలో ఎంతో పూజ్యభావం గోచరిస్తుంది. పైనుంచి క్రిందికి అంగరఖాను తొడుగుతారు. తెల్లని తలగుడ్డనూ చుడతారు. మెడకు పొడవాటి అంగ వస్త్రాన్ని ధరింస్తారు. ముఖానికి గంభీరంగా విభూతి రేఖలను దిద్దుతారు.

గంట వాయిస్తూ, శంఖం పూరిస్తూ వచ్చే గంట జంగాన్ని సాక్షాత్తు బసవేశ్వరుడని ఊహించి ఇంట్లో వారంతా భిక్షను వేస్తారు. భిక్షను స్వీకరిస్తూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ విభూతి నిస్తారు. శంభో శంకర అంటూ, గంట చుట్టూ ఒక పుల్లను త్రిప్పుతూ ఓంకార నాదాన్నీ పలికిస్తారు. పిన్నలూ, పెద్దలూ అందరూ పూజ్య భావంతో విభూతిని స్వీకరిస్తారు. రకంగా గంట జంగాలు వీర శైవ మతాన్ని ప్రబోధించే ప్రచారకులుగా జీవిస్తూ ఊరూరా తిరుగుతూ వుంటారు.

బుడిగె జంగాలు

జంగం కథలు చెప్పే వారిని బుడిగె జంగాలని పిలు స్తారు. బుడికెను కంచుతోగానీ ఇత్తడితో గానీ తయారు చేస్తారు. గుమ్మె టకకు ఒక వైపున బెత్తపు చత్రాన్ని బిగించి, తోలుతో మూస్తారు. రెండప ప్రక్కన కూజామూతిలాగా, అనాచ్చాతీతంగా వుంటుంది. కథకునికి ఇరు ప్రక్కలా వున్న వంతగాళ్ళు ఒక్కొక్కరూ తమ గుమ్మెటను చంకకు తగిలించు కుంటారు.

కుడిచేతి వేళ్ళతో, చర్మము పైన వాయిస్తూ రెండవ ప్రక్క మూస్తూ గుంభనగా శబ్దాన్ని తెప్పిస్తారు. కథ చెప్పె బుడిగె జంగం నిలువుటంగీ తొడిగి, తలపాగా చుట్టి, కాళ్ళకు గజ్జెలు, మువ్వలు కట్టుకుని, భుజంమీద తంబురాను ధరించి, చేతి వ్రేలికి అందెలు తొడిగి, వాటిని తంబురాకు తట్టుతూ రెండవ చేతితో తంబురా తీగను మీటుతూ కథను ప్రారంబిస్తారు. కథకునికి వంతలుగా వున్న వారు గుమ్మెటలు ధరించి కథకునికి పంత పాడుతూ, పాట వరుస ననుసరించి గుమ్మెటలను వాయిస్తూ మధ్య మధ్య హాస్యగాడు చలోక్తులతో హాస్యాన్ని క్రుమ్మరిస్తూ, ప్రేక్షకుల్ని నవ్విస్తూ వారి మెప్పు పొందుతాడు.

 

Read More : హరికథ

Leave A Reply

Your Email Id will not be published!