Telugu Traditional Game : Gudu Gudu Gunjam –
బాలబాలికలు ఎంతో ఇష్టంగా ఆడుకునే ఆట. పిల్లలందరూ సాయంత్రంవేళ ఒక చోట కూర్చొని రెండు చేతుల పిడికిళ్ళు బిగించి ఒకరి పిడికిలి మీద మరొకరి పిడికిలి ఉంచాలి. ఆటలో పెద్దగా ఉండే ఒకరు పిడికిలిలో తన చూపుడు వ్రేలు ఉంచి ఆడిస్తూ ఈ విధంగా పాడుతుంది.
గుడు గుడు గుంజం గుండే రాగం పాముల పట్టుం పగడారాగం చిన్నన్న గుర్రం చిందులు తొక్కే పెద్దన్న గుర్రం పెండ్లికి పోయే నీ గుర్రం నీళ్ళకు పోయే నా గుర్రం పాలకు పోయే కత్తెయ్యనా– బద్దెయ్యనా,
రోలెయ్యనా-రోకలయ్యెనా
వేన్నీళ్ళు పొయ్యనా–చన్నీళ్ళు పొయ్యనా అని అడుగుతూ పైన పిడికిలిగల వారు ఆట పెద్ద అడిగిన దానికి తనకు ఇష్టమైన దానిని కోరాలి. ఉదాహరణకు కత్తెయ్యమని కోరినచో ఆట పెద్ద తన చూపుడు వ్రేలితో వారి పిడికిలి మీద కత్తితో నరికినట్లు కొట్టాలి. తరువాత వారు తన పిడికిలి ముద్దు పెట్టుకొని వెనుకకు దాచు కోవాలి. అందరూ ఈ విధంగా చేసిన తరువాత ఆట పెద్ద వారందరినీ మీ చేతులు ఏమైపోయాయి అని అడుగు తుంది. పిల్లెత్తుకొని పోయాయని వారందరూ చెప్తారు. పిల్లని ఎందాక తరిమారి అని అడిగిన దానికి కొండపల్లి దాకా తరమామని వారు చెబుతారు. తరువాత ఆట పెద్ద పిల్లలందరికి చక్కిలిగింత పెడుతుంది.
ఉత్తరాంధ్రలో ఇదే ఆట కాస్త భిన్నంగా సాగుతుంది. ఇక్కడ పాట అనంతరం ఆట వస్తుంది. పాట కూడా కాస్త మారుతుంది.
గుడుగుడు గుంచం, గుండే రాగం, పాముల పట్నం, పటికా బెల్లం, తాతా తాతా నీ పెళ్లెప్పుడూ… రేపు గాక ఎల్లుండి. పెదనాన్న గుర్రం పెళ్లికి పోయె, చిన్నాన్న గుర్రం చుట్టికి పోయె, నా చేతులేమో పిల్లెత్తుకు పోయే అంటూ అందరూ చేతుల్ని వెనక్కి పెట్టేసుకుంటారు. తరువాత కొన్ని ప్రశ్నలుంటాయి. మొదటి పిల్లాడితో అవి మొదలవుతాయి. ఆ ప్రశ్నలు… వాటికి ఆ పిల్లలిచ్చే సమాధానాలు…
నీ చేతులేవి – పిల్లెత్తుకుపోయింది గోల్కొండేమిచ్చింది – గవ్విచ్చింది గవ్వేంచేసావ్ – గోతిలో కప్పెట్టాను గొయ్యేమిచ్చింది – గట్టిచ్చింది గడేం చేశావ్ – ఆవుకి వేశాను ఆవేమిచ్చింది – పాలిచ్చింది పాలేంచేశావ్ – అమ్మకిచ్చాను అమ్మేమిచ్చింది – జున్నిచ్చింది. జున్నేం చేశావ్ – నాన్న కిచ్చాను నాన్నేమిచ్చారు – రూపాయిచ్చారు పంతులేం చేశారు – చదువూ చెప్పే చదివేం చేశావ్ – మామాకిచ్చే మామేమిచ్చాడు – పిల్లానిచ్చే… – – – –
పిల్లినెక్కడి వరకూ తరిమావ్ – గోల్కొండ వరకూ
రూపాయేం చేశావ్ – పంతులుగారికిచ్చా –
పిల్లా పేరు మల్లే మొగ్గా, నాపేర్ జమిందార్ చివరి సమాధానం పూర్తవడంతో ఆ కుర్రాడు పరిగెత్తుతాడు. అతణ్ని పట్టుకోవడానికి మిగిలిన వాళ్లు వెంటపడతారు. ఎవరైతే పట్టుకుంటారో వాళ్లే విజేత.