గొబ్బెమ్మల కొలువు వేడుక
Gobbemmala Koluvu Veduka
Telugu Festival Tradition : Gobbemmala Koluvu Veduka
ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటి ముందూ ఆడ పిల్లలు రక రకాలుగా రంగ వల్లులను తీర్చి దిద్ది వాటి మీద ఈ గొబ్బెమ్మలను ఉంచుతారు. వాటిని పసుపు, కుంకుమ లతో పూలతో అలంకరిస్తారు. వీటిని గొబ్బెమ్మలని, గురుగులను గొబ్బియ్యల్లనీ ఆయా ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు.
సంక్రాంతి సమయంలో బజారులన్నీ గొబ్బెమ్మలతో కళకళలాడుతూ పుంటాయి. సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆడ పిల్లలకి ఎక్కడ లేని ఆనందం. పంట పొలాలనుండి పంటలు ఇంటికి వచ్చి ధాన్య రాసులతో ఇళ్ళు కళకళ లాడుతూ ఉంటాయి. పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న రైతు బిడ్డలు ఆనందోత్సాహాలతో ఈ పండగను జరుపుకుంటారు. ముద్దు లొలికే ముగ్గులతో ఇళ్ళనన్నిటినీ శోభాయ మానంగా తీర్చి దిద్దుతారు.
గొబ్బి గౌరి వ్రతం
కొన్ని ప్రాంతాలలో గొబ్బి గౌరి వ్రతం చేస్తారు. వివిధ కోర్కెలు తీర్చమని పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. శ్రీ కృష్ణుని చుట్టూ చేరి గోపెమ్మలు ఆడినట్లు.. ఆ గొబ్బెమ్మల చుట్టూ చేరి కన్నెపిల్లలు ఆడటం సంక్రాంతి సంప్రదాయం. ఈ గొబ్బెల చుట్టూ ఆడేటప్పుడు అద్భుతమైన పాటలను కూడా పాడుకుంటూ ఉంటారు అమ్మాయిలు.
నాభుడు బాబాయ్ డివంటలు
సుబ్బీ గొబ్బెమ్మా సుఖములియ్యవే చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే
మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే
అంటూ చక్కని కుటుంబసౌఖ్యాన్ని, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిం చమని గొబ్బిదేవతను వేడుకొంటారు.
తల్లిగొబ్బి పిల్లగొబ్బి
గొబ్బి అంటే గోపికాదేవి. తల్లిగొబ్బి, పిల్లగొబ్బి అని రెండు రకాలు. తల్లిగొబ్బికి అయిదు గొబ్బెమ్మలు, పిల్ల గొబ్బికి మూడు గొబ్బెమ్మలు ఉంచుతారు. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూల రేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందే గొబ్బెమ్మ అంటారు.
ఆవుపేడతో గొబ్బెమ్మలు
ఆడపిల్లలు ఆవు పేడను తీసుకు వచ్చి వాటిని గుండ్రంగా చేసి గొబ్బెమ్మను తయారు చేస్తారు. పై భాగాన గురుగు చేసి అందులో గుమ్మడి పువ్వులను గుచ్చుతారు. వాటిని తీసుకు వెళ్ళి ముగ్గుల మధ్య వరుస క్రమంలో సుందరంగా అమర్చుతారు. వాటికి నైవేద్యంగా పండ్లను ఉంచుతారు. తరువాత రంగు రంగుల దుస్తులు ధరించిన ఆడపిల్లలు, అనందంగా అందరూ వలయాకారంగా నిలిచి, చప్పట్లు చరుస్తూ పాట పాడుతూ, పాటకు తగినట్లు అడుగులు వేస్తూ, పాట గమనాన్ని బట్టి వేగాన్ని పెంచుతూ గొబ్బి పాటలను వీనుల విందుగా పాడుతూ, తమ భక్తి శ్రద్ధలను వెల్లడిస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందూ గొబ్బి పాటలు పాడుతూ ఉంటే, బజారంతా శోభాయమానంగా ఉంటుంది. అన్నమయ్య లాంటి వాగ్గేయకారులందరూ గొబ్బి పదాలను రచించారంటే వాటి ప్రాముఖ్యాన్ని మనం గమనించవచ్చును
గొబ్బియళ్ళో, గొబ్బి యని పాడారమ్మ కంచి వరద రాజునే గొబ్బియళ్ళో
గొబ్బియ్యళ్ళో అంచు లంచుల అరుగుల మీద
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో.. అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలు అనేకం ఉన్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకు ఈనాడు అంత ప్రాముఖ్యత లేక పోయినా ఆనాడు అవి ప్రజలను ఎంతగానో అలరించాయి. ఆ నాటి గొబ్బి ఆట పాటల్లో, నృత్యాలలో నాటి ఆడ పిల్లలు ఓలలాడారు అనటంలో అతిశయోక్తి లేదు.