Telugu Dance Tradition : Ghussadi Dance
ఆదిలాబాదు జిల్లాలో గోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. ఈ గుస్సాడి నృత్యం గిరిజన (గోండులు) తెగల సాంప్రదాయ నృత్యం. ఆదిలాబాద్ జిల్లాలోని రాజగోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను దండారి సమూహాలు అంటారు. ఇందులోని చిన్నచిన్న సమూహాలను గుస్సాడీ అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన, జింక కొమ్ములున్న తలపాగా, కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. కాషాయ పసుపు వస్త్రాలను ధరిస్తారు. కాళ్ళకు, నడుముకు గజ్జెలు కట్టుకుంటారు. చేతిలో దండాన్ని ధరిస్తారు. ఒంటి పై విభూతి, పూలదండలతో ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. ఈ నృత్యంలో ఉపయోగించే వాయిద్యాలు డప్పు, తుడుము, పిప్రి, కొలికమ్ము. నృత్యం అయిపోయిన తర్వాత వీరి కాళ్లు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యంలోని ప్రత్యేకత. మరో ప్రత్యేకత ఏమంటే పురుషులు మాత్రమే గుస్సాడి నృత్యం చేస్తారు.
గుస్సాడి నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు
గుస్సాడి పండుగ దీపావళి పండుగకు 1 వారం లేదా 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ప్రారంభ రోజును “భోగి” అని పిలుస్తారు. ముగింపు రోజును “కోలబోడి” అని పిలుస్తారు.
గుస్సాడీలు రంగురంగుల దుస్తులను ధరించి ఆభరణాలతో అలంకరించుకుంటారు. వారు బృందాలతో పాడుతూ, నృత్యాలు చేస్తూ పొరుగు గ్రామాలకు వెళతారు.
ఇటువంటి బృందాలను “దండారి” అంటారు. ప్రతి బృందంలో నలభై మందికి పైగా సభ్యులు ఉంటారు. ‘గుసాడి‘ దండారిలో ఒక భాగం. డప్పు, తుడుము, వెట్టే, డోల్కి పెమే, కాలికోంలు వారి సంగీత వాయిద్యాలు.
విచిత్రమైన గుస్సాడీ అలంకరణ
గుస్సాడీ అలంకరణ విచిత్రంగా ఉంటుంది. మొత్తం శరీరమంత బూడిద, లేతసున్నం పూసుకొని ఒక చిన్న నిక్కరు మాత్రమే ధరిస్తారు. మొహానికి సున్నం లేదా మసిపూసుకొని ఎడమ భుజంపై మేక లేదా జింక చర్మాన్ని ధరిస్తారు.
చేతిలో రోకలి ఉంటుంది. గుస్సాడీ నృత్యం చేసే వారిని దేవతలు ఆవహిస్తారని వారి నమ్మకం. గుస్సాడీ నృత్యకారులు అప్పుడప్పుడు . తమ మంత్రశక్తులను కూడా ప్రదర్శిస్తారని గోండులు నమ్ముతారు.
కాగితం కింద మంట పెట్టి కాగితం కాలకుండా కాగితంపై జొన్నలు పోసి వాటిని పేలాలుగా మార్చడం, గాజు ముక్కలను కరకర నమలడం వంటివి చేస్తుంటారు.