Telugu Marriage Traditions – Garbhadhana : షోడశ కర్మలలో మొదటిది, జీవి ఆవిర్భావానికి ముందే జరుపబడు ముఖ్యమైన సంస్కారం గర్భాదానం. గర్భాదానం వలన పిండోత్పత్తి జరిగి జీవి ఆవిర్భావానికి దోహదం చేస్తుంది. స్త్రీ పురుష (భార్యాభర్తలు) తొలి సమాగమ సందర్భములో మంచిబిడ్డని ఆశించి ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ సందర్భములో చదివే మంత్రాలు కూడా సత్సంతానాన్ని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.
దీనినే వాడుక భాషలో ఫనైట్ లేదా తొలిరాత్రిగా లేదా శోభనము అని అభివర్ణిస్తారు. గర్భాదాన క్రియనే వాస్తవిక వివాహమని కొందరు అందురు. కొన్ని ప్రాంతాలలో దీనిని బట్ట లిచ్చుట, గృహప్రవేశము చేయించుట, బర్దనము అని కూడా అంటారు.
ఈ కార్యక్రమము సామాన్యముగా వధువు ఇంట జరుగుట మన సంప్రదాయముగా వచ్చుచున్నది. మంచమును మల్లెపూలు, గులాబి, సంపెంగలతో అలంకరించాలి. మంచము మీద కొత్త దుప్పటి వేయాలి. 200 మూరల పూలతో అలంకరణ చక్కగా చేయాలి. గదిలో టేబులు మీద వస్త్రము వేసి, చిన్న పళ్ళెములలో 10 రకాల స్వీట్లు, రెండు కిళ్ళీలు పెట్టాలి. అత్తగారి వాళ్ళు ఐదు లేక తొమ్మిది పళ్ళెములలో స్వీట్స్, హాట్స్ తీసుకువస్తారు. అమ్మాయికి పసుపు కుంకుమ, స్వీటు, హాటు, ఆకులు, వక్కలు, కొబ్బరి బోండాలు, పూలు, పండ్లు, అరిశెలు, బిస్కెట్లు అందజేయాలి. వెండిగ్లాసుతో పాలు పెట్టాలి.
పాలు తప్పక ఇద్దరూ కలసి తాగవలెను. అమ్మాయికి తెలుపు చీర అత్తగారు పెండ్లికుమారునికి తెలుపు పంచెలు మామగారు ఇవ్వవలెను. దంపతులకు రాత్రికి భోజనము పెట్టిన తరువాత రూములో ఎదురు ఎదురుగా మంచము మీద కూర్చుండబెట్టి పాన్పువేసి సముహూర్తము వరకు చెండాట ఆడించాలి. తరువాత వారిచేత దంపతులకు తాంబూ లాలు ఇప్పించాలి. ఈ తాంబూలము అమ్మాయి వాళ్ళ జాకెట్టు వస్త్రము, తమలపాకులు, పండ్లు, వక్క కొబ్బరి బోండాలు, దక్షిణ, కొత్త దంపతుల చేత పాత దంపతులకు ఇప్పించవలెను. 5 లేక 9 మంది దంపతులకు ఈ విధంగా ఇప్పించవలెను. హారతి వెలిగించి వారి కళ్ళకు అద్ది పేర్లు చెప్పించి పురోహితుడు సూచించిన ముహూర్తమునకు నూతన దంపతు లను గదిలో ఉంచి అందరూ గదినుండి బయటకు రావాలి.
ఋణ విముక్తి కొరకు
సుసంతాన్ని పొందటం ద్వారా సమాజానికి తమ వంతు సేవ చేయటా నికి, తాము తమకున్న మూడు రకాల ఋణాలను (దేవఋణం, ఋషి ఋణం, పితృణం) తీర్చుకోవడానికి దంపతులు ఉమ్మడిగా చేసే సంస్కారం ఇది. సుసంతాన ప్రాప్తికోసం గర్భాదాన సంస్కారం నియ మితమైన మంచి రోజున జరగటం వల్ల దైవబలం కలిసి వస్తుందని భావన.
దేవతలమని భావన
తల్లిదండ్రుల చిత్త వృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన శిశువే జన్మిస్తారు అని నమ్మకము. కావున తల్లిదండ్రులు గర్భాదాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజా పతి యొక్క అంశ గలవాడని, పత్ని వసుమతి రూపమని తలచి దేవతా చింతనము చేయుచు గర్భాదానము చేయవలెను అని శాస్త్రాలు చెబు తున్నాయి.
సంతానము మాత పితల యొక్క ఆత్మ, హృదయము, శరీరము నుండి జనించుచున్నది గదా! అందువలన తల్లిదండ్రుల దేహము (స్థూల,
సూక్ష్మ) లోని దోషములు బిడ్డకు సంక్రమించును. ఈ దోషము సంక్ర మించకుండా ఇందుకు అనువైన కాలమును నిర్ణయించుకొని సంతాన కాల మందు మనస్సు, శరీరమునందుగల పశుభావనను తొలగిం చుకొని సాత్త్వికమగు దైవ భావము కలిగియుండుట కొరకే ఈ గర్భాధాన సంస్కా రము విధింపబడింది.
గర్భాదానమునకు తగిన శుభ కాలము
శుభ నక్షత్రములు:శ్రవణము ,రోహిణి ,అనూరాధ, స్వాతి, రేవతి, మూల, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, శతబిషము, ఇవి మిక్కిలి శ్రేష్టము. పుష్యమి, ధనిష్ఠ ,మృగశిర, అశ్వని ,చిత్త,పునర్వసు, ఇవి మధ్యరకము. తిధులు : 2, 3,5 ,10.
వారములు : సోమ, బుధ, గురువారములు. .
సంధ్యా పర్వత ప్రదోవ్రత శ్రాద్ధ రోజులు మంచివికావు. శుభ లగ్నములు : వృషభ, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మీన లగ్నములు. లగ్న శుద్ధి అష్టమ శుద్ధి తప్పనిసరి.
పంచపర్వములు, సంధ్యాసమయము, శ్రాద్ధ దినములు పనికిరావు విప్రులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అను నాలుగు వర్ణములలో మొదటి ముగ్గురికీ ద్విజులు అని పేరు, ద్విజులకు గర్భాధానాది సంస్కార ములను సమంత్రకముగా చేయవలెను అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.