Telugu Dance Tradition : Garaga Dance
ప్రాచీన జానపద నృత్యాలలో ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్న నృత్యం గరగ నృత్యం. గరగలు అనే అమ్మవారి రూపాలతో ఉన్న వాటిని తలపై మోస్తూ చేసే నృత్యాలనే గరగ నృత్యాలు అంటారు. దీన్నే ఘట నృత్యం అని కూడా అంటారు. దీని ప్రాముఖ్యం ఆంధ్ర దేశంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో హెచ్చుగా కనిపిస్తుంది.
గరగ ఎలా ఉంటుంది?
గరగ శిల్పాన్ని శివపార్వతుల కలయికగా, అర్ధనారీశ్వర స్వరూపంగా వర్ణిస్తారు. గుండ్రంగా ఉన్న పై భాగంలో చిన్న పళ్ళెం (తబుకు) ఉంటుంది. దానిపై గోపురం ఆకారంలో ఉండే రేకును బిగిస్తారు. ఇది పానవట్టాన్ని పోలి ఉంటుంది. దానికి రక్షణగా పైభాగంలో సర్ప ఆకారంలో ఆదిశేషువును అమర్చుతారు.
అమ్మ విగ్రహాన్ని అలంకరించి నట్లుగానే, చీర, గాజులు, పసుపు కుంకుమలతో ఈ గరగలను కూడా అలంకరించి, ఒక పూజ్యభావాన్ని కలిగింప చేస్తారు. గర్భగుడిలోని అమ్మవారి మూల విరాట్టుకు ప్రతి రూపంగా ఈ గరగలను మాత్రమే బయటకు తెచ్చి తీర్థ జాతరలలో వినియోగించడం, ఈ గరగ దర్శనంతో అమ్మవారి దర్శన భాగ్యం కలిగినట్లు భావించడం ఒక నిత్య సత్యమైంది.
గరగనృత్యాన్ని ఎలా చేస్తారు
నెత్తిపైన కుండ వుంచుకుని ప్రారంభమయ్యే ఈ నృత్యం, నాగరికత కనుగుణంగా కొన్ని మార్పులకు లోనైంది. ఈ గరగలనేవి లోహ నిర్మితమై, వాటి పై ఆదిశేషువు ఆదిగాగల చెక్కడపు బొమ్మలతో అలరారుతూ వుంటాయి. గరగ ఆకారం ఒక పూర్ణకుంభం మాదిరిగా వుంటుంది.
ఈ గరగలను గ్రామ దేవతలని వివిధ పేర్లతో పిలువబడే అమ్మవారి గుళ్ళలో పదిలపర్చబడి అమ్మ వారితో పాటు పూజార్హమై, జాతర సమయాలలో నెలకు ముందు నుండే గర్భగుడి నుండి బయటకు తీసుకవచ్చి ఆసాదులనబడేవారు,
ధూప సేవతో నెత్తిపై పెట్టుకుని డప్పుల వాయిద్యంతో లయ బద్ధంగా నృత్యం చేస్తూ, అవేశ పూరితంగా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమని మ్రోగుతుండగా అమ్మవారిని తన్మయత్వం చేస్తూ, చూపరులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ, తెల్లవార్లూ ఈ నృత్య కార్యక్రమాన్ని అత్యంత నిష్టతో నిర్వహించటం ఒక విశేషం.
ఆ తరువాత అమ్మవారి విగ్రహం దగ్గరకు గరగలను గర్భడుడికి చేర్చుతారు. మరికొన్ని చోట్ల ఈ గరగ నృత్యం చేసే ఆసాది వారి నిష్టకు నిదర్శనమా అన్నట్లు కణకణ మండే చింత నిప్పులపై నడుస్తూ నాట్య మాడటం కూడా గమనించవలసిన విశేషం.
ఆసాదులు అంటే ఎవరు?
గరగ నృత్యాన్ని వృత్తిగా స్వీకరించి, ఈ నృత్యానికే అంకితమైన వారిని ఆసాదులంటారు. గర్భగుడి నుండి బయటకు తీసుకు వచ్చిన గరగలు ఆసాదుల శిరములనలంకరించి లయబద్ధమైన డప్పుల వాయి ద్యాల మధ్య తాళాని కనుగుణ్యమైన నృత్యంతో పురవీధులలో ఊరేగుతూ తమతమ ప్రదేశాలకు రాగానే ఆసాదుల కాళ్ళకు బిందెడు నీళ్ళు అభిషేకంతో, ఫలవుష్పాలతో పాటు,
చీరలూ గాజులూ, పసుపు కుంకు మలను సమర్పించుకుని అమ్మవారి సేవకు భక్తులు అంకితమౌతారు. వివిధ పేర్లతో గరగ నృత్యం ఆంధ్ర దేశంలోనూ, రాయలసీమలోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ, తమిళంలో కరగం అనే పేరు తోనూ, ఇతర ఆంధ్ర ప్రాంతాలలో గరికె, గరిక, గరిగ, గరిగె అనే పేర్లతోనూ ఈ నృత్యం ప్రచారంలో వుంది.
ఈ గరగ నృత్యాన్ని నృత్యకారులెంత నేర్పుగా ప్రదర్శిస్తారో ఆ నేర్పుకు తగిన లయబద్ధ వాద్య సహకారం డప్పులు వాయించే వారు అందిస్తూ వుంటారు.
ఈ రెండు సమిష్టి కలయికలతోనూ ఈ గరగ నృత్యం ఎంతగానో శోభిల్లుతుంది. ఈ గరగలను సేవించడం ద్వారా ఆమ్మవారిని సేవించినట్లే భావింప బడుతుంది.
గరిక అంటే కుండ అని అర్థం. ద్రౌపది తన వివాహ సమయంలో అనందావేశంతో ప్రక్కనున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందనీ కొందరు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ గరగ నృత్యాన్ని తమిళనాడులో స్త్రీలు కూడా చేస్తారు.