గంగిరెద్దులాట

Gangireddu Melam

Telugu Festival Tradition : Gangireddu Melam –

గంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం. ఇది ప్రాచీన మైనది. ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. గంగిరెద్దుల ఆటకు మూలం పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు.

అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది.

అప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నంది కేశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యా లైన డోలు, సన్నాయి, బూర, సుత్తి లను ధరింప చేసి, తాను మేళానికి నాయకత్వం వహించిగజాసురుని చెవుల బడి తన సమక్షంలో ఆటను ప్రదర్శించమని కోరుతాడట. అందుకోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట.

గజాసురుడు ఆనంద భరితుడై ఏం కావాలో కోరుకోమంటాడట. తన పాచిక పారిందనుకున్న హరిఇది శివుని వాహనమైన నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది. స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారియైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి, తన శిరస్సును త్రిలోక పూజ్యంగా చేయమని వరమడిగి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట.

అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజ లందుకుంటుం దనీ, అతని చర్మాన్ని తాను ధరిస్తానని చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని

గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా యివ్వడం జరుగుతుంది. (గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు) అప్పటి నుండి గంగిరెద్దులను తిప్పుకొని బ్రతుకు తున్నట్లు పెద్దలు చెప్తారు.

గంగిరెద్దులవారు పాడేపాటలు

వీరు ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట, రాములవారి పాట, ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట, వీర గున్నమ్మ పాట (మందస ప్రాంతంలో), మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీ కట్టి పాడతారు. సినిమా పాటలు కూడా పాడతారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా గంగిరెద్దుల వారున్నారు. అయినా వీరంతా తెలుగువారే. మహారాష్ట్రలో వీరిని నందివాలా అంటారు.

గంగిరెద్దులవారి జీవనశైలి

గంగిరెద్దుల మేళాల వారు, రెండు మూడు కుటుంబాలు కలిసి అయిదారు అందమైన బలిసిన గంగిరెద్దులతో దండుగా బయలు దేరి ఆంధ్ర దేశంలో మూల నుంచి మూల వరకూ మకాంలు వేస్తూ జీవ యాత్రలు చేసే వారు. ఒకప్పుడు రాజులూ జమీందారులూ వారి వారి ప్రాంగణాలలో గంగి రెద్దులాటను ఏర్పాటు చేసుకుని వినోదించే వారు. గంగిరెద్దుల వారు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తెలుగు భాషనే మాట్లాడుతారు. వీరికి ఒక వూరనేది లేదు. సంచార జీవులైన వీరు పర్వ దినాలలోనూ, ముఖ్యంగా రైతులకు పంటలన్నీ చేతికి వచ్చి పని పాటలు లేని సమయాల్లోనూ, సంక్రాంతి పండుగ దినాలలోనూ ఊర్ల వెంట బయలు దేరుతారు. గతంలో గంగిరెద్దుల కులస్థులలో మగవారు గంగిరెద్దు పట్టుకొని ఊరంతా తిరిగితే ఆడవారు గ్రామాలలో కరక్కాయలు, దగ్గుమందులు, గిలకలు అమ్మేవారు. నేడు పరిస్థితులు మారటంతో ఆడవారు ఫ్యాన్సీ సామానులైన బొట్లు, కాటుకలు, తిలకాలు, అద్దాలు, పైనలు (దువ్వెనలు) ఊరూరా అమ్ముకుని వస్తున్నారు

ఆధునికత సంతరించక ముందు ప్రజలు గంగిరెద్దుల వారిని ఆదరించి బట్టలు, భత్యం, డబ్బులు యిచ్చి చనిపోయిన తాత తండ్రుల పేరు మీద పొగిడించేవారు. గ్రామాలలో వివిధ ప్రదేశాలలో గంగిరెద్దు విన్యాసాలు చేయించేవారు.

గంగిరెద్దుల అలంకరణ

వీరు గంగిరెద్దుల్ని స్వంత బిడ్డల్లా చూస్తారు. వాటిని ఎన్నో రకాలుగా అలంకారిస్తారు. మూపురం వద్ద నుండి తోక వరకూ ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతను కప్పుతారు. రింగులతో కొమ్ములను అలంకరిస్తారు. కొమ్ము చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడిగి చివరన రంగు రంగుల ఊలు దారాల కుచ్చులను కట్టతారు. వీటినే కుప్పెలు అని అంటారు. మూతికి తోలుతో కుట్టబడిన మూజంబరంను కడతారు. నొసటి భాగాన అందమైన తోలు కుచ్చులను కడతారు. అందమైన గవ్వలను కూడా కడతారు. మూపురాన్ని రంగు పంచెతో అలంకరించి ఒక దండను దిగ వేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును, గవ్వల హారాన్ని కడతారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. ఇంటి యజమానులు చీరలు, దుప్పట్లు వంటి బట్టలను ఇస్తారు. వాటిని గంగిరెద్దు వీపు మీద వేస్తుంటారు. అప్పుడు చూడాలి బసవన్నల అందం. సాక్షాత్తూ నందికేశ్వరుని పోలి వుంటుంది. గంగిరెద్దులవారి వేషం

గంగి రెద్దుల వారి హంగులు, శ్రుతి సన్నాయి బూర, డోలు, చేతిలో కంచుతో చేయబడిన చిన్న చేగంట, వేషధారణలో నెత్తికి రంగుల తలగుడ్డ మూతిమీద కోర మీసాలు, చెవులకు కమ్మల జోడు, వారు వీరు ఇచ్చిన పాత కోటు, భుజంమీద కండువా, చేతికి వెండి మురుగులు, నుదురున పంగనామంతో సైకిల్ పంచ కట్టు కట్టి ఆకర్షణీయంగా తయారౌతారు. గంగిరెద్దుల వారికి ప్రతి వూరిలోనూ మధ్యనున్న పెద్ద బజారే వారికి రంగస్థలం. ముందుగా గ్రామంలో ప్రవేశించి, గ్రామ పెద్దల నాశ్రయించి వారి అనుమతితో ప్రదర్శనం ఏర్పాటు చేసుకుంటారు. వారి వాయిద్యాలాతో రణగొణ ధ్వనులు చేసి ప్రజలను రప్పిస్తారు.

ఎద్దుల్ని బాగా అలంకరించి, కొన్ని విన్యాసాలు సాధన చేయించి ఆటను ఆడిస్తారు. రెండు ఎద్దులు రామలక్ష్మణుల్లాగా, ఒక ఆవు సీతలాగా ఒక్కొక్కరు ఉండి ఆడిస్తారు. గంగిరెద్దులాటలు మేళం, డోలు, గరుడ స్థంభం ఉంటాయి. మనిషిపై ఎద్దును ఎక్కించుకోవడం, మనిషి చెప్పినట్లు ఎద్దు ఆటలాడడం ప్రత్యేకం. చివరకు సీతారాముల పెళ్ళి జరగడం (ఎద్దుఆవు) ఆట ముగుస్తుంది.

 

Read More : బుట్టబొమ్మలు

Leave A Reply

Your Email Id will not be published!