Marriage Tradition : Florist celebration – పెండ్లి అయిన తరువాత పెండ్లి కూతురు పెండ్లి కుమారుడు, భోజ నము చేసిన తరువాత నేలమీద దుప్పటి పరచి ఇద్దరినీ ఎదురు ఎదురుగా కూర్చోబెట్టాలి. పెండ్లి కుమారుడు తూర్పు ముఖం పెట్టి కూర్చోవాలి. ముందుగా పూలమాల బంతివలె ఉండ చుట్టినట్లుగా చుట్టి చేండ్లాట ఆడించాలి. బంగారు గొలుసుతో ఆడించాలి. తరువాత సరిబేసి సంఖ్యల ఆట ఆడించాలి. 2, 4, 6, 8, 10, 12 ఇవి సరి సంఖ్యలు. 1, 3, 5, 7, 9, 11 ఇవి బేసి సంఖ్యలు. రూపాయి బిళ్ళలు కాని, వక్కలుగాని ఇద్దరికి 54 చొప్పున ఇవ్వాలి. అబ్బాయి కొన్నింటిరి గుప్పిటలో పట్టుకుని సరియా, బేసియా అని అడిగినప్పుడు అమ్మాయి సరైన సమాధానం చెప్పిన అవి అమ్మాయికి వచ్చును. లేనిచో ఎన్ని ఉంటే అన్ని అమ్మాయి అబ్బాయికి ఇచ్చుకోవాలి. ఖాళీ చేయి పెట్టినచో పుట్టి అందురు, దానికి 30 చొప్పున ఇచ్చుకోవాలి. అబ్బాయి అమ్మాయికి ఎడమచేతితో బొట్టు పెట్టవలెను. అమ్మాయిచేత అబ్బాయికి కుడిచేతితో బొట్టు పెట్టించాలి. అబ్బాయిచేత అమ్మాయికి గంధము పూయించాలి. అమ్మాయిచేత అబ్బా యికి చేతులకు గంధము పూయించాలి. పన్నీరుకాని ప్రేకాని ఒకరిపై ఒకరికి చల్లించాలి. ఒక అరటిపండు వలచి అబ్బాయి కొంత తినిన తరువాత మిగతా దానిని అమ్మాయిచేత తినిపించాలి.
ఈ వేడుక చాలా సరదాగా ఉండి నూతన దంపతులకు ఇద్దరి మధ్య బిడియం పోయి సరదాగా ఉంటారు. ఐదుగురు దంపతులకు తాంబూలము అందించవలెను. రెండు పండ్లు, ఆకులు, వక్కలు దక్షిణ పెట్టి కొత్త దంపతులచేత తాంబూలం ఇప్పించవలెను. ఇక్కడ పాన్పుపై పరిచిన దుప్పటి ఆడ పడుచుకు చెందుతుంది. తన పుట్టింటిలోనికి మరొక ప్రవేశించడం వలన తన గుర్తింపు తగ్గిపోతుంది, సోదరుడు తనకు దూరమౌతున్నాడని అను కోకుండా ఆడపడుచులకు అనేక సందర్భాలలో ప్రాముఖ్యం ఇవ్వటం తెలుగువారి పెండ్లి సంప్రదాయాలలో వేడుకగా, వాడుకగా వస్తుంది.