ముఖాలు కలిగించు వేడుక
Face Wash Ceremony
Telugu Marriage Tradition : Face wash ceremony –
ఈ వేడుక చూచేవారికి వేడుక జరిపించేవారికి చాలా సరదాగా ఉంటుంది. పెండ్లి కూతురు తల్లి, పెండ్లికొడుకు తల్లిని వారి బంధువులను ముందుగా కుర్చీలలో కూర్చుండబెట్టాలి. టూత్ పేస్ట్, బ్రష్ ను, పట్టుకొని, బ్రష్ వెనుకవైపు చూపుతూ వారి అందరి ముందు నడిచెదరు. అద్దము వెనక వైపు చూపుతూ దువ్వెన వెనుకవైపుకు పెట్టి దువ్వెదరు. ఈ విధంగా కుర్చీలలో కూర్చున్నవారిని ఆటపట్టించెదరు.
మరమరాల దండలు, కూరగాయలతో దండలు, చాక్లెటు కాగితముతో దండలు, కిరీటములు, వడ్డాణము, వంకీలు, టోపీలు, బంగారు కలరు పేపరుతో తయారుచేసినవి పెట్టి ఆట పట్టింతురు.
బిస్కట్లతో తయారు చేసిన చీర పెట్టెదరు, దోసకాయ చదరముగా గుంటచేసి నిమ్మచెక్కలో నూనె పోసి వెలిగించి, దోసకాయలో పెట్టి కుడిచేతితో దోసకాయ తొడిమ పట్టుకొని ఎడమచేతితో హారతి అద్దెదరు. లేనిచో బంగాళదుంప గుంటచేసి నూనెపోసి వత్తి పెట్టి ఎడమచేతితో హారతి ఇస్తారు.
ఒక ప్లేటు పట్టుకొని స్పూనుతో కొడుతూ శబ్దము చేయుదురు. వియ్యపురాలికి లడ్డు, అరిశెలు, అప్పడాలు, వడియాలు, మినపపిండి ముద్ద, చీర, పసుపు కుంకుమ తాంబూలం అందజేస్తారు. ఈ వేడుకకు వచ్చినవారందరికి గుర్తుండేవిధంగా పంచి పెట్టు సామాను బహుమతిగా ఇస్తారు.
పెండ్లి కొడుకు తల్లి పెండ్లికూతురు తల్లిని వారి బంధువులను కుర్చీల్లో కూర్చుండ పెట్టి ఇదే విధముగా జరుపుదురు. స్నాతకము అయిన తరువాత ముఖాలు కడిగించి వివాహ వేదిక వద్దకు రమ్మని చెప్పెదరు. ఈ వేడుక ఆ సమయంలో కుదరనిచో వివాహము అయిన తరువాత ఇరువర్గాలవారు ఎదురెదురుగా కూర్చొని సరదాగా జరుపుకొందురు.