నిష్క్రమణ
Niskhkramana Samskaram -Exit
Telugu Tradition : Niskhkramana Samskaram – నిష్క్రమణ అంటే బిడ్డను మొదటిసారిగా ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతి శక్తుల నుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (భౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. కానీ వైదిక సాహిత్యంలో ఈ సంస్కారానికి విపులమైన ప్రస్తావన లేదు. బహుశా ఇది సాధారణ సంస్కారం కావచ్చును.
ఈ నిష్క్రమణ సంస్కారాన్ని శిశువు పుట్టిన పన్నెండవ రోజు నుంచి నాల్గవ మాసము వరకు చేయవచ్చునని భిన్న సాంప్రదాయములు ఉన్నవి. 12వ రోజునే ఈ నిష్క్రమణ సంస్కారాన్ని చేయాలని భవిష్యపురాణము, బృహస్పతి స్మృతి తెలుపుచున్నది. అంటే నామకరణము అయిన వెంటనే శిశుకు సూర్యుని దర్శనము చేయించవలెను. మరికొంతమంది మూడవ మాసములో సూర్యదర్శనము అని, నాల్గవ మాసములో చంద్రదర్శనము అని పేర్కొన్నారు. గృహ్య సూత్రములను అనుసరించి తల్లిదండ్రులు ఈ సంస్కారము చేయుటకు అర్హులు. కానీ ముహూర్త సంగ్రహము ప్రకారము మేనమామ ఈ సంస్కారము చేయవలెనని తెలపుచున్నది. విష్ణు ధర్మోత్తరము ఈ సంస్కారాన్ని పిల్లవానిని సాకే దాది చేయవలెనని తెల్పుచున్నది.
చేయవలసిన విధానము
సూర్యరశ్మి పడు ప్రదేశమును ఆవుపేడచే అలికి స్వస్తిక్ ముద్ర వేసి దానిపై ధాన్యమును చల్లవలెను. కులదేవతల సమక్షములో వాద్య సంగీతములతో దేవతా పూజ చేయవలెను. అష్టదిక్పాలకులను, సూర్య చంద్ర వాసుదేవులను, ఆకాశమును స్తుతించుట, బ్రాహ్మణ భోజనము, శుభ సూచకమైన శ్లోకములను చదువుట, శంఖధ్వని, వైదిక మంత్రము లను చదువుచుండగా శిశువును తండ్రి బయటకు తీసుకు వచ్చి శకుంత సూక్తము (స్వస్తినః శకునే అస్తు….. ప్రతినస్సుమనాభవ)ను గాని లేదా “ఈ శిశువు ప్రమత్తుడైనను అప్రమత్తుడైనను, దినమైనను, రాత్రియైనను, ఇంద్ర పురోగాములైన దేవతలు వీనిని రక్షింతురుగాక” అను అర్థముగల శ్లోకమును చదువును. ఆ తరువాత శిశువును తీసుకొని దేవాలయమును వెళ్ళి స్వామివారిని పూజించి, ఇంటికి తీసుకొని వచ్చి మేనమామ ఒడిలో కూర్చుండబెట్టవలెను. తరువాత బంధుమిత్రులు కానుకలిచ్చుట, ఆశీర్వచనములు చేయుట జరుగును.
బృహస్పతి ప్రకారము శిశును చక్కగా అలంకరించి, వాహనముపై ఉంచిగాని, మేనమామ ద్వారా కానీ బయటకు తీసుకు రావలెను. అప్పుడు మేళతాళములో బంధువులు ఆ శిశువువెంట ఉందురు. ఆవుపేడతో అలికిన సూర్యరశ్మి తగిలే ప్రాంతంలో ధాన్యము చల్లుదురు. “త్ర్యంబకం యజామహే” మొదలైన మృత సంజీవన మంత్రములను తండ్రి జపిం చును. తరువాత శివుని, వినాయకుని పూజించవలెను. పిల్లలకు తినుబండారములు పంచవలెను. ఈ సంస్కారమువలన శిశువు యొక్క లేత మనస్సుపై సృష్టి యొక్క గొప్పతనము ముద్రపడునని భావన.
చంద్ర దర్శనము
శిశువునకు సూర్యదర్శనమువలెనే చంద్రుని కూడా చూపించవలెనని కొన్ని సంప్రదాయములు ఉన్నవి. తండ్రి పశ్చిమముగా తిరిగి నమస్కరించు చుండగా, భార్య దక్షిణ భాగమునకు వచ్చి కుమారుని వెల్లకిల త్రిప్పి ఉత్తరమువైపు శిశువు తల పెట్టి భర్తకు కుమారుని ఇవ్వవలెను. తరువాత ఆమె వెనుకగా వచ్చి ఉత్తరపు వైపున నిలబడి ఉండగా కొన్ని మంత్రములను చదివి పిల్లవానిని తల్లికి ఇచ్చి తండ్రి ఈ సంస్కారాన్ని పూర్తి చేయునని, ప్రతి శుక్లపక్షపు నెల పొడుపు రోజున చేతిలో నీటిని తీసుకొని చంద్రుని పూజించవలెనని ఈ విధముగా ఒక సంవత్సరము చేయవలెనని అష్టాదశ కల్ప సూత్రము చెప్పుచున్నది.