దేవదాసి నృత్యం
Devadasi Dance
Telugu Traditional Dance : Devadasi Dance –
ఆంధ్ర దేశంలో దేవదాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. దేవదాసీల నృత్యకళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. దేవదాసీలు దేవాలయాల నృత్యమండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాల ననుసరించి అరాధన నృత్యాలూ, అష్టదిక్పాలక నృత్యాలు, నలూ, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు. కేశికా ప్రదర్శన
కచ్చేరీ నృత్యకళ
ఒకే నర్తకి ఏకథాటిగా నృత్యం చేయడం కచ్చేరీ నృత్యకళ యొక్క ప్రత్యేకత. రాజాస్థానలలో అభివృద్ధి చెందిన ఈ కళ దేవదాసీలచే ఆరాదింపబడి ఆంధ్ర దేశంలో కచ్చేరీ కళగా రూపొందింది. ఆంధ్ర దేశంలో అభివృద్ధి పొందిన కూచిపూడి నాట్యానికి, దీనికీ ఏ విధమైన సంబంధమూ లేదు. ఈ కళను బొబ్బిలి, విజయనగరం, కార్వేటి నగరం, వెంకటగిరి, కాళహస్తి మొదలైన సంస్థానాధిపతులు పోషించారు.
ఆనాటి నాట్య శాస్త్రకారులు నృత్యాన్ని, నృత్తాన్ని, అభినయాలను మేళవించి ఒక నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక నృత్యకళగా కచ్చేరీ నృత్యకళను ప్రచారంలోకి తీసుకవచ్చారు. దేవదాసీలు క్షేత్రయ్య పద సాహిత్యానికి నృత్యాభినయాలను రూపకల్పన చేసి ఈ కచ్చేరీ నృత్య కళను ప్రదర్శించే వారు. ఆస్థానాల పోషణ తగ్గిన అనంతరం, దేవదాసీలు కేవలం ఉదర పోషణార్థం దీనిని ఉపయోగించారు. సాత్విక ప్రధానమైన ఈ నృత్యకళ ఈ నాడు ఆంధ్రదేశంలో అక్కడక్కడ వృద్ధ దేవదాసీల సొత్తుగా వుందని నటరాజ రామకృష్ణగారు తెలియజేస్తున్నారు.
నట్టువ మేళాలు
ఈ కచ్చేరీ నృత్యకళనుంచి ఉద్భవించినవే నట్టువ మేళలు. కచ్చేరీ నృత్య కళ కేవలం రాజ్యాశ్రమమైనది. ఈ నట్టువ మేళాలు అఖిలాంధ్ర ప్రజానీ కానికి పరిచయమైనవి. ఇది వీధి కళారూపమని చెప్పవచ్చు. వివాహాది వూరేగింపుల్లోను, మేజువాణీలలోనూ, గొప్ప గొప్ప తిరునాళ్ళలోను, దేవుని కళ్యాణ ఉత్సవాలలోనూ ఇవి ప్రదర్శింపబడేవి. పండితులనే కాక పామరుల్ని కూడా రంజింప జేయగల కళారూపమిది. మొరటు హాస్యపు పాటలతో కూడా ప్రేక్షకులను రంజింప చేయడం కద్దు. కచ్చేరీ నృత్య కళకూ, నట్టువ మేళాలకూ అవినాభావన సంబంధంముంది.
ఈ రెండు కళలనూ ఆరాధించిన వారు ఎక్కువ మంది దేవదాసీలే. కచ్చేరీ ఆట దేవాలయాల్లో జరిగేటప్పుడు వీరు మేళ ప్రాప్తితో ప్రారంభించి, పుష్పాం జలి, పేరణి, గీతం, శబ్దం, లసాం, జతి, వర్ణం, పదం, జావళి, తిల్లాన లేక దరువుతో ముగిస్తారు.
శబ్దం, సలాం, జతుల్లో ఆంతరింగిక ప్రధానమైన ముద్రలు విశేషంగా ప్రదర్శించే నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ తరువాత వర్ణంలో నృత్త నృత్యాలు సమంగా పోషించి సాత్వికాభినయ ప్రాముఖ్యంతో, జావళీలలో ప్రదర్శించి తిల్లాన నృత్యంతో ప్రదర్శనం ముగిస్తారని నటరాజ రామకృష్ణగారు వివరించారు.