Telugu Dance Tradition : Dappu Dance
పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ఈ నృత్యం ముందు మెల్లగా ప్రారంభమై రాను రాను పద విన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది.
డప్పు వాయిద్యానికి అనేక పేర్లు
డప్పు దీనిని కొన్ని ప్రాంతాలలో పలక అని కూడ అంటారు. డక్కి లాంటి ఆకారమె కలిగి వుంటుంది. కాని పెద్దది. రెండడుగులు వ్వాసం కలిగి వుంటుండి. దీనిని ఎక్కువగా దండోరా వేయడానికి పల్లెల్లో దీనిని గతంలో ఎక్కువగా వాడేవారు.
అదేవిదంగా చావు వంటి కార్యాలకు వాడుతారు. ఈ వాయిద్యాన్ని మాదిగలు వాయించుతారు. ఆధునిక భారతీయ వాయిద్యాల్లో డప్పు చాలా ముఖ్యమైనది. డప్పుకు చాలా పేర్లు ఉన్నాయి. కొయ్య, తప్పెట, కనక తప్పెట, టికోరా అనేవి ప్రధానమైన పేర్లు.
చిత్తూరు జిల్లాలో దీన్ని పలక అంటారు. వీటిల్లో తప్పెట, డప్పు, పలక, కొయ్య అనే పేర్లు పెద్ద డప్పును సూచిస్తాయి. రెండో రకం డప్పు పరిమాణంలో చిన్నది. అందులో కనక తప్పెట మధ్యస్థంగా ఉంటుంది. టకోరా మరీ చిన్నది.
డప్పును ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు?
డప్పు చిర్రను డప్పు పుల్ల, లేక పలక పుల్ల అంటారు. దీన్నే చిటిక పుల్ల అంటారు. డప్పువాయిద్యాన్ని అరుంధతీయులే వాయిస్తారు. డప్పును పెండ్లిళ్లలోను, ఉత్సవాల్లోను వాడతారు. రాజకీయపార్టీల ఊరేగింపుల్లో అదే ప్రధాన ఆకర్షణయింది. చాలామంది ఇంట్లో ఎవరైనా మరణించి నప్పుడు డప్పుల మోత మధ్య స్మశానవాటికకు తీసుకువెళతారు. డప్పును వేడి చేస్తే బాగా మోగుతాయి. జాతర్ల సమయంలో, బైరాగి, బండవేషం, తోటి వేషం, దొరవేషం, మాతంగి వేషం వేస్తున్నప్పుడు డప్పులు ఉండా ల్సిందే. అట్లాగే గరగలు, బుట్టబొమ్మలు, మరగాళ్ళు, ఎలుగుబంటి, పులి వేషం వేసేటప్పుడు కూడా డప్పు మోగాల్సిందే. గ్రామ పోలి చేసేటప్పుడు బలి అనేది ప్రధానం. ఈ బలి సందర్భంలోనూ డప్పును మోగిస్తారు.
డప్పు దరువులు
డప్పుకు సంబంధించి 30 దరువులున్నాయి. వీటినే దెబ్బలని కూడా అంటారు. జాతర దరువు, దేవుని ఊరేగింపు దరువు, పరుశురాము దరువు, కొలుపుల దరువు, దండోరా, చిటికెల దరువు, గడి ఆటల దరువు, గంగమ్మ దరువు, దున్నపోతు దరువు, చావు దరువు… ఇట్లా రకరకాల దరువులుంటాయి.
డప్పు నేర్పే ప్రత్యేక గురువులుండరు. తరాలవారీగా సంప్రదాయంగా ఈ విద్య తరువాతి తరాలకు అందుతూ వస్తోంది.