Telugu Dance Traditions : Dandari Dance
గోండులు పండుగలు, శుభకార్యాలు, ఇతర ఉత్సవాల సందర్భంగా నృత్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. దీపావళి పండగంటే వీరికి మహా ప్రీతి. ఈ పండగ సందర్భంగా వీరు పలు రకాల నృత్యాలను అభినయి స్తుంటారు. గుస్సాడీ, దండారి, దింసా తదితర సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈ నృత్యాలన్నీంటిలోకి దండారి నృత్యం ప్రధానమైంది.
ఈ నృత్యాన్ని దీపావళి పండగకు వారం రోజుల ముందు చేస్తారు. అప్పటికి వర్షాకాలం ముగుస్తుంది. పచ్చని చెట్లు, పచ్చదనం మధ్య ఈ నృత్యాలను ప్రదర్శిస్తారు.
నృత్యం చేసే వారికి వయస్సుతో పట్టింపు ఉండదు. ఒకరి భూజాల మీద ఇంకొకరు చేతులు వేసి పాటకు లయబద్దంగా అడుగులు వేస్తూ చేసే దండారి నృత్యం ఇంపుగా ఉంటుంది. పాటలన్నీ గోండి భాషాలోనే ఉన్నప్పటికికి ఆ భాషా రాని వారికి కూడా వినసొంపుగా ఉంటుంది. అడవిలో ఒంటరిగా ఉన్న గిరిజన కన్నెను యువకుడు ఆటపట్టించే సంఘటనను గమేలా పాటగా పడతారు. అడవిలో లభించే నెమలి ఈకలు, పశువుల కొమ్ములు, సహజమైన రంగులతో నృత్యకారులు అలంకరించు కుంటారు.
గ్రామాంతరంలో ప్రదర్శన
దండారి పండుగను తమ గ్రామంలో జరుపుకోవడమే కాకుండా చుట్టు పక్కల గ్రామాలతో సంబంధాలు పెంచుకోవడానికి ఆ గ్రామాలకు అతిథులుగా వెళ్లి అక్కడ తమ నృత్యాలను ప్రదర్శిస్తారు. అనంతరం దేవతలను ప్రార్థించి తమ గ్రామాలు, వ్యవసాయ భూములు, కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటారు.
కలాపం
నృత్య–సంగీత ప్రధాన పాత్రలతో నడిచే నాటకీయతతో కూడిన కళా రూపాన్ని కలాపం అని సాధారణంగా అంటారు. భామాకలాపం, గొల్లకలాపం ఈ ప్రక్రియలో పేరొందిన కళారూపాలు. కథ అంతగా లేకపోయినా, అభినయం, నృత్యం, పాట, సంగీతంతో సమ్మోహన పరిచే నాటక కళారూపం.