Telugu Tradition : Buttabommalu –
బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరు నాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉండేయి.
బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా ఉండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి.
ఇవి ఎత్తుగా ఉండి నడుము భాగము నుండి క్రిందికి దిగే కొద్దీ లోపల కాళీగా మారుతూ పెద్దగా బుట్ట ఆకారంలో మారుతుంది. అందువలననే వీటిని బుట్టబొమ్మలంటారు.
బొమ్మల పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి లోపలి భాగం డొల్లగా ఉండి బొమ్మ యొక్క కళ్ళభాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలో దూరి, తలను దూర్చి నృత్యంచేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది. ఇవి ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోద పరుస్తాయి. బుట్టబొమ్మలలో పలురకాలు ఉంటాయి.
రకరకాల బొమ్మలు
ఈ బొమ్మల్ని పురుషులే ఆడిస్తారు. ఈ బొమ్మల్లో భార్యాభర్తలు, వారి ప్రేమ కలాపాలు, వారి ప్రేమను భగ్నం చేసే దుష్టపాత్ర, స్త్రీ బొమ్మతో కామకేళీ విలాసాలు, ఇది చూచిన భర్త వెంటబడి దుష్టపాత్రను తరమడం తరువాత భార్య వెంటబడే పాత్ర, స్త్రీ పాత్ర క్షమించమని వేడుకోవడం … ఇలా బొమ్మల ప్రదర్శన సాగుతుంది. ఈ ప్రదర్శనానికి కూడా డప్పుల వాయిద్యముంటుంది. బొమ్మను ధరించిన పాత్రధారి కాళ్ళకు గజ్జెలు కట్టుకొని అడుగులు వేస్తుంటాడు.
గుర్రం బొమ్మ
గుర్రాల ముఖాలు చేసి, వానికి మేదర తడికతో శరీరాన్ని తయారుచేసి అలంకరించి ఒక మనిషి పాదాలకు రెండు మూడడుగుల పొడవు కర్రలు కట్టుకొని గుర్రం మెడవద్ద ఉన్న కన్నంలోంచి మొత్త వరకు పైకి వచ్చి గుర్రం మీద కూర్చొనికళ్ళెంపట్టుకు తోలుతున్నట్లు కనిపిస్తూ కింద గుర్రం నడుస్తున్నట్లు కట్టుకున్న కర్రలతో లయకు అనుగుణంగా నడుస్తాడు. ఇది చూడముచ్చటగా ఉంటుంది.
బుట్టబొమ్మల్లో పాములవాడి బొమ్మ కూడా ఉంటుంది. నాగస్వరం ఊదుతూ, నృత్యం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బొమ్మలు నాలుగైదు కూడా ఉంటాయి. ఈ బొమ్మలో శింగి, సింగడు వంటి హాస్యపాత్రలు కూడా ఉంటాయి. బొమ్మలను అతి సహజంగా జీవకళ ఉట్టిపడేలా రంగు రంగులలో చిత్రిస్తారు. ఇందులో కళాకారుడి ప్రతిభ కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది.
బుట్టబొమ్మల తయారీలో వివిధ పద్ధతులు :
మొదటి రకం : వెదురు బద్దలను సన్నగా చీల్చి వాటిని మధ్యలోనూ లోపలి భాగంలోనూ తగిన ఖాళీ వదిలి బొమ్మలకు అనువైన ఆకారాలుగా మార్చుకొంటారు. దానిపై దళసరి బట్టను చుట్టి సూదితో దగ్గరగా తగిన బిగువుతో కుడతారు.
తరువాత ఆబట్టపై చింత గింజల పొడి, ఉడకబెట్టిన పిండిలాంటి గంజి మిశ్రమంగా చేసి గుడ్డపై పూస్తూ పోతారు. అలా నాలుగైదుసార్లు రాసి కావలసిన మందంవచ్చాక ఎండలో పెట్టి దానిపై ఉడ్ ప్రైమరీ అనబడు పెయింటును పూస్తారు.
తరువాత ఆయిలు పెయింట్లతో అందముగా అలంకరించి ప్రదర్శనకు సిద్ధము చేస్తారు. రెండవరకం – తలభాగమును షాపులలో కొని దానికి మిగిలిన ఆకారాన్ని సన్నటి ఇనుప ఊచలను కావలసిన ఆకారంలో వంచి దానిపై ఈనెలతో అల్లిక చేస్తారు. అలా అల్లుతూ కావలసిన బొమ్మ ఆకారం తయారు చేస్తారు. దానిపై దలసరిబట్టను వేసి తరువాత మిగిలినదంతా మొదటి రకంగానే చేస్తారు.
మూడవ రకం : ఇది నూతనంగా కొంచెం ఎక్కువ పెట్టుబడి కలిగినది. రబ్బరును కావలసిన ఆకారములో కత్తిరించి కొన్నిచోట్ల ప్లాస్టిక్ విని యోగించి పూర్తి చేస్తారు. తరువాత బొమ్మకు పెయింట్ల అవసరం లేకుండా మామూలు బట్టలు జుట్టు మొదలయినవి అతికిస్తారు.
ఈ విధానంలో తయారైన బొమ్మలు సహజంగా ఉండి చూపరులకు ఆనందాన్ని కలిగిస్తాయి.