బొట్టు

Bottu

Telugu Marriage Tradition : Bottu –

ముఖాన బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం ఒక హిందూ సంప్రదాయం. హిందూమతంలో మాత్రమే బొట్టు పెట్టుకొనే ఆచారముంది. ప్రపంచంలో ఇతర మతాలలోనూ ఆచారం కన్పించుట లేదు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పింప ఎవరికీ శక్యం కాదు. కాని ఎవ్వరు ముఖాన బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మరాసిన రాతను కూడా చెరిపి మంచిరాత వ్రాసుకుంటారనే నమ్మకం కొందరిలో ఉంది.

ఐదోతనానికి బొట్టు చిహ్నం

హిందువుల సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్లిన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు.. శుభ కార్యాలు చేయటానికి అర్హత లేదని హిందూ సంప్రదాయం చెబుతోంది. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకుని పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.

బొట్టుకు వివిధ ప్రయోగాలు

తెలుగు భాషలో బొట్టు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. బొట్టు అనగా బిందువు (A drop) లేదా శరీరం మీద పెట్టుకొనే చుక్క. నిలువు బొట్టు వైష్ణవానికి చిహ్నం అయితే అడ్డబొట్టు శైవానికి చిహ్మంగా భావిస్తారు. తాళిబొట్టు వివాహానికి గుర్తుగా స్త్రీలు మెడలో ధరించేది. బొట్టు కట్టు అనగా వివాహంలో తాళిబొట్టు కట్టడం లేదా వివాహం చేసుకోవడం. బొట్టుదారం అనగా మంగళసూత్రం అనే అర్థాలున్నాయి.

 



భక్తికి, ముక్తికి సోపానం బొట్టు

నుదుటి యందు సూర్య కిరణాలు సోకరాదు, ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. బొట్టు (తిలకం) ధరించడం వలన మనిషి భక్తి, ముక్తి కలిగి నిజా యితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు నుదుటి పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది, బొట్టు ధరించిన వ్యక్తి గౌరవాన్ని కూడా పొందుతారు.

దైవానికి చిహ్నం బొట్టు

హిందు సాంప్రదాయ ప్రకారంగ బొట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ఇది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటకు బ్రహ్మ దేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం (బొట్టు) పెట్టుకుంటారు.

మంగళకరం.. శుభకరం

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం.

ఒక్కొక్క వర్ణానికి ఒక్కోవిధమైన బొట్టు

పూర్వకాలంలో కాలములో చతుర్వర్ణాలవారు అయిన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు.

పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణులు పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవారు.

క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు వారు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదటన ధరించే వారు.

వర్తక వ్యాపారాల ద్వారా సంపదను పెంపొందించుకునే వైశ్యులు అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవారు.

శూద్రజాతికి చెందిన వారు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించేవారు. విష్ణు ఉపాసకులు యు(U) ఆకారముగా చందన తిలకాన్ని, శైవ ఉపాసకులు భస్మ త్రిపుక్ట్రాన్ని, దేవి(అమ్మవారి) భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు.

ఆహ్వానానికి ముందు బొట్టు

బొట్టు పెట్టటం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవించడమూ హిందూ సంప్రదాయం. ఏవేలితో ఏం ప్రయోజనం?

బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి.. మధ్య వేలితే పెట్టు కుంటే ఆయువు పెరుగుతుంది. బొటనవేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

స్త్రీలకే కాదు పురుషులకు కూడా ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతుని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకుంటే సంప్రదాయం పాటిస్తున్నారని తెలియజేస్తుంది.

 

 

Read More : ఒడిబియ్యం

Leave A Reply

Your Email Id will not be published!