Telugu Traditional Games : Bongaralata –
కర్రతో చేయబడ్డ బొంగరాలు ఇప్పటికీ తిరునాళ్ళు మొదలైన చోట్ల అమ్ముతుంటారు. బొంగరం గుండ్రంగా, తల భాగం పెద్దదిగా (గోపురం పోలిగ్గా), మధ్య భాగం మూడు నాలుగు మెట్లుగా తగ్గుకుంటూ వచ్చి, కింద చిన్న బొడిపెం వంటిది ఉండి, దాని అడుగున మధ్యలో ఒక ఇనుప ముల్లు (ములుకు) ఉంటుంది. ఆ ముల్లు దగ్గరనుంచి మెట్ల చుట్టూ తలవరకూ నులక తాడు గానీ, నవారు తాడుగానీ చుట్టి, తాడు చివర చూపుడు వేలు, బొటన వేలుకీ మధ్య పట్టుకుని లాఘవంతో కిందికి విసిరితే అది కింద గిరున తిరుగుతుంది.
బొంగారాల ఆట ఎలా ఆడతారు?
ఈ బొంగరాలతో ఆట బలే గమ్మత్తుగావుంటుంది. ఆడే వాళ్ళంతా వాళ్ళ బొంగరాలకు తాళ్ళుచుట్టి సిద్ధంగా ఉంటారు. ఒకరు ఒకటి, రెండూ, మూడూ అనగానే అందరూ ఒకేసారి బొంగరాలు నేలబారున విసిరి అవి తిరుగుతుంటే ఎవళ్ళమట్టుకు వాళ్ళు తమ బొంగరాల్ని తమ తాళ్ళతో పై కెగరేసి ఎవరయితే ముందు అందుకుంటారో వారు గెలిచినట్టు. మిగతావాళ్ళంతా తమ బొంగరాలు నేలమీద తగుమోస్తరు వలయంగీసి అందులో పెడతారు. ఈ నెగ్గిన ఆటగాడు తన బొంగరానికి తాడుచుట్టి వానిమీదికి విసురుతాడు. దానిముట్లు అక్కడ కొన్నింటికి కన్నాలు పొడిచి తిరుగుతుంటుంది. దాన్ని మరల ఆ బొంగరందారుడు తాడుతో పైకి ఎగరేసి అందుకోవాలి. అలా అందుకోలేకపోతే మళ్ళీ ఆట మొదటికి వస్తుంది. అలా పొడిచిన కన్నాలను “పుచ్చా” లంటారు. ఒక్కొసారి ఆ బొంగరం తగలడంతో ఆ వలయంలోని కొన్ని బొంగరాలు గీతదాటి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఆ బొంగరాల తాలూకు వాళ్ళు కూడా తొలివ్యక్తిలాగే వలయంలోని బొంగరాలను కొడుతూ ఆడవచ్చు. అన్ని బొంగరాలూ బయటికి వచ్చేస్తే అందరూ నేలబారున బొంగరాలను తిప్పి మొదటిలాగే ఆడతారు.
జాగరూకతే ముఖ్యం
ఈ ఆటకు బొంగరం తిప్పడంలో నేర్పరితనం, గురిచూసి కొట్టగల గడం, అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఏమరుపాటు లేకుండా చూసు కుంటుండడం ముఖ్యం. ప్రఖ్యాత జానపదకధ “రాములమ్మకధ”లో ఈ బొంగరమే కధను క్లైమూక కు తీసుకెడుతుంది. శ్రీనాధుని పల్నాటి చరిత్రలో బాలచంద్రుని యుద్దాన్ముఖుని చేసింది కూడా ఈ బొంగరాలాటే.