బొమ్మల కొలువు

Bommala Koluvu

Telugu Festival Tradition : Bommala Koluvu

ఆంధ్రదేశంలో బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు పెడతారు. మరికొందరు సంక్రాంతికి కొలువు పెడతారు. బొమ్మలు పెట్టడం, బొమ్మలు నిలపడం, బొమ్మలు ఎత్తడం, అనే వ్యవహారం ప్రాంతీయ భేదాన్ని బట్టి ప్రయోగిస్తూ ఉంటారు.

దసరా నవరాత్రులలో పది రోజులు (9 రాత్రులు) సరదా బొమ్మల కొలువు పండగ జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా పండగ జరుగుతుంది. దీని అలంకరణకు తొమ్మిది మెట్లుంటాయి. వారి కళాదృష్టి, ఆర్థిక స్తోమత, సౌకర్యాలను బట్టి వాళ్ళు మెట్లపై రకరకాల బొమ్మలను అమరుస్తారు.

బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఎలా ఏర్పడింది?

భాద్రపద మాసంలో చివరి పదిహేను రోజులకు, అంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి మొదలు అమావాస్య వరకు గల రోజులకు మహాలయ పక్షమని పేరు. దీనికే యుద్ధ పక్షమని, పితృ పక్షమని కూడా పేర్లు ఉన్నాయి. పక్షం అంటే పదిహేను రోజులు. పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేస్తారు కాబట్టి పితృ పక్షమన్నారు. పదిహేను రోజులలో, ఎప్పుడో ఒకప్పుడు దేవతలకూ రాక్షసులకూ పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోయారు. అలా ఓడిపోయిన వారు రాక్షసుల ధాటికి తట్టుకోలేక, యుద్ధభూమి నుండి దూరంగా పారిపోయి అరణ్యాల్లో ఆశ్రమాలు నిర్మించుకుని జీవించ సాగారు. తమను అపజయ పరాభవం నుండి గట్టెక్కించమనీ, ఆపద నుండి కాపాడమనీ తమ ఇష్టదైవాలను ప్రార్థించారు. కొందరు దుర్గను, కొందరు సరస్వతిని, కొందరు లక్ష్మిని, మరి కొందరు ఆయుధ దేవతలను ఉపాసించారు. అలా కొన్ని సంవత్సరాలు నిష్ఠతో పూజలు సాగాయి. ఒక విజయదశమినాడు జగన్మాత ప్రసన్నురాలై పురుషులకు విల్లంబులు, వివిధ రకాల ఆయుధ విశేషాలూ ఇచ్చింది. వారి వారి స్త్రీలకు రంగులతో అలంకరించిన దేవతా విగ్రహాలను ఇచ్చింది. పురుషులందరూ దేవి ప్రసన్నం కావడంతో ఉత్సాహభరితులై, సాహసోపేతులై రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వారు యుద్ధానికి వెళ్ళిన ముహూర్తం ఉత్తరాషాఢ, శ్రవణానక్షత్రాల నడిమి కాలం. దీనికే అభిజిత్ లగ్నమని పేరు.

పురుషులందరూ యుద్ధసన్నద్ధులై వెళ్ళగా, స్త్రీలు తమకిచ్చిన విగ్రహాలను ఒకచోట నిలిపి పూజించారు. విధంగా స్త్రీలు దేవతలను పూజించిన పుణ్యశక్తి తోడు కావడంతో దేవతలు జయాన్ని సాధించారు. అందువల్ల దశమి విజయదశమిగా ప్రసిద్ధి పొందింది.

ఆనాడు స్త్రీలు తమకు లభించిన దేవతా విగ్రహాలను ఒకచోట కొలువుగా పెట్టి పూజించినబొమ్మల కొలువేదసరాకు బొమ్మలను కొలువుగా పెట్టే ఆచారంగా పరిణమించింది. తరతరాల నుండి నేటి దాకా సంప్రదాయం కొనసాగుతూనే ఉంది


బొమ్మలను అలంకరించే విధానం

పైమెట్లపై దేవుళ్ళ బొమ్మలను ఉంచుతారు. అమ్మవారి బొమ్మలు కూడా వుంచే ఈచోటుని సత్వగుణానికి ప్రతీకగా నిర్వచిస్తారు. కింద వున్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలు వుంచు తారు. అవి తామస గుణాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. మధ్య భాగములో క్షత్రియధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు, రాణి, యుద్ధవీరుల వంటి బొమ్మల నుంచుతారు. ఇక అన్నిటికన్నా పై మెట్టు మీదవుంచే కలశం దేవీ కరుణకు సూచనగా భావిస్తారు. మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షము లభ్యమవుతుందని అంటారు. ఇదీ బొమ్మలకొలువు తత్వము. మెట్లపై తెల్లని వస్త్రము పరచి పై బొమ్మలను అమర్చుతారు. ప్రాంతీయ భేదాలవలన బొమ్మలను అమ ర్చడంలో కొన్ని భేదాలు కనిపిస్తాయి.

తొమ్మిది రోజులు నిర్వహించే పూజా విశేషాలు

దీప ధూప నైవేద్యాలతో ప్రతిరోజూ లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజలు చేస్తారు. రోజూ ఒక కన్యకి (చిన్నఅమ్మాయి), ఒక సువాసినికి భోజనము పెట్టి తాంబూలం, అలంకరణ వస్తువులు, బట్టలు ఇస్తారు. ఇలా దసరా తొమ్మిది రోజులు చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రము పేరంటానికి ముత్తైదువులను, పిల్లలను పిలిచి, అందరికీ పసుపుకుంకుమ, తాంబూలము, దక్షిణ ఇస్తే తమకు అప్లైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. సమయములో మగువలంతా ఇచ్చుపుచ్చుకొనే కుంకుమ ఇల్లాలి సౌభా గ్యానికి చిహ్నము. అష్టగంధము, పసుపు ఆరోగ్యానికి చిహ్నాలు. మహిషా సురుణ్ణి చంపేందుకు దేవి కొంతకాలము సూది మొన మీద తపస్సు చేసిందంటారు. అందుకని బొమ్మల కొలువు ఉన్నన్ని రోజులు సూదిలో దారము పెట్టి ఏపని చెయ్యరు. బొమ్మల కొలువు ప్రతి సంవత్సరము చేస్తారు. కొన్ని ప్రాంతాలలో సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. బొమ్మలు అమర్చే పద్ధతి మాత్రం ఇదే. బొమ్మల కొలువు పెట్టడం మొదలుపెట్టాక సంవత్సరానికో మెట్టు చొప్పున తొమ్మిది మెట్ల వరకు పెంచుతూ వెళతారు. ప్రతీ సంవత్సరము తప్పనిసరిగా క్రొత్త బొమ్మ కొనడం సంప్రదాయం. ప్రస్తుతం ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీ బొమ్మలు కూడా చోటు చేసుకున్నాయి కానీ ఒకప్పుడు మట్టి బొమ్మలు, పింగాణీ బొమ్మలు మాత్రమే ఉండేవి.

బొమ్మల కొలువులో అలరారే బొమ్మలు

దేవుని బొమ్మలైన వినాయకుడు, రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, స్వాతంత్ర్య సమరయోధుల బొమ్మలు, పెళ్ళితంతు బొమ్మలు, హాస్యబొమ్మలు మొదలగునవి బొమ్మల కొలువలో అమర్చుతారు. దేవుళ్ళ బొమ్మలతో పాటు బొమ్మల కొలువులో తప్పకుండా పెట్టే బొమ్మలు కొన్ని ఉంటాయి. అవి పంచాంగం బ్రాహ్మడు, పెద్ద ముత్తైదువ, పచారీ కొట్టు కోమటి, అతని భార్య, తల్లీ పిల్ల, ఆవూ దూడ వంటివి. ఇవి కాక వివిధ జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు, పండ్లు, చెట్ల బొమ్మలుఇలా వారి వారి దగ్గరున్న బొమ్మలన్నీ కొలువులో పెడతారు. కాల క్రమంలో దేశనాయకుల బొమ్మలు, పురాతన కట్టడాల బొమ్మలు, ప్రయాణ సాధనాలు, వాహనాల బొమ్మల వంటివి కొలువులో చోటు చేసుకున్నాయి.

ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు, కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతికి, మరి కొన్నిచోట్ల దసరాకి ప్రత్యక్షమై ధూప, దీప, నైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి. బొమ్మల కొలువులు చిన్న పిల్లలతో పెట్టించి చుట్టుపక్కల నివసించే ఇల్లాండ్రను పిలిచి రాజూరాణీ, లేదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలకు పెళ్ళి చేయడమో లేదా పేరంటం చేయడమో చేసి వచ్చిన ఇళ్ళకు వాయిన మిచ్చి పంపే ఆచారం నేటికి కూడా కొన్నిచోట్ల కనబడుతూనే ఉంది.

దేవాలయాల్లో కూడా బొమ్మల కొలువు

దసరాకి బొమ్మల కొలువు పెట్టడం తమిళదేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది. ఇళ్ళలోనే కాకుండా నవరాత్రులలో దేవాలయాలలో కూడా బొమ్మల కొలువులు పెడతారు. మధుర మీనాక్షీ దేవాలయంలో ప్రతీ ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ దేవీ మూర్తులు కనిపిస్తాయి. ఆలయాలలో కూడా జరిపించడాన్ని బట్టి బొమ్మల కొలువు ఏనాటినుండో వస్తున్న సంప్రదాయంగా భావించవలసి వస్తుంది.

సంక్రాంతి – సంకురమయ్య సంక్రాంతి బొమ్మల కొలువులో ఉండే బొమ్మలు

ప్రతి సంక్రాంతికీ కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా సంక్రమణ పుణ్యకాలంలో భూలోకానికి దిగివచ్చి భూలోక వాసులనందరినీ పరిపాలిస్తాడు. ప్రతి సంవత్సరం, అతని వాహనం, అతని పరివారం మారిపోతూ ఉంటాయి. వివరాలన్నీ పంచాంగం చెప్తుంది. సంక్రాంతి పురుషుల్లే సంకురమయ్య అంటారు. అతడే చరాచర జగత్తునూ నడిపిస్తూ ఉంటాడు. ఆయనను స్వాగతిస్తూ, అతని గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. మనమంతా కాలపురుషుని దృష్టిలో బొమ్మలమే. బొమ్మలను రక్షించే భారం నీదే సుమా, అని సంకురమయ్యకు విన్నపం చేసేందుకే బొమ్మల కొలువు అని చెప్పుకుంటారు. విధంగా సంక్రాంతికి పెట్టే బొమ్మల కొలువులో ప్రధాన దైవం సంకురమయ్య. పసుపు వినాయకుడిని పూజించాక, పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురమయ్యగా సంభావించి, ఆహ్వానం పలికి, పూజిస్తారు. తరువాత తక్కిన బొమ్మలు పెడతారు.

ముఖ్యంగా సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం సంక్రాంతిలో బొమ్మల కొలువు పెడతారు. వినాయకుడితో, కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు. పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ కూడా తప్పకుండా పెడతారు. మిగతా విషయాలలో దసరా బొమ్మల కొలువు పద్ధతినే పాటిస్తారు. భోగినాడు పెట్టి, కనుమ రోజున కొలువు ఎత్తేస్తారు. అలా మూడు రోజులే ఉంటుంది కొలువు. సంక్రాంతి రోజు ప్రసాదాలతో పాటు పసుపు కుంకుమలు, తాంబూలం, ముత్తైదువలకు తప్పనిసరిగా ఇస్తారు. ధనుర్మాసం నడిపించిన గోదాదేవి బొమ్మను కూడా తాంబూలంలో ఇస్తారు.

సంకురమయ్య బొమ్మలు కుమ్మరి వారు ప్రత్యేకంగా చేసి మోతుబరి రైతులకు బహుమానంగా ఇచ్చేవారనీ, వీధుల్లోకి తెచ్చి మిగతా బొమ్మలతో పాటుగా అమ్మేవారనీ, ప్రస్తుతం బొమ్మల తయారీ కానీ, అమ్మకం కానీ, జాడ కానీ లేదని కొందరు ప్రముఖులు తెలుపుతున్నారు.

బొమ్మలపెట్టె తెరవడం ఓ సంబరం

బొమ్మలన్నీ పెట్టెల్లో పాత పట్టుగుడ్డలు (బొమ్మ పొత్తికలు) చుట్టి దాచడం ఒక పని, ఒక కళ. బొమ్మలకు ప్రత్యేకం చెక్కపెట్టెలు ఉండి, బొమ్మల పెట్టెలు ఆడపిల్లలకు బొమ్మలతో సహా సారె పెట్టే ఆచారం ఉండేది. బొమ్మల కొలువు పెట్టేందుకు బొమ్మల పెట్టె తెరవడం ఒక సంబరం. పెట్టెకు పెద్దవాళ్ళు, మగవాళ్ళు తండ్రి, పినతండ్రి పూజ చేసి, హారతి ఇచ్చి, ధూపం వేసి, అమ్మలగన్న అమ్మ పద్యం పిల్లలతో పాడించి జయ జయధ్వానాలతో పెట్టె మూత తీయడం, పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టడం అదో అపురూపమైన వేడుక. ఇలాంటి వేడుకలెన్నో ఇప్పుడు కేవలం తెలుగువారికి జ్ఞాపకాలుగానే మిగిలి పోయాయి.

 

Read More : సంకురుమయ్య

Leave A Reply

Your Email Id will not be published!